న్యూదిల్లీ,జూలై 29: సెంట్రల్ దిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ప్రమాదానికి ముందు తీసిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. వీడియోలో వరద నీరు బేస్‌మెంట్‌లోకి ప్రవేశించడంతో లోపల ఉన్న విద్యార్థులు నీటిలో నుంచి మెట్ల దుగా బయటకు వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. లోపల ఉన్న విద్యార్థులు త్వరగా బయటకు రావాలంటూ ఓ వ్యక్తి చెప్తూ ఇంకెవరయినా లోపల ఉన్నారా అని ఆరా తీస్తున్నట్లుగా వీడియోలో వినిపిస్తుంది. అయితే మృతి చెందిన విద్యార్థులు బయటకు వచ్చేలోపే వరద చుట్టిముట్టి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
ఇలా చట్ట విరుద్ధంగా కోచింగ్ సెంటర్లు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న స్టడీ సెంటర్ల యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీలో అక్రమంగా నడిపిస్తున్న కోచింగ్ సెంటర్లపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. అక్రమంగా నడిపిస్తున్న 13 కోచింగ్ సెంటర్లకు దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ వేశారు. నిబంధనలకు విరుద్ధంగా కోచింగ్ సెంటర్లు నిర్వహించడం వల్లే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. శనివారం సాయంత్రం రావూస్ స్టడీ సర్కిల్‌లోని బేస్‌మెంట్‌లోకి అకస్మాత్తుగా వరద నీరు ప్రవహించడంతో ముగ్గురు విద్యార్థులు తాన్యా సోని, శ్రేయా యాదవ్, నవిన్ డెల్విన్ ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై విద్యార్థులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్‌పాల్ సింగ్‌లను అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ప్రమాదం జరిగిన మూడంతస్తుల భవనం సెల్లార్‌ను స్టోర్ రూమ్, పార్కింగుకు కేటాయిస్తామని ప్రణాళికలో చూపించి గ్రంథాలయంగా ఉపయోగిస్తున్నట్లు తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో 18 మందికి పైగా విద్యార్థులు అందులో ఉన్నట్లు తెలిపారు. సెల్లార్‌లో మురుగునీరు బయటకు వెళ్లే వ్యవస్థ కూడా లేదన్నారు.