విద్యారంగ హామీలను నెరవేర్చని బడ్జెట్‌!

విద్య సమాజ మార్పుకు, అభివృద్ధికి తోడ్పడుతుంది. విద్య శాస్త్రీయ, లౌకిక, మానవీయ ప్రజాస్వామ్య విద్య అయితే ఆర్థిక  అసమానతలతో పాటు సమాజంలోని అన్ని రకాల అసమానతలను వర్గ ,కుల, లింగ ఆధిపత్య0 తొలగించడం లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతటి కీలక రంగాన్ని ప్రాధాన్యత రంగంగా గుర్తించి బడ్జెట్‌ కేటాయింపులు చేయాలి. కానీ ప్రభుత్వాలు విద్యారంగానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించడం లేదు.  ఫిబ్రవరి 1న  ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో మరియు ఫిబ్రవరి 8న ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో  విద్యారంగానికి  తీవ్ర అన్యాయం జరిగింది.  దేశప్రగతికి దోహదపడే , అత్యంత కీలకమైన విద్యారంగానికి ప్రాధాన్యత నిచ్చి బడ్జెట్‌ కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు  అట్టి విషయాన్ని  విస్మరించి కేటాయింపులు చేయడం ఆశ్చర్యకరం. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో విద్యాభివృద్ధి వెనుకబడి ఉన్నదని, ఆంధ్ర పరిపాలకులు ముఖ్యమంత్రిగా పనిచేయడం వల్ల తెలంగాణ విద్యాభివృద్ధికి పాటుపడటంలేదని, తెలంగాణ పురోగతి సాధించడం లేదని ప్రత్యేక రాష్ట్రమే దీనికి ప్రత్యామ్నాయమని  ఉద్యమించి, 1200 మంది అమరవీరుల ప్రాణ త్యాగాల పునాది పై ఏర్పడిన ప్రత్యేక రాష్ట్ర0 లో  ప్రజలఆకాంక్షలు  నెరవేర్చడంలో పాలకవర్గ విధానాలు ముందడుగు వేయలేదు. ముఖ్యంగా విద్యారంగంలో గత ప్రభుత్వం పదేళ్లలో ఏ ఒక్క రోజు కూడా విద్య రంగంపై సమీక్ష చేయకుండా అలక్ష్యం చేయడంతో విధ్వంసం కొనసాగింది. గత ప్రభుత్వం విద్యకు సరైన నిధులు విధానపరంగా కేటాయించకుండా క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. రాష్ట్ర బడ్జెట్లో 2014 15లో 10.8% కేటాయింపులు జరగగా 2023 24 లో 6.7 శాతానికి పడిపోయింది. దీంతో నాణ్యమైన విద్య కొరవడిరది. ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగ అభివృద్ధి కుంటుపడిరది.

ప్రభుత్వ విద్య పట్ల, ఉపాధ్యాయుల పట్ల  ఏవ భావంతో నిరంకుశ వైఖరి ఉండటం వల్ల విద్యారంగంలో సమస్యలు పేరుకుపోయాయి. అటువంటి పరిస్థితుల్లో మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేది విద్య అని  మహాత్మా జ్యోతిబాపూలే చెప్పినట్లు విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని  రాష్ట్ర బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన నూతన ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం బాటలోనే పయనిస్తూ 2,75,891 కోట్ల ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్లో కేవలం 21 ,389 కోట్లు కేటాయించి 1.18  శాతం స్వల్ప పెరుగుదలతో  సరి పెట్టడంతో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కడమే అవుతుంది. ప్రజల జీవితాల్లో  గుణాత్మక మార్పుకు విద్యయే నాంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా,  గుణాత్మక మార్పు   తెస్తామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కేటాయింపులు చేయకపోవడం ఏ విధంగా సాధ్యమో ఏలికెలకే తెలవాలి. ప్రజలందరికీ నాణ్యమైన విద్యను అందించాలని, సమాన విద్యను అందిస్తూ అంతరాలు లేని విద్యా ప్రజల హక్కు మరియు ప్రభుత్వ బాధ్యత అని పోరాడిన  మహనీయులు మహాత్మ జ్యోతిబాపూలే, డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చూపిన వెలుగులో ప్రయాణిస్తామని ఆదర్శాలు వల్ల వేస్తూ, అందుకు తగ్గట్టుగా బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవడం, గత పది ఏళ్ల నుండి పాలకుల నిర్లక్ష్య వైఖరికి గురైన విద్యారంగా అభిమానులను ఉద్యోగులను నిరాశపరిచింది. ప్రాథమిక విద్య నుండి యూనివర్సిటీ  విద్య వరకు గల అన్ని విద్య  సంస్థలలో  బోధన బోధనేతర మరియు పర్యవేక్షక సిబ్బంది ఖాళీలు ఇబ్బడి ముబ్బడిగా ఉండటం, భౌతిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతుండటం, కనీసం టాయిలెట్‌ వసతులు కూడా    కరువవడం  మూలంగా విద్యార్థినీలు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కావు.

అరకొర వసతులతో బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదివే సంక్షేమ హాస్టల్లో, మధ్యాహ్న భోజన పథకంలో, యూనివర్సిటీలలో, ప్రతిష్టాత్మకంగా ఏర్పరిచిన బాసర వంటి ఐఐటి సంస్థలలో కూడా ,  నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించకపోవడంతో పలు రకాల ఇబ్బందులతో వేలాదిమంది విద్యార్థులు  ఆస్పత్రులపాలవడం, అనారోగ్య కారణాలతో దీర్ఘకాలిక వ్యాధుల పాలవడం బాధాకరం. ఇటువంటి ఇబ్బందులన్నీ నూతన ప్రభుత్వం రాకతో తొలగిపోతాయని ఆశించిన వారికి ఆశా భంగమే కలిగింది. గత ప్రభుత్వం ఆయాంలో విద్యాభివృద్ధికి  అంతగా కృషిజరగకపోగా, అందులో పని చేసే ఉద్యోగులను పాలక విధానాలు అనేక ఇబ్బందులకు గురిచేశాయి. 317 జీవో తీసుకురావడంతో  ఉద్యోగుల స్థానికత ను పాతర వేసి వేలాది కుటుంబాలను విచ్చిన్నం చేయడం జరిగింది.  దాదాపు 1,20,000 మంది పైగా ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేసిన  కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ సిస్టంను  రద్దు  చేసే అవకాశం ఉన్న చేయకపోవడం వల్ల, రిటైర్‌ అయిన చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలను వీధిన  పడవేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కామన్‌ సర్వీస్‌ రూల్స్‌ అమలు చేసి రెగ్యులర్గా బదిలీలు పదోన్నతులు చేపట్టకపోవడం మూలంగా,  నియామకం పొందిన కాలం నుండి రిటైర్‌ అయ్యే నాటికి కూడా పదోన్నతి పొందకుండా వేలాదిమంది ఉపాధ్యాయులు రిటైర్‌ అయ్యారు. ఉపాధ్యాయులకు ఉద్యోగులకు రావలసిన జిపిఎఫ్‌, సరెండర్లి లీవ్‌, మెడికల్‌ రియంబర్స్మెంట్‌, టి ఎస్‌ జి ఎల్‌ ఐ లోన్లు, రిటైర్‌ అయిన తర్వాత రావాల్సిన బెనిఫిట్స్‌, కరువు బత్యం, పిఆర్సి ఏరియర్స్‌ లాంటి చెల్లింపులన్నీ సంవత్సరాల తరబడి పెండిరగ్లో ఉండటం మూలంగా ఆర్థిక ఇబ్బందులకు గురై మానసిక ఆందోళనలతో పనిచేస్తున్న దుస్థితి నెలకొంది. వివిధ రకాల విద్యాసంస్థలలో వివిధ రకాల మేనేజ్మెంట్లు ఉండటం మూలంగా ఒకే రకమైన పని విధానానికి పలు రకాలుగా మేనేజ్మెంట్‌ కు తీరుగా విధులు నిర్వహించాలని, వెట్టి చాకిరి చేయించడం విడ్డూరం.

కాంట్రాక్టు పదమే ఉండొద్దని ఆ సిస్టన్ని పూర్తిగా ఎత్తి  వేస్తామని ప్రగల్బాలు పలికిన గత ప్రభుత్వం అదే విధానాన్ని కొనసాగించి  , కనీస వేతనం అమలు చేయకుండా, వాటిని కూడా నెలవారీగా అందించకుండా వేతనాల కోసం రోడ్డెక్కన  విధానాన్ని గత  పది సంవత్సరాలుగా చవిచూస్తున్నాం. సకాలంలో వేతనాలు చెల్లించడానికి నూతన ప్రభుత్వం ప్రయత్నిస్తుండటం, ప్రజల ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం, పేదల ఇంటి నిర్మాణం కోసం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరోగ్యారెంటీలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్న విధానం ఆహ్వానించ  దగ్గదే అయినా, ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తి కావస్తున్న విద్యారంగా అభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి ఎటువంటి సమీక్ష జరపకపోవడం మూలంగా, నూతన బడ్జెట్లో ఇచ్చిన హామీ మేరకు కేటాయింపులు చేయకపోవడం మూలంగా ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన తలెత్తుతుంది. అభద్రత కూడిన వర్గమంతా ప్రభుత్వం మార్పుతో  భద్రతతో కూడిన జీవనం లభిస్తుందన్న వారికి నిరాశను కలిగించింది.   గతప్రభుత్వం ఇబ్బందిగా కులాల వారిగా మతాలవారీగా గురుకుల పాఠశాలలు సరైన సిబ్బంది లేకుండా, వసతులు సమకూర్చకుండా ప్రైవేటు అద్దె బిల్డింగ్లలో నాగ మేఘాల మీద దాదాపు 1000 గురుకుల పాఠశాలలు ప్రారంభించామని గొప్పలు చెప్పుకున్న క్షేత్రస్థాయిలో పడే ఇబ్బందులు నివారించడంలో  విఫలం చెందింది. లక్షలాది మంది చదివే ప్రభుత్వ విద్యాసంస్థలలో నాణ్యమైన విద్యను అందించడానికి ప్రయత్నం చేయకుండా కొద్దిమందికే ప్రయోజనం చేకూర్చే గురుకుల పాఠశాలలను ఏర్పరిచినట్టే నూతన ప్రభుత్వం కూడా 500 తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొనడం అంతరాల విద్యకు ఆజ్యం పోసినట్టే..

గత పది సంవత్సరాలుగా విద్యారంగం పాలక విధానాలతో సంక్షోభంలోకి నెట్టి వేయబడిరది. ఆ సంక్షోభం నుండి బయటపడవేసేందుకు, విద్యారంగ అభివృద్ధికి చిత్తశుద్ధితో ఇచ్చిన హామీ మేరకు   నిజంగా ప్రగతిని కాంక్షించే ప్రభుత్వమైతే ప్రజలందరికీ  మెరుగైన గుణాత్మక విద్యను  అందించాలనుకుంటే తక్షణమే విద్యా రంగాన్ని సమీక్షించి భవిష్యత్తు విద్యావిధానాన్ని రూపొందించడానికి విద్యారంగ మేధావులతో, విద్యార్థి ఉపాధ్యాయ సంఘాల తో చర్చించి రాష్ట్ర విద్యా కమిషన్‌  ఏర్పరచాలి. ఉన్నత విద్యను  పటిష్టపరిచేందుకు 11 యూనివర్సిటీల నిర్వహణకు కేవలం 500 కోట్లు కేటాయించడం ఏ మూలకు సరిపోవు. గత పాలక ప్రభుత్వం ఒక రకమైన కక్ష సాధింపుతో యూనివర్సిటీ విద్యను  కునారెల్లింపజేసింది.   మేధోమధనం జరిగే విశ్వవిద్యాలయాల అభివృద్ధికి  ఒక్కో యూనివర్సిటీకి కనీసం 1000 కోట్లు కేటాయించి పూర్వపు వైభవం తీసుకురావాల్సిన అవసరం ఉంది. పెండిరగ్‌ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్‌ బకాయిలు 5500 కోట్లు విడుదల చేయాలి. ప్రాథమిక విద్యను, ఇంటర్‌ విద్యను నాణ్యంగా అందించేందుకు  ఖాళీలను  భర్తీ చేయాలి.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఉపాధ్యాయుల సంక్షేమానికి  తక్షణ చర్యలు తీసుకోవడానికి నిలిచిపోయిన బదిలీల పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించి తదుపరి ఖాళీలను భర్తీ చేయడానికి  చకోర పక్షులలా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల కోసం డీఎస్సీ నిర్వహించాలి. గత ప్రభుత్వ పాలకుల ఆర్థిక క్రమశిక్షణ రాయిత్యంతో ఆర్థిక వ్యవస్థ విచ్చిన్న మవడం వల్ల దానిని గాడిన పెట్టి ప్రయత్నంలో నూతన ప్రభుత్వం ఉన్నను, ఎన్నికలకు  ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను హామీలను చిత్తశుద్ధితో నెరవేర్చవలసిన బాధ్యత పాలకులపై ఉన్నది. రాష్ట్రం ప్రగతి పదంలో నడవాలంటే విద్యా రంగ అభివృద్ధి ఆవశ్యకం. అదేవిధంగా వైద్యం పేదలకు భారంగా మారుతున్న కాలంలో రాష్ట్ర బడ్జెట్లో 8 శాతం నిధులు కేటాయించాలని వైద్య రంగ  నిపుణులు చెబుతుండగా  అందుకు విరుద్ధంగా  గత ఏడాది కన్నా 661 కోట్లు తక్కువగా కేటాయించడం ఇబ్బంది కరం.  ప్రజారోగ్యాన్ని ప్రజా విద్యను బలోపేతం చేయడానికి తక్షణమే నూతన ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.  విద్యా వైద్యాన్ని ప్రాధాన్యతరంగాలుగా గుర్తించి రాష్ట్ర బడ్జెట్లలో విద్యకు 30%, వైద్యానికి ఎనిమిది శాతం నిధులు కేటాయించి మౌలిక సదుపాయాల ఉపాధి కల్పనకు సమగ్ర అభివృద్ధికి పక్కా ప్రణాళిక రూపొందించి  హేతుబద్ధంగా అమలు చేసి అందరికీ సమాన అవకాశాలు సామాజిక న్యాయం అందించే భరోసాను కలిగించినప్పుడే కొందరి కోసం కాదు అందరూ బతకాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుంది. అప్పుడే ప్రభుత్వం ప్రజల మనసులను చురగొని , నాలుగు కాలాలపాటు నిలిచిపోతుంది. లేకపోతే గత పాలకులకు పట్టిన గతే పడుతుంది.

తండ సదానందం
టి పి టి ఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌
మహబూబాబాద్‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page