‘‘విచ్చుకుంటున్న వేయి పడగల స్వార్ధం’’

‘‘‌తాను మునిగిందే గంగ- తానొలచిందే రంభ’’ అన్నట్టుగా మూర్ఖ భావజాలంలో కొట్టుమిట్టాడుతూ యాంత్రిక జీవనమే సుఖప్రదాయినిగా భావిస్తూ,కేవలం ప్రాణమున్న మరబొమ్మల్లా,సాలెగూడు లాంటి  ఆధునిక సాంకేతిక వ్యవస్థలో కూరుకుపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు.అందుకే  ఆధునిక మానవుడు  కోటాను కోట్ల ప్రజల మధ్య ఒంటరి జీవనం సాగిస్తున్నాడు.రక్త సంబంధాలను వదిలేసి ఒంటరి కాంక్రీటు అరణ్యాల్లో అనాథగా బ్రతుకుతున్నాడు,పెద్దలను  అనాథాశ్రమాలకు వదిలేస్తున్నాడు.’’

నడుస్తున్న చరిత్ర స్వార్ధానికి పానుపు పరచింది. విలువలకు పాతరే సింది. వంచనకు నిచ్చెన వేసింది. అహంకారానికి  కరెన్సీ అలంకారం గా మారింది. నమ్మకం కొరగానిదై పోయింది. ద్రోహం పల్లకీ పై అట్టహాసంగా ఊరేగుతున్నది. విలువలు  వలువలు కోల్పోయి వితండవాదం చేస్తున్నాయి. అబద్ధం నిజమై అన్యాయం పరాకాష్టకు చేరుకుంది. మానవత్వం ఎండుటాకై రాలిపోతున్నది. ఎక్కడో ఒక చోట అరుదుగా  మానవత్వమనే మహావృక్షం  చిగురించి, ఫలాలు ఇస్తే, ఆ ఫలాలను  ఆరగించేసి, దాని శాఖలను నరికేసి, చివరికి నీడ నిచ్చిన వృక్షాన్ని సైతం  పెకలించి వేసే ప్రబుద్ధులు తయారైన నేపథ్యంలో ధరిత్రిపై విలువలకు విలువెక్కడ? మానవత్వానికి చోటెక్కడ?   అజీర్తితో తిన్నది అరక్క పోయినా, ఏదోలా కడుపారా తినేయాలనే తపన ఎక్కువైపోయింది. సముద్రమంత సంపద ఉన్నా  అనుభవించలేక,ఇతరులకు పెట్టడం ఇష్టం లేక  లోభత్వ గుణంతో కలిమిలో లేమి చవిచూస్తున్న మానసిక  పేదలను చూసి జాలిపడక తప్పదు. ఉన్న దాంట్లో కొద్దో గొప్పో అనాథలకు దానం చేద్దామన్న స్పృహ నేటి సమాజంలో కరువైనది. మన సొమ్ము మనమే తినాలి,పరాయి సొమ్ము భుజించేయాలి.

అందులోనే నిజమైన తృప్తి దాగి ఉందన్న  గొప్ప సూత్రాన్ని కనుగొని, ఆచరిస్తున్న  ఆధునిక లోకానికి  మానవతా వాదులు, సచ్ఛీలురు  చేతగాని వారిలా గోచరించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎవరికీ ఏమీ విదల్చకూడదని కంకణం కట్టుకుని నేటి సమాజంలో పరమ దుర్మార్గంగా జీవించేస్తున్న  కాఠిన్య మనస్తత్వాలు మారే దెన్నడు? మేలు చేసిన వారిని సైతం మట్టి కరిపించే రాక్షసత్వం ప్రబలిన నేటి ఆధునిక యుగంలో మనిషి మనిషిగా జీవించలేని వికృత లక్షణాలు అంకురించాయి.కారు మబ్బులు వెలుగుని మింగేసి,చిమ్మచీకట్లు కమ్ముకున్న తరుణంలో  మిణుగురు పురుగుల వెలుతురు సైతం చీకట్లో చిరుదివ్వెలా అగుపించక మానదు.మునిగి పోయే వాడికి గడ్డి పోచ సైతం గొప్ప ఆధారంలా కనిపిస్తుంది. దారం తెగిన గాలిపటంలా తయారై,ఆఖరి అంకానికి చేరువై,అన్నీ ఉండి, అనాథ బ్రతుకుల్లా జానెడు జాగా కోసం ఎదురుచూస్తూ, గుప్పెడు మెతుకుల కోసం ఆరాటపడుతూ, గ్లాసుడు గంజి నీరుతో క్షుద్భాధను తీర్చుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఎదురౌతున్న కష్టాల సంద్రానికి ఎదురీదడం దుస్సాధ్యంగా మారుతున్న నేపథ్యంలో బ్రతుకు పగ్గాలను ఉరికొయ్యలకు బిగించి ఊపిరి తీసుకుంటున్న అభాగ్యుల అంతులేని యథార్ధ జీవిత వ్యథలకు ముగింపు పలికే దెప్పుడు? పెద్దలు తమ తరువాతి తరాలకోసం ఎంతో శ్రమించి,తాము కష్టాలు పడినా, తమ పిల్లల సుఖాల కోసం సర్వస్వం ధారబోస్తుంటే, కనీస కనికరం లేని కసాయి తరం బయలు దేరి మానవత్వానికే చితిని  పేర్చడం దేనికి సంకేతం? నాగరికత పేరుతో, స్వేచ్ఛ పేరుతో’’ ఎవరికి వారే యమునా తీరే..’’ చందం గా ఎవరి దారి వారే చూసుకుంటూ  మానవీయ విలువలకు తర్పణమొదిలేసి,ప్రేమాను బంధాలను చెరిపేస్తున్నారు.

జీవిత సారాంశాన్ని అనాగరికంగా, నిస్సారంగా మార్చేస్తున్నారు. కొని తెచ్చుకుంటున్న నూతన సంస్కృతి మన జీవితాల్లో కొరివి పెడుతున్నది. పెద్దలను తృణీకరించి, ఈసడిం చుకోవడం, వృద్ధాప్యంలో పెద్దలను బయటకు విసిరేయడం వంటి చర్యలు కొనసాగుతున్నా, ఇంకా   పెద్దలు మాత్రం  పిల్లల పట్ల తమ బాధ్యతను ప్రదర్శిస్తూ, వారికోసమే తమ బ్రతుకన్నట్టు జీవించే మానవీయ పరిస్థితులు  సజీవంగానే ఉన్నాయి. అయితే పెద్దల పట్ల నవతరం పోకడలు మాత్రం  అత్యంత హేయంగా ఉంటున్నాయి.
ఆప్యాయతానురాగాలు ప్రదర్శించే  పెద్దరికం ఇంకా నేటి సమాజంలో ‘మూడుపువ్వులు-ఆరుకాయలు’ అన్నట్లుగా వర్ధిల్లడం  హర్షదాయకం.స్వార్ధ చింతన పెరిగిన నేటి  వ్యవస్థలో ఇంకా  పెద్దవారు  ప్రేమపాశానికి బంధీలై, నిరంతరం తమ పిల్లల భవితకోసం తపన పడుతున్నారు.ఎనిమిది పదుల ప్రాయంలో  కూడా శక్తి కూడదీసుకుని రెండు పదుల  యువత కంటే మిన్నలా  శ్రమించడం బిడ్డల పట్ల వారికున్న అవ్యాజ్యమైన ప్రేమకు నిదర్శనం. ముదిమి ప్రాయంలో ఊరుపొమ్మన్నా,కాడు రమ్మన్నా  కూడా తమ పిల్లల కోసం యమపాశం కంటే తమ ప్రేమ పాశమే గొప్పదన్నట్టు పడుతూ, లేస్తూ బ్రతుకీడ్చు తున్నారు.అయితే నేటి సమాజంలో  అవసరం తీరాక, పెద్దల పట్ల చూపిస్తున్న వివక్షత అత్యంత ఘోరాతిఘోరంగా ఉంటున్నది.

దీపం మనదే కదా అని ముద్దాడితే మూతి కాలినట్టు, మనవారే కదా అని ప్రేమానుబంధంతో పెంచితే మిగిలేది ఆక్రందన, అవేదన మాత్రమే అని నడుస్తున్న చరిత్ర సాక్షీభూతంగా నిలుస్తున్నది.  ప్రేమతో ముడివేసుకున్న బంధాలను బలవంతంగా తెంచేసి కాల్చుకు తింటున్న కఠిన హృదయులకు కాలమే తగిన గుణపాఠం నేర్పుతుంది.మేమున్నామంటూ అరచేతిలో వైకుంఠం చూపించి, చివరికి  నెత్తిన శఠగోపం పెట్టే నూతన తరం బయలు దేరింది. బ్రతికుండగానే  చితిపేర్చే అమానుషత్వం  కొత్త రూపం సంతరించుకుంటున్నది
కాసుల కోసమే తప్ప ఏమాత్రం  కనికరం చూపని కలికాలమిది.జీవితమంతా ధారబోసిన వారితో క్షణకాలమైనా మాట్లాడే తీరిక లేని అనాగరిక  విద్యాధికులు పుట్టగొడుగుల్లా పుట్టు కొస్తున్నారు. వీరికి  వారానికొకసారైనా చరవాణిలో పెద్దల యోగక్షేమాల గురించి విచారించే తీరిక ఉండదు. స్నేహితులతో, మందు,విందు వినోదాల్లో తేలియాడే తీరిక ఎక్కువ. ఇదే కొత్త ట్రెండ్‌. ‌యువతరానికి వ్యసనాలు, ప్రేమ వ్యవహారాలే తప్ప పెద్దల గురించి ఆలోచించే తీరిక దొరకడం లేదు.

తమ జీవితాన్నంతా  వెచ్చించిన పెద్దలకు సలహాలే తప్ప, వీరి నుంచి సహాయమందదు. పెంచి,పెద్ద చేసి, జీవిత సర్వస్వం  వీరికోసం   ధారబోస్తే చివరికి మిగిలేది అరణ్య రోదన మాత్రమే. తత్వం బోధ పడిన తర్వాత పరిస్థితి  చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారుతున్నది. కాసులుంటేనే వృద్ధాప్యంలో ఊరట. పైకం లేకపోతే సంబంధ బాంధవ్యాలు  అటకెక్కినట్టే… వృద్దాప్యంలో వారి ఆలనా పాలనా కొండెక్కినట్టే….వారి జీవితాలు కొడి గట్టిన దీపాలే…సుడిగుండంలో చిక్కిన నావికుల గమ్యం లా సాగే అయోమయ ప్రయాణాలే!!విద్యాబుద్దులు నేర్పించి,తమ సుఖాలను త్యాగం చేసి, తాము కరిగిపోతూ,తమ వారికోసం  కొవ్వొత్తిలా వెలుగునిస్తూ,తాము అరిగి పోతూ తమ జీవితాలను పిల్లల కాళ్ళ క్రింద నలిగిపోయే పాదరక్షలుగా మారి, పిల్లలు భవిష్యత్తులో గొప్పవారయితే అదే తమకు స్వర్గసౌఖ్యాల కంటే అధికమని భావించే వారంతా వార్ధక్యంలో పడతున్న మానసిక బాధలు వర్ణనాతీతం. అందరికీ శకునం చెప్పే బల్లి తానే కుడితిలో పడినట్లు, నేటితరం యొక్క  ద్రోహచింతనకు బలై  తమ కష్టాలను ఇతరులకు చెప్పుకోలేక, కన్నీటి పర్యంతమై రోదిస్తున్న వారి కథనాలు కవుల కలాల్లో కన్నీటి ధారలై, చరిత్రలో చెరగని అక్షరాలను లిఖిస్తున్నాయి.ముదిమి వయసులో కని పెంచిన వారు పడే కష్టాలు…ఆర్తనాదాలు…ఆకలికేకలు… అనా రోగ్యపు బాధలు వర్ణింపనలవికావు.

పేగుబంధమే పెనుశాపమై వెక్కిరించగా, వారి ఆవేదనాస్వరాలను ఆలకించే వారెవరు? వార్ధక్యపు ఛాయలతో, ఓపిక నశించి అలవి కాని కష్టాలతో నెలవు లేని క్లిష్టపరిస్థితులు ఏర్పడుతున్నాయి.గుండెలను పిండే బాధాతప్త హృదయాలకు భరోసా ఎక్కడ?క్షణిక భోగలాల సానందంలో పెచ్చెక్కి, పెద్దవారి ఆశలను అడియాసలు చేస్తూ మేమే నాగరికులం మీరంతా అనాగరికులంటూ చిందేస్తున్న  నవతరం నైతిక విలువలకు తిలోదకాలిచ్చేసింది. ఆది మానవుడే మిన్న అన్న రీతిలో బ్రతుకీడ్చుతూ, విలాసాలకు అలవాటు పడి, వ్యసనాలే తమ నాగరికతకు చిహ్నమని భ్రమిస్తూ యుక్తవయస్సు ఉన్మాదంలో  చెత్తకుప్పలకు పసికందులను బలిచేస్తున్నారు. పెద్దలను వృద్ధాశ్రమాలకు వదిలేస్తున్నారు.పెద్దతరాన్ని తృణీకారభావంతో చూడడం  నేటి తరానికి శాపం. పెద్దలంటే అనుభవానికి గురుతులు-విలువలకు నేస్తాలు.వారి జీవిత సారాంశమే నేటితరానికి పాఠాలుగా, గుణపా ఠాలుగా ఉపయోగపడతాయి. పెద్దల సాంగత్యానికి నోచుకోని పిల్లలు చదువుకున్న మూర్ఖులుగా మిగిలిపోక తప్పదు. మూర్ఖపు సమూహం తో కూడిన సమాజం ఎలా సన్మార్గంలో పయనిస్తుంది? ఆకాశహర్మ్యాలలో  జీవించే నేటితరం ఆకాశంలో చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ నీతి కథలు వినే భాగ్యానికి నోచుకోలేదు.

అందుకే వారికి విలువలు తెలియవు.’’ తాను మునిగి ందే గంగ- తానొలచిందే రంభ’’ అన్నట్టుగా మూర్ఖభావజాలంలో కొట్టుమిట్టాడుతూ యాంత్రిక జీవనమే సుఖప్రదాయినిగా భావిస్తూ,కేవలం ప్రాణమున్న మరబొమ్మల్లా, సాలెగూడు లాంటి  ఆధునిక సాంకేతిక వ్యవస్థలో కూరుకుపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. అందుకే  ఆధునిక మానవుడు  కోటాను కోట్ల ప్రజల మధ్య ఒంటరి జీవనం సాగిస్తున్నాడు.రక్త సంబంధాలను వదిలేసి ఒంటరి కాంక్రీటు అరణ్యాల్లో అనాథగా బ్రతుకుతున్నాడు,పెద్దలను  అనాథాశ్రమాలకు వదిలేస్తున్నాడు. పెద్దల విలువ తెలియదు. వినయం మచ్చుకైనా కానరాదు, సంస్కారం వీరికి సుదూరం. ఇంతకంటే మనిషికి మరో శిక్ష ఉండదు. మధ్యతరగతి బ్రతుకులు ఒక రకంగా ఉంటే, అర్ధికంగా  ఉన్నతంగా ఎదిగిన కుటుంబాల బ్రతుకులు మరో రకంగా ఉన్నాయి. ఇరువురి బ్రతుకుల్లో సారూప్యత గోచరిస్తున్నది.అన్నీ ఉండి అనునిత్యం అనాథల్లా  కష్టాలను అనుభవిస్తున్న బ్రతుకొకరిది. ఆర్ధికలేమి తో అలమటిస్తున్న బ్రతుకు మరొకరిది. ఈ విచిత్రమైన అంతులేని వింత జీవిత కథనాన్ని కదన కుతూహలంతో వీక్షిస్తూ,ఆనందిస్తున్న నేటి తరపు ఆటవిక పోకడ ఎక్కడికి దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి. కాలం కడుపులో దాగిన కత్తులు జరుగుతున్న  విపరిణామాలపై యుద్ధం ప్రకటిస్తాయో,మానవత్వమున్న మనుషుల కుత్తుకలకు తమ కత్తి పదును చూపిస్తాయో వేచి చూడాలి.

image.png
 సుంకవల్లి సత్తిరాజు
(సామాజిక విశ్లేషకులు)
దేవరపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్‌
9704903463

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page