వర్దన్నపేట బాలికల వసతి గృహంలో దారుణం

బల్లిపడ్డ ఆహారం తిని బాలికలకు అస్వస్థత
హుటాహుటిన వరంగల్‌ ఎం‌జిఎంకు తరలింపు
కొందరి పరిస్థితి విషమం…ఎంఎల్‌ఏ, ‌కలెక్టర్‌ ‌పరామర్శ
హాస్టల్‌ ‌వార్డెన్‌, ‌కుక్‌ ‌సస్పెన్షన్‌
‌హాస్పిటల్‌ ‌ముందు తల్లిదండ్రుల ఆందోళన
హాస్టల్‌ను సందర్శించిన ఐటిడిఎ పివో అంకిత్‌

వరంగల్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 6 : ‌బల్లి పడిన ఆహారం తిని విద్యార్థినులు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. ఈ ఘటన వరంగల్‌ ‌జిల్లా వర్ధన్నపేటలో జరిగింది. ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో బల్లి పడిన అన్నం తిని 34 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వారిని హుటాహుటిన వరంగల్‌ ఎం‌జీఎం హాస్పిటల్‌కి తరలించారు. 34 మంది విద్యార్థినుల్లో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ‌హెచ్చరించారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందుతుందని..తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని మంత్రి సత్యవతి రాథోడ్‌ ‌భరోసా ఇచ్చారు. వసతి గృహ సిబ్బంది నిర్లక్ష్యం విద్యార్థులను అస్వస్థతకు గురిచేయగా..కన్నవారు తల్లిడిల్లిపోయారు. వరంగల్‌ ‌జిల్లా వర్ధన్నపేట గిరిజన బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి భోజనం చేస్తుండగా..ఒకరి ప్లళెంలో బల్లిపడిన విషయాన్ని గమనించి గగ్గోలు పెట్టారు. అప్పటికే చాలా మంది భోజనం చేశారు. కొద్ది సేపటికే వాంతులు మొదలై విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు.

హుటాహుటిన వారిని వర్ధన్నపేట హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందించారు. మొత్తం 34 మంది విషాహారం తిన్నారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ ‌విద్యార్థుల ఆరోగ్య పరిస్ధితిపై వైద్యులతో ఆరా తీశారు. హాస్టల్‌ ‌వద్దకు చేరుకుని..విద్యార్థులు ఆందోళన చెందొద్దని ధైర్యం చెప్పారు. కడుపు నొప్పి, వాంతులతో పరిస్ధితి అందోళనకరంగా ఉన్న 13 మంది విద్యార్థులను వరంగల్‌ ఎం‌జీఎంకు తరలించగా వారిలో ఒకరి ఆరోగ్యం ఇంకా విషమంగా ఉంది. అప్రమత్తమైన వైద్యాధికారులు విద్యార్థులందరికీ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందించారు. జిల్లా కలెక్టర్‌ ‌గోపి హాస్పిటల్‌కి వొచ్చి పిల్లల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వైద్యులు చెప్పారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ‌హెచ్చరించారు.

హాస్టల్‌లో ఫుడ్‌ ‌పాయిజన్‌కు బాధ్యులైన వార్డెన్‌ ‌జ్యోతి, కుక్‌ ‌వెంకట్‌ను సస్పెండ్‌ ‌చేస్తూ జిల్లా కలెక్టర్‌ ‌గోపి ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజన బాలికల హాస్టల్‌లో సోమవారం రాత్రి బల్లి పడిన భోజనం తిని పలువురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంపై విచారణ జరిపారు. అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా వార్డెన్‌, ‌కుక్‌ను జిల్లా కలెక్టర్‌ ‌సస్పెండ్‌ ‌చేశారు. ఇక ఘటన విషయం తెలిసిన తల్లిదండ్రులు పరుగు పరుగున వరంగల్‌ ఎం‌జీఎంకు తరలివచ్చారు. హాస్టల్‌ ‌సిబ్బంది విద్యార్థుల బాగోగులు అస్సలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని..వారందరిపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్యులను మంత్రి సత్యవతి రాఠోడ్‌ ఆదేశించారు. మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పలు విద్యార్థి సంఘాల నేతలు హాస్పిటల్‌ ఎదుట ఆందోళనకు దిగారు.

పిల్లల ఆరోగ్యం పట్ల ఇంత నిర్లక్ష్యమా..పురుగుల అన్నం పెట్టి చంపుతారా..? : తల్లిదండ్రులు మండిపాటు
పిల్లలను మంచిగా చూసుకుంటారని హాస్టల్‌కు పంపిస్తే పురుగుల అన్నం పెడుతున్నారని వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతు న్నారు. తమ పిల్లలకు ఉన్నత చదువులు అబ్బాలని అనుకుంటే వారి ప్రాణాలతో చెలగామాడుతారా అని వారు మండిపడ్డారు. ఉన్నత చదువులు అందిస్తారని హాస్టల్‌కు పంపితే తమ పిల్లలను హాస్పిటల్‌కి పంపారని వాపోతున్నారు. ఫుడ్‌ ‌పాయిజన్‌కు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని వారు మండిపడుతున్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలన్నారు. వారికి ఏదైనా జరిగితే ఊరుకునేది లేదన్నారు. తమ పిల్లలను మంచిగా చూసుకుంటారని హాస్టల్‌కు పంపిస్తే పురుగుల అన్నం పెడుతున్నారని వారు మండిపడుతున్నారు. బల్లి పడిందని చెబితే దాన్ని తీసేసి తినాలని విద్యార్థులను వార్డెన్‌ ‌బెదిరించారని పేరెంట్స్ ఆరోపించారు. అదే ఫుడ్‌ను వార్డెన్‌ ‌తింటారా అని వారు ప్రశ్నించారు.

హాస్టల్‌ను సందర్శించిన ఐటిడిఎ పివో అంకిత్‌
‌వర్దన్నపేటలోని గిరిజన బాలికల హాస్టల్‌లో ఫుడ్‌ ‌పాయిజన్‌ ‌ఘటన నేపథ్యంలో ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ పీవో అంకిత్‌ ‌పరిశీలించారు. హాస్టల్‌లోని విద్యార్థులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. ఫుడ్‌ ‌పాయిజనింగ్‌ ‌ఘటనపై సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన వార్డెన్‌ను సస్పెండ్‌ ‌చేసినట్లు పీవో తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అసిస్టెంట్‌ ‌ఫుడ్‌ ‌కంట్రోలర్‌ అమృత శ్రీ కూడా ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page