వాయుగుండం ప్రభావంతో విస్తారంగా వర్షాలు

భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి
ప్రాజెక్టులకు భారీగా వచ్చి చేరుతున్న నీరు
పలు ప్రాంతాల్లో సింగరేణి బోగ్గు ఉత్పత్తికి అంతరాయం
పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం
అప్రమత్తంగా ఉండాలని  కలెక్టర్లకు సిఎస్‌ ఆదేశం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై20: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం తీరం వైపునకు కదులుతోంది. పూరీ తీరానికి 40 కిలో టర్ల దూరంలో వాయుగుండం కేంద్రకృతమైందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఒడిశా- ఛత్తీస్‌ ‌గఢ్‌ ‌మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

ప్రాణహిత నది వరద ప్రమాద స్థాయిని దాటి ప్రవాహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గోదావరి వద్ద నీటమట్టం 30.5 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. చర్లలోని తాలిపేరు ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 66900 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. నిజామాబాద్‌ ‌జిల్లాలోని శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టులోకి 18,275 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. శ్రీరాంసాగర్‌ ‌పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులుకాగా ప్రస్తుతం 1066 అడుగుల వరకు నీరు చేరింది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. నిన్న రాత్రి నుంచి వర్షం కురుస్తోనే ఉంది. అయితే ఈ వారాంతంలో తెలంగాణ రికార్డు వర్షపాతాన్ని నమోదు చేసింది. రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.

భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్‌ ‌సరఫరా కూడా నిలిచిపోయింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ములుగు జిల్లాలోని వెంకటాపురంలో అత్యధికంగా 109 మి.. వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్లలో 96.8 మి.. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఖమ్మం, మహబూబ్‌నగర్‌, ‌మహబూబాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, కరీంనగర్‌, ‌వరంగల్‌, ‌హనుమకొండ జిల్లాల్లో 40 నుంచి 80 మి.. వర్షపాతం నమోదైంది.

వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్‌, ‌కుమ్రం భీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌పెద్దపల్లి, నిజామాబాద్‌, ‌జగిత్యాల, సిరిసిల్ల, కరీనంగర్‌, ‌భూపాలపల్లి జిల్లాలకు రెడ్‌ అలర్ట్ ‌జారీ చేశారు. రాబోయే 18 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారీ వర్షాలపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.

ఉత్తర తెలంగాణా లోని 11 జిల్లాలలో ఈనెల 20 , 21 తేదీలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు.జూలై 20, 21 తేదీలలో 11 జిల్లాలకు ఆరంజ్‌ అలర్ట్ ‌ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్‌  ‌టెలీకాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. పెద్దపల్లి, కరీంనగర్‌, ‌ములుగు, కొమురం భీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, హన్మకొండ, జగిత్యాల, ఖమ్మం,కొత్తగూడెం, నిర్మల్‌ ‌జిల్లాల్లో ఈరోజు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ జిల్లాల కలెక్టర్లు ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాలతో కలసి ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రధానంగా వాగుల వద్ద తగు బందోబస్తును ఏర్పాటు చేసి, ప్రమాదకరంగా ప్రవహించే వాగులను ప్రజలు దాటకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు.

 

ఈ 11 జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్‌ ‌రూమ్‌ ‌లను ఏర్పాటు చేయాలని, పోలీస్‌ ‌తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించాలన్నారు. ఏ విధమైన సహాయం కావాలన్న రాష్ట్ర రాజధానికి ఏ సమయంలోనైనా సంప్రదించవచ్చునని ఆమె అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెద్ద వాగుకు వచ్చిన ఆకస్మిక వరదల వల్ల చిక్కుకుపోయిన దాదాపు 40 మందికి ఏవిధమైన అపాయం జరుగకుండా వివిధ శాఖల సమన్వయంతో కాపాడినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ ‌ను శాంతి కుమారి అభినందించారు. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో బానరి రాజు అనే వ్యక్తి వాగులో చేపల వేటకు వెళ్లి గల్లంతైనట్లు తెలుస్తోంది.

 

పడవల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పలుచోట్ల పత్తి, వరి చేళ్లు మునిగిపోయాయి. వరంగల్‌, ‌హన్మకొండ, జనగామ, మహబూబాబాద్‌ ‌జిల్లాలో చెరువులు, కుంటలు వర్షపు నీటితో నిండిపోతున్నాయి. భారీ వర్షాలతో పెద్దపల్లి జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. రామగుండం రీజీయన్‌ ‌లో నాలుగు ఓపెన్‌ ‌కాస్ట్ ‌ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో రోజుకు 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌ ‌పడింది. మంచిర్యాలలోని ఓపెన్‌ ‌కాస్ట్ ‌బొగ్గు గనులలో ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్‌, ఇం‌దారం, ఆర్కేపీ, మందమర్రి, ఖైరీగూడ గనుల్లోకి వర్షపు నీరు చేరడంతో 60వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కి విఘాతం ఏర్పడింది. సంస్థకు 10 కోట్ల మేర నష్టం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page