• ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం
  • వోటు వోటు పడేలా….లక్ష్యం…లక్షన్నర వోట్లు మెజారిటీ…
  • ప్రతీ 100 వోట్లకు ఓ ఇంఛార్జి
  • సిద్ధిపేట నియోజకవర్గంలో 2330పై చిలుకు ఇంఛార్జులు
  • ఎన్నికల వారం ముందే ఎన్ని వోట్లొస్తాయో తెలిసేలా సేకరణ
  • మరో అరుదైన రికార్డుకు…వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ట్రబుల్‌ షూటర్‌!
  • మంత్రి హరీష్‌రావుకు ప్రజలు, పార్టీ శ్రేణులే ప్రచారకర్తలు
(ఎ.సత్యనారాయణ రెడ్డి, సిద్ధిపేట, ప్రజాతంత్ర ):నవంబర్‌ 18: తన్నీరు హరీష్‌రావు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి. బిఆర్‌ఎస్‌ పార్టీలో ట్రబుల్‌ షూటర్‌గా పేరు.  రాత్రింబవళ్లు కష్టపడే మనస్తత్వానికి, అభివృద్ధికి కేరాఫ్‌. ఆపదలో ఉన్న వారికి ఆపద్భాందవుడు. వినూత్న ప్రయోగాలను సక్సెస్‌ చేయడంలో మంచి దిట్ట. ఒక మాటలో చెప్పాలంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఆయన సొంతం. 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో 1,18,699 వోట్ల భారీ మెజారిటీతో గెలిచిన హరీష్‌రావు..ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో సిద్ధిపేట నుంచి 7వసారి ఎన్నికల బరిలో బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా ఉంటున్న హరీష్‌రావు అరుదైన రికార్డును సొంతం చేసుకోవడానికి మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈసారి గెలిస్తే దేశంలోనే ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిగా రికార్డు సృష్టించనున్నారు.
ప్రస్తుతం  సిద్ధిపేటలో నెలకొని ఉన్న తాజా రాజకీయ పరిస్థితులలో గెలుపు ఎప్పుడో ఖాయమనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఈ ఎన్నికలలో లక్షన్నర వోట్లు భారీ మెజారిటీతో గెలవడమే హరీష్‌రావు లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్షన్నర వోట్ల భారీ మెజారిటీతో గెలవడం కోసం హరీష్‌రావు పక్కా ప్రణాళిక, వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఈ గెలుపు కోసం పకడ్బందీ ప్రణాళికను అమలు చేస్తున్నారు హరీష్‌రావు. ఈ ఎన్నికలలో వోటింగ్‌ శాతంను పెంచడంతో పాటు ప్రతి వోటు బిఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తుకు పడేలా ప్రతి వంద వోట్లకు ఒక ఇంఛార్జి చొప్పున సిద్ధిపేట నియోజకవర్గ మొత్తంగా 2330 మందికి పైగా ఇంఛార్జిలను నియమించారు. లక్షన్నర వోట్ల భారీ మెజారిటీతో గెలిచేందుకు ఇప్పటి వరకు రాజకీయ పార్టీల చరిత్రలో, ఏ అభ్యర్థి చేయని విధంగా సరికొత్త వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు హరీష్‌రావు. అందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇదే రాజకీయాలలో హాట్‌ టాపిక్‌. ఓటమెరగని హరీష్‌రావు రాజకీయం ప్రస్థానంపై  ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం.
వోటింగ్‌ శాతం పెరిగేలా…ప్రతి వోటు బిఆర్‌ఎస్‌కు పడేలా…
సిద్ధిపేట నియోజకవర్గంలో నంగునూరు, చిన్నకోడూరు, సిద్ధిపేట అర్భన్‌, సిద్ధిపేట రూరల్‌, సిద్ధిపేట, నారాయణరావుపేట, సిద్ధిపేట పట్టణం కలిపి మొత్తంగా  2 లక్షల 33 వేల 733 వోటర్లు ఉండగా…273 పోలింగ్‌ బూతులు ఉన్నాయి. వీటిలో సిద్ధిపేట పట్ణణంలో 115 పోలింగ్‌ బూతులుండగా…మిగతావి నంగునూరు, చిన్నకోడూరు, అర్భన్‌, రూరల్‌, నారాయణరావుపేట మండలాలో ఉన్నాయి. ప్రతి బూతుకు బూతు కమిటీ కన్వీనర్‌, సభ్యులు, సోషల్‌ మీడియా కన్వీనర్‌, కౌన్సిలర్‌  కన్వీనర్లుగా ఉంటారు. ఊరుకో వాట్సాప్‌ గ్రూపు పని చేస్తుంది. సిద్ధిపేట అసెంబ్లీ వ్యాప్తంగా కొన్ని వందల వాట్సాప్‌ గ్రూపులు పని చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక్కో పోలింగ్‌ బూతులో 500 నుంచి 1200 వరకు వోటర్లు ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి వంద వోట్లకు ఒక్కరు చొప్పున ఇంఛార్జిని నియమించారు. సిద్ధిపేట ఒక పట్టణంలోని 1020 మందికి పైగా బిఆర్‌ఎస్‌ నేతలు ఇంఛార్జులుగా పని చేస్తున్నారు. ప్రతి వంద వోట్లకు ఇంఛార్జిగా నియమించిన సదరు నాయకుడు తనకు అప్పగించిన వంద వోటర్లకు సంబంధించి…గ్రామం, వార్డు,  పోలింగ్‌ బూత్‌ నెంబర్‌, పోలింగ్‌ కేంద్రం, వోటరు పేరు, వోటరు పురుషుడా? స్త్రీయా? మొబైల్‌ నెంబర్‌, ఇంటి నెంబర్‌, కులం, వృత్తి, ప్రస్తుత నివాసం, ప్రభుత్వ పథకాల లబ్దిదారులా? అయితే వివరాలు. ఏ పార్టీకి చెందిన వారు. ఏ పార్టీకి వోటేస్తారు.
మొత్తం కుటుంబ సభ్యుల సంఖ్య ఎంత. వోట హక్కు కలిగి ఇతర ప్రాంతాలలో చదువుకుంటున్న వారి వివరాలు, మొత్తం వోటర్ల సంఖ్య తదితర వివరాలను అన్నింటిని సేకరిస్తున్నారు. ఈ సేకరించిన వివరాలపై మంత్రి హరీష్‌రావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు. ఈ సేకరణ వల్ల ప్రజల మూడ్‌ ఎలా ఉంది. బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రభుత్వ పని తీరు, సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అభ్యర్థి పని తీరుపై ప్రజల నుంచి ముందస్తుగానే ఒక ఫీడ్‌బ్యాక్‌ వొచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఈ సేకరణతో పోలింగ్‌కు వారం, పది రోజుల ముందుగానే ఎన్ని వోట్లు పడే అవకాశం ఉందనేది తెలిసి, ఎంత మెజారిటీతో గెలుస్తామనే దానిపై ఒక అంచనాకు వొచ్చే అవకాశం ఏర్పడుతుందనేది హరీష్‌రావు ఆలోచనగా తెలుస్తున్నది. ఏమైనా లోటు పాట్లు ఉన్నా, ప్రజలు అసంతృప్తితో ఉన్నా పోలింగ్‌కు ఇంకా సమయం ఉన్నందునా పోలింగ్‌ను పెంచేందుకు, వోట్లెయ్యడానికి వెనుకా ముందు ఆలోచన చేసేవాళ్లు ఎలాగయితే వోట్లు వేసే అవకాశం ఉందో తెలుసుకోవడానికి వంద వోట్ల ఇంఛార్జి పని తీరు, సేకరణ బిఆర్‌ఎస్‌ పార్టీకి బాగా ఉపయోగపడుతుందనీ తెలుస్తున్నది.
సిద్దిపేటలో గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిపై విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. ఒక్కో ఇంఛార్జి వంద మంది వోటర్ల వద్దకు వెళ్లి వారితో ముచ్చటిస్తున్నారు. హరీష్‌రావు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎలాంటి సేవలు చేశారు. ఆయన నుంచి ఇంకా మీరేం ఆశిస్తున్నారు? ఇంకా పరిష్కారం కాని సమస్యలేమైనా ఉన్నాయా? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. హరీష్‌రావును  మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని కోరుతున్నారు. వోటర్ల లిస్టుతోపాటు, హరీష్‌ చేసిన అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలను, పుస్తకాలను తమ వెంట తీసుకెళ్తూ వోటర్లకు అందులోని వివరాలు చేరవేస్తున్నారు. ఇంటింటికి పంచుతున్నారు. పోలింగ్‌ బూతుల వారీగా, వంద వోట్ల ఇంఛార్జిలతో హరీష్‌రావు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఇంఛార్జిలు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా హరీష్‌రావు వారికి ఎప్పటికప్పుడు పలు సలహాలు, సూచనలు ఇవ్వడంతో దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని విధంగా.
ఇతర జిల్లాలు…ఇతర దేశాల నుంచి…
రానున్న ఎన్నికలలో లక్షన్నర వోట్ల భారీ మెజారిటీతో గెలవడం కోసం సిద్ధిపేటలో అమలు చేస్తున్న వంద వోట్ల ఇంఛార్జి ప్రయోగంలో పట్టణంతో పాటు ఆయా గ్రామాలకు చెందిన వోటర్లు ఇతర జిల్లాలు, అమెరికా తదితర దేశాలలో నివాసం ఉంటున్నట్లు స్పష్టమైంది. దీంతో ఉద్యోగ రీత్యా, బతుకుదెరువు రీత్యా, చదువు రీత్యా ఇతర ప్రాంతాలలో ఉంటున్న పలువురు వోటర్లను పోలింగ్‌ తేదీ వరకు సిద్ధిపేటకు వొచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే అమెరికాలో ఉంటున్న పలువురు నవంబర్‌ 30న జరిగే పోలింగ్‌ తేదీ వరకు సిద్ధిపేటకు  వొచ్చేలా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
మంత్రి హరీష్‌రావుకు ప్రజలు, పార్టీ శ్రేణులే ప్రచారకర్తలు …వార్‌ వన్‌సైడే..
సిద్ధిపేట నియోజకవర్గంలో ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా గులాబీ పరిమళింపుతో వికసిస్తూ కనిపిస్తుంది. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా తన్నీరు హరీష్‌రావు చేసిన అభివృద్ధి పనులను నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ప్రజలు హరీష్‌రావును గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఆపద అన్నా, కష్టమన్నా, అభివృద్ధి అన్నా, ప్రయోగాత్మక ప్రయోగాలన్నా అందరికీ ఠక్కున గుర్తుంచే పేరు మంత్రి హరీష్‌రావు. హరీష్‌రావు అంటేనే సిద్ధిపేట. సిద్ధిపేట అంటనే హరీష్‌రావు అని ప్రతి పల్లెలో ఇదే మాట వినబడుతుంది. మంత్రి హరీష్‌రావు చేసిన అభివృద్ధి పనులతో సిద్ధిపేటలో ఈ దఫా జరగనున్న ఎన్నికల్లో లక్షన్నర వోట్ల భారీ మెజారిటీ లక్ష్యంగా పెట్టుకుని గెలిపించుకునే బాధ్యతను నియోజకవర్గంలోనిప్రతి కార్యకర్త ముందుండి, హరీష్‌రావును మెజార్టీతో గెలిపిస్తామంటున్నారు. మంత్రి హరీష్‌రావుకు ఈ ఎన్నికల్లో ప్రజలు, పార్టీ శ్రేణులే ప్రచారకర్తలుగా మారారు.  ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత నిర్వహించిన సిద్ధిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభ తప్ప ఈసారి మంత్రి హరీష్‌రావు ఎమ్మెల్యే అభ్యర్థిగా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ప్రచారం నిర్వహించిన దాఖలాలు లేవు. ఆయన ప్రచారం నిర్వహించకున్నా కూడా ప్రజలు, పార్టీ శ్రేణులే ఇంటింటికి తిరుగతూ మంత్రి హరీష్‌రావు తరపున ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే సిద్ధిపేట నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు హరీష్‌రావు దరిదాపులా కూడా వొచ్చే పరిస్థితులు కనుచూపు మేర కూడా కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, మంత్రి హరీష్‌రావు 2004 నుంచి సిద్ధిపేటకు  ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో 24,827 మెజార్టీతో విజయం సాధించారు. 2008 ఉప ఎన్నికల్లో 58,935 మెజార్టీతో గెలుపొందారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో తన మెజారిటీని పెంచుకుంటూ వెళ్తున్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 64,014వోట్ల మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తన పదవీకి రాజీనామా చేసిన ఆయన.. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో 95,858 ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక  తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో 93,328 వోట్ల మెజారిటీ, 2018 ఎన్నికల్లో 1,18,699 మెజార్టీతో విజయం సాధించి ప్రత్యర్థి పార్టీలకు కనీసం డిపాజిట్‌ కూడా దక్కకుండా చేశారు. ఈ సారి లక్షన్నర వోట్ల మెజారిటీని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఔర్‌ ఏక్‌ దక్కా…ఏక్‌ లాక్‌ పచ్చాస్‌ అజార్‌ పక్కా..హరీష్‌రావుకు కు జైకొడుతున్న గ్రామాలు..కొనసాగుతున్న ఏకగ్రీవాలు
ఎన్నికలప్పుడు కనపడే వాళ్లు కాదు. ఎల్లప్పుడూ మా కళ్ల ముందు ఉండే నాయకుడు, ఆపదలో నేనున్నాను అంటూ ఉంటూ అభివృద్ధి చేసిన మంత్రి హరీష్‌రావుకే మా వోట్లన్ని గంపగుత్తగా వేస్తామని నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలందరూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. ఎన్నికల పోలింగ్‌కు కేవలం 11రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండటంతో గ్రామాలలో ఏకగ్రీవ తీర్మానాలు చేసే సంఖ్య పెరుగుతుంది.
గ్రామాలలో ఏకగ్రీవ తీర్మానాలను చూస్తుంటే మరోసారి మంత్రి హరీష్‌రావుకు లక్ష వోట్ల మెజారిటీ తథ్యంగా కనిపిస్తుంది. ఈ దఫా కూడా మెజారిటీతో సిద్ధిపేట కీర్తి చరిత్రలో నిలవడం ఖాయమని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. సిద్ధిపేట నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గులాబీ హోరు…కారు జోరే అగుపిస్తుంది. పల్లెలు, పట్టణంలో ఎటు చూసినా కూడా ప్రజా హృదయానికే ప్రజలు పట్టం కడుతామంటున్నారు. మా ఇంటి కుటుంబ సభ్యుడు మంత్రి హరీష్‌రావుకు, బిఆర్‌ఎస్‌ పార్టీకే వోట్లన్ని ప్రజలు అంటున్నారు. ఓ వైపు గ్రామాల ఏకగ్రీవాలు, మరోవైపు కుల సంఘాల మద్దతు రోజు రోజుకూ పెరుగుతుంది.  గ్రామ గ్రామాన బిఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎవరి నోట విన్నా కారు..కేసీఆర్‌…మా సారు హరీష్‌రావు అనే మాటనే వినిపిస్తుంది.  మరోసారి అఖండ మెజారిటీ ఇస్తామంటున్నారు సిద్దిపేట ప్రజలు. అభివృద్ధి చేసాడు…మా ఆలోచనలు, మా మనసులో ఉన్న అభివృద్ధి మా కళ్ల ముందు ఉంచాడు అంటూ అలాంటి నాయకునికి మేమే ప్రచారాకులమంటూ బిఆర్‌ఎస్‌ పార్టీకి జన నీరజనం పలుకుతూ ఔర్‌ ఏక్‌ దక్కా…ఏక్‌ లాక్‌ పచ్చాస్‌ అజార్‌ పక్కా అంటున్నారు  సిద్ధిపేట నియోజకవర్గంలోని ప్రజలు.
లక్షన్నర వోట్ల మెజారిటీయే లక్ష్యం : పాల సాయిరాం
సిద్ధిపేటలో బిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తన్నీరు హరీష్‌రావును లక్షన్నర వోట్ల మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా బిఆర్‌ఎస్‌ శ్రేణులందరమూ పని చేస్తున్నామనీ బిఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధిపేట సీనియర్‌ నాయకుడు పాల సాయిరాం తెలిపారు. ఆయన శనివారమిక్కడ ‘ప్రజాతంత్ర’తో మాట్లాడారు. ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు తాజాగా..ప్రతి వంద మంది వోటర్లకు ఒక ఇంఛార్జి నియామకంతో పోలింగ్‌ శాతాన్ని పెంచేలా, హరీష్‌రావుకు లక్షన్నర వోట్ల మెజారిటీ వొచ్చేలా పని చేస్తున్నామనీ సాయిరాం తెలిపారు. హరీష్‌ రావు నాయకత్వంలో సిద్ధిపేటలో అభివృద్ధి కనీవినీ ఎరుగని రీతిలో జరిగిందనీ, ప్రజల సహకారంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుని రాష్ట్రంలో ఆదర్శ పట్టణంగా..సౌత్‌ ఇండియాలో బెస్ట్‌ మునిసిపాల్టీగా ఎన్నో అవార్డుల సాదించుకున్నామనీ, ఈ ఘనత హరీష్‌రావుదేననీ అన్నారు. గొప్ప అభివృద్ధి సాధించిన హరీష్‌రావు ఈ ఎన్నికలలో లక్షన్నర  వోట్ల  మెజారిటీతో గెలుపొందడం తథ్యమన్నారు. మొత్తంగా ఎక్కడ లేని విధంగా సిద్ధిపేటలో హరీష్‌రావు చేపట్టిన వంద వోట్లకు ఒక ఇంఛార్జి ప్రయోగం మంచి ఫలితాన్నే ఇవ్వనున్నదనీ గులాబీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా…ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు మాత్రం ఈదఫా కనీసం డిపాజిట్‌ దక్కించుకునే పనిలో ఉన్నారు. ఏం జరుగుతుందనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page