విజన్ తో కూడిన అభివృద్ధి

మహేశ్వరం, ప్రజాతంత్ర ఆగస్ట్ 14: గ్రేటర్ హైద్రాబాద్ నగరంతో పాటు నగర శివారు ప్రాంతాలను ఒక విజన్ తో కూడిన అభివృద్ధి చేస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై  మీర్ పేట్ కార్పొరేషన్ పరిధిలో రూ.56 లక్షలతో మన బస్తీ మన బడి కింద అభివృద్ధి చేసిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించడంతో పాటు సరూర్ నగర్ డివిజన్ లో రూ.5.98 తో చేపట్టిన ట్రంక్ పైపు లైన్ నిర్మాణ పనులకు, రూ.31 లక్షలతో విజయపురి కాలనీ లో నిర్మించే సిసి రోడు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో గ్రేటర్ హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారుతుందన్నారు. 9ఏళ్ల కిందట ఎల్బీనగర్ నగర్ ప్రాంతం ఎట్లుండెనో, ఇపుడు ఎలా మారిందో చూస్తేనే నగర అభివృద్ధి తెలుస్తుందన్నారు. అండర్ పాస్ లు, ఫ్లై ఓవర్ లు, వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి తదితర కార్యక్రమాలతో రానున్న కాలంలో పెరగనున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేపట్టడం జరుగుతుందన్నారు. అదే విధంగా మెట్రో విస్తరణతో అభివృద్ధి శరవేగంగా పెరగడమే కాకుండా, శివారు ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు పెరుగుతాయన్నారు. నాలల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు, తద్వారా వరద నీరు సాఫీగా వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. ఒక ప్రత్యేక విజన్ తో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు మున్సిపాలిటీలు,  కార్పొరేషన్ల అభివృద్ధి చేస్తూ.. ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, అన్ని విధాలుగా పాఠశాల నూతన భవననిర్మాణాలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం దివ్యాంగ బాల బాలికలకు సహాయ పరికరాలు, ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, మేయర్ దుర్గా దీప్ లాల్, డిప్యూటీ మేయర్లు శ్రీలత రెడ్డి, తీగల విక్రమ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page