- అధికారులు అప్రమత్తంగా ఉండాల
- అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కెటిఆర్ సవిక్ష
- జంట జలాశయాలను పరిశీలించిన దానకిశోర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 27 : వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌తో పాటు పలు పట్టణాల్లో పరిస్థితులపై ప్రగతి భవన్ నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి, పురపాలక శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షాలు, వరద పరిస్థితులపై ఉన్నతాధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రాణనష్టం జరుగకుండా చూడడమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. వర్షాలు కొనసాగితే ముందు జాగ్రత్తలపై సిద్ధంగా ఉండాలన్నారు.
పునరాతన భవనాలను తొలగించే పనులు చేపట్టాలని, కల్వర్టులు, వంతెనల వద్ద హెచ్చరిక సూచీలు పెట్టాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి సేవలు వినియోగించుకోవాలన్నారు. పురపాలికలో సహాయ చర్యలను సీఎండీఏ పర్యవేక్షించాలని చెప్పారు. పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలని, సాగునీటి వనరులకు సంబంధించిన పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. వర్షాలు తగ్గాక అవసరమైతే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. జంట జలాశయాలను బుధవారం ఉదయం జలమండలి ఎండీ దానకిశోర్ సందర్శించారు. వరద ప్రవహాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అధికారులతో సవిక్ష జరిపారు. రెండు జలాశయాల వద్ద భద్రత మరింత పెంచాలని సూచించారు. సామాన్య ప్రజలు, సందర్శకులు ఇటువైపు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మూసీ నదిలోకి నీటిని వదులుతున్నందున అప్రమత్తంగా ఉండాలని నది పరివాహక ప్రాంతాల వారికి సూచించారు. తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని జలమండలి, జీహెచ్‌ఎంసీ, పోలీసుల శాఖకు సూచించారు. మూడు పోలీస్ కమిషనరేట్లతో జలమండలి నిరంతరం సమన్వయం చేసుకొంటోందని తెలిపారు. గత సంవత్సరం ఒక్క హిమాయత్ సాగర్ నుంచే 26 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు, ఈసారి రెండు జలాశయాల నుంచి గతసారి కంటే తక్కువ నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి టెక్నికల్ డైరెక్టర్ రవికుమార్, ట్రాన్స్‌మిషన్ సీజీఎం దశరథ రెడ్డి, జీఎంలు, డీజీఎంలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.