చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి
శోక సంద్రంలో కుటుంబాలు
వనపర్తి, మార్చి 16(ప్రజాతంత్ర విలేఖరి) : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఈదుల చెరువులో మంగళవారం సాయంత్రం సరదాగ ఈతకోసం వెళ్లిన 9 మంది విద్యార్థుల్లో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రాత్రి వరకు తమ పిల్లలు ఇండ్లకు రాకపోవడంతో కుటీంబీకులు ఆందోళనచెందారు. ఆ క్రమంలో ముగురు విద్యార్థులు నీటిలో మునిగిపోయిన విషయం వెలుగు చూసుంది. విషయాన్ని పోలీసు, మత్స్యశాఖ, ఫైర్‌స్టేషన్ సిబ్బందికి తెలియజేశారు. రాత్రినుండే గల్లంతైనవారిని వెలికితీసే చర్యలు చేపట్టారు. వనపర్తి సిఐ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేపట్టారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ నిమిత్తం వనపర్తి పట్టణ శివారులోని ఈదుల చెరువు దగ్గరకు వెళ్లి సమాచారం సేకరించిన అనంతరం ముగ్గురు విద్యార్థులు చెరువులో గల్లంతయైనట్లు గుర్తించి వారికోసం ఈతగాళ్ల సహాయంతో గాలింపుచర్యలు చేపట్టి మృతదేహాలను వెలికి తీసారు.
బుధవారం ఉదయం బండారునగర్‌కు వారిని చెందిన ఎండి మున్న(15), ఎండి అజ్మద్(16), భరత్ (17)లుగా గుర్తించినట్లు పట్టణ ఎస్సై మధుసూధన్‌రెడ్డి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం వారి తల్లిదండ్రులకు అందించినట్లు తెలిపారు. ఘటనపై ఎస్సై మాట్లాడుతూ.. చెరువుల దగ్గరికి ఎవరూ వెళ్లకుండా తగిన చర్యలు తీసుకునేలా కృషిచేస్తామన్నారు. వనపర్తి పట్టణంలో సివిరామన్ పాఠశాలలో చదువుతున్న పదవతరగతి చెందిన ఈ విద్యార్థులు చెరువులో పడి మృతిచెందడంతో వారి కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.
విద్యార్థుల మృతిపట్ల రావుల ప్రగాఢ సంతాపం…….
పట్టణంలోని ఈదుల చెరువులో ఈతకోసం వెళ్లి దుర్మరణం పాలయిన విద్యార్థుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ పొలిటిబ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తనవంతు సహాయంగా ఒక్కొక్కరికి 5వేల రూపాయల చొప్పున ఆర్థికసహాయం అందజేశారు. టిడిపి నాయకులు మాజీ జడ్పీటిసి వెంకటయ్యయాదవ్, రవి యాదవ్, వారి కుటుంబాలను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ…చెరువుల దగ్గర రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. మృతుల కుటుంబాలకు నందిమల్ల అశోక్, నందిమల్ల రమేష్, నాయకులు, ప్రగాఢ సానుభూతి తెలిపారు.