కొడంగల్, ప్రజాతంత్ర, జూలై 27: అదును దొరికితే చాలు సాకులు చూపి విధులకు డుమ్మాలు కొట్టే నేటి సమాజంలో ఓ ఏ ఎన్ ఎమ్ జోరు వానను లెక్కచేయక పారుతున్న వాగును దాటి వైద్యం అందించిన ఘనత వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ పి హెచ్ సి పరిధిలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం పి హెచ్ సి లో ఏ ఎన్ ఎమ్ గా విధులు నిర్వహిస్తున్న అనిఫా బేగం మండల పరిధిలోని కుదురుమళ్ళ గ్రామం సబ్ సెంటర్లో విధులు నిర్వహిస్తుంది. ఐతే ఉన్నతాధికారుల ఆదేశానుసారం నేడు గతంలో కొరోనా టీకా వేయించుకున్న గ్రామస్థులకు బూస్టర్ డోస్ వేయాల్సిఉంది .
మండలంలో నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలకు చిన్నపాటి వాగులు వంకలు పొంగి పొర్లు తున్నాయి.
గ్రామ ప్రజలకు ఎలగైనా వైద్యం అందించాలనే తన తపన ముందు వర్షం వాగు ఏవీ అడ్డుకాలేదు. నడుము లోతు వాగును దాటి వైద్యం అందించారు. .సాహసం చేసి అంకిత భావంతో సేవలు అందించిన అమెను పలువురు గ్రామస్తులు అభినందించారు.