బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
పాండవులకు మరలా పాత్రికామి ద్వారా వర్తమానం పంపారు. ధర్మరాజు తండ్రి ఆజ్ఞనుకాదనకుండా, హస్తినాపురం చేరుకున్నాడు. పెద్దలందరూ ధృతరాష్ట్రునికి ద్యూతం వద్దని సలహానిచ్చారు. గాంధారీ చెప్పి చూసింది. ఎవ్వరి మాటా దృతరాష్ట్రుడు వినలేదు. అనుద్యూతం ప్రారంభమైంది. ఈ సారి శకుని కొత్త పందాన్ని సూచించాడు. ఈ సారి ఓడిన వారు 12 ఏళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం అన్నాడు. ధర్మరాజు అంగీకరించాడు. అజ్ఞాతవాసంలో ఒక వేళ పట్టుబడితే మరలా అరణ్యవాసమూ అజ్ఞాతవాసం చేయాలన్నారు కూడా! శకుని మామ పాచికలు విసిరాడు. కౌరవులు అట్టహాసం గావించారు. ఈ సారి కూడా పాండవులకే పరాజయం.
పాండవులు మృగచర్మాంబరాలు ధరించారు. భీష్మ, ధృతరాష్ట్ర, విదుర, కృప, ద్రోణులకు నమస్కరించారు. అప్పుడు విదురుడు కల్పించుకుని ఈ వయస్సులో కుంతీదేవి వనవాసం చేయలేదు. కావున కుంతీదేవి తనవద్దనే వుంటుందన్నారు.కుంతీదేవి తన కుమారులన ఆవేషాల్లో చూసి బోరుమంది. తమ దుస్థితికి ఎంతగానో చింతించింది. వారికి పలు జాగ్రత్తలను చెప్పింది.భర్తల వెనుకనే ద్రౌపది జుట్టు విరబోసుకుని నడుచుకుంటూ వెళ్తుంటే అంత:పుర స్త్రీలు బోరుబోరున ఏడవడం ప్రారంభించారు.
దృతరాష్ట్రుని ఇంట్లో నక్కలు అరవడం మొదలుపెట్టాయి. ఉల్కలు రాలాయి. మబ్బులు లేకుండా మెరుపులు మెరిసాయి. భూమి కంపించింది. దృతరాష్ట్రుడు ఈ దుర్నిమిత్తాలను తెల్సుకుని ముందు ముందు ఏమి జరుగుతుందో అంటూ భయపడ్డాడు. పాండవులు వెళ్ళేటప్పుడు ఇలా చేశారట. ధర్మరాజు తన ముఖాన్ని గుడ్డతో కప్పుకున్నాడట. భీముడు తన భుజాలను చూసుకుంటూ నడిచాడట. అర్జునుడు ఇసుక చల్లుకుంటూ నడిచాడు. నకులుడు తన శరీరం నిండా దుమ్మ పులుముకుంటూవెళ్ళాడు. సహదేవుడు తన ముఖాన్ని దాచుకుంటూ వెళ్ళాడు.