ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 02 : హైదరాబాద్కు చెందిన వంశీ మేర్ల స్పోర్ట్స్ ఫౌండేషన్ ప్రతిష్టాత్మకమైన భారత్ కే అన్మోల్ అవార్డును అందుకున్న మొట్ట మొదటి క్రీడా సంస్థగా నిలిచిందని భారత్ కే అన్మోల్ కార్యక్రమ రూపకర్తలు డాక్టర్ మహ్మద్ నిజాముద్దీన్, డాక్టర్ వెంకట గంజామ్ లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన ఒక వేడుకలో ఫౌండేషన్ ఛైర్మన్ వంశీ మేర్ల అవార్డును ఫౌండేషన్ తరపున అవార్డును స్వీకరించారు. సాకర్, రోలర్-స్కేటింగ్, కబడ్డీ, బ్యాడ్మింటన్ నుండి మోటర్స్పోర్ట్స్ వరకు అనేక క్రీడలలో ప్రతిభావంతులైనప్పటికీ ఆర్థికంగా ప్రతికూలతలు ఎదుర్కొంటున్న బాలురు మరియు బాలికలను ప్రోత్సహించినందుకు గానూ ఈ అవార్డు అందించారని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక సత్కారాలు పొందిన వ్యక్తులలో పద్మశ్రీ డాక్టర్ విజయ్ కుమార్ షా(ప్రముఖ సామాజిక కార్యకర్త), డాక్టర్ టిఎస్.రావు(వ్యాక్సిన్ల పితామహుడు), డాక్టర్ ఎస్ఎం.ఖాన్(దూరదర్శన్ డైరెక్టర్ జనరల్, న్యూస్), ఎయిర్ కమోడోర్ రషీద్ జాఫర్ ఖురేషి(కార్గిల్ వెటరన్), మీర్ మోతేషామ్(మాజీ మిస్టర్ వరల్డ్ రజత పతక విజేత), చంద్రకళ పాడియా(ప్రముఖ విద్వాంసు) వంటి ప్రముఖులు ఉన్నారని తెలిపారు.