- ఇద్దరు అధికారులతో కమిటీ వేసిన కేంద్ర రవాణాశాఖ
- ఘటనకు సంబంధించి నలుగిరిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్, సెప్టెంబర్ 14 : సికింద్రాబాద్ రూబీ మోటార్స్‌లో విద్యుత్ బైక్‌ల దహనం ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి రంగంలోకి దిగిన కేంద్ర రవాణాశాఖ వాస్తవాలు తెలుసుకునేందుకు ఇద్దరు అధికారులతో కమిటీని నియమించింది. ఈ బైక్ పేలుళ్లపై విచారణ చేపట్టారు. బ్యాటరీలు ఎందుకు పేలాయి.. సరైన జాగ్రత్తలు తీసుకోలేదా అనే కోణంలో విచారణ జరుగనుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఈ బైక్ బ్యాటరీలు పేలిన ఘటనపై కేంద్ర రవాణాశాఖ అప్రమత్తమైంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పోలీసుశాఖ ఇప్పటికే ప్రాథమిక నివేదికను అందజేసింది. బ్యాటరీ పేలుళ్లే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో ఈనెల 12న భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవదహనం అయ్యారు. ఈ-స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుసపెట్టి పేలడంతో.. ఆ ప్రాంతంలో భారీ శబ్దాలు వచ్చాయి. చూస్తుండగానే దట్టమైన పొగ, మంటలు షోరూం పైన ఉన్న రూబీ హోటల్‌కు వ్యాపించాయి. హోటల్‌లో దిగిన పలువురు పొగలకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎనిమిది మంది సజీవదహనం కాగా… మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఇంకొందరు ప్రాణభయంతో పైనుంచి కిందకు దూకి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో హోటల్‌లో 25 మంది బస చేసినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే సికింద్రాబాద్ రూబీ లాడ్జి అగ్నిప్రమాద ఘటనలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం తర్వాత పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు నలుగురి అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో రూబీ లాడ్జి, ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంల నిర్వాహకులైన తండ్రీకుమారుడు రాజేందర్ సింగ్, సునీత్ సింగ్, మేనేజర్ సుదర్శన్ నాయుడు, సూపర్‌వైజర్ ఉన్నారు. నిందితులైన తండ్రీ కుమారుడు ప్రమాదం తర్వాత పరారయ్యారని పోలీసులు తెలిపారు.
వీరు కిషన్‌బాగ్‌లోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నారని వెల్లడించారు. ఇప్పటికే అగ్నిప్రమాద ఘటనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. నిందితులను పూర్తిగా విచారించిన తర్వాత ఘటనకు గల కారణాలు, లోటుపాట్లు అన్నీ వివరిస్తామని పోలీసులు పేర్కొన్నారు.సెల్లార్‌లో ఎటువంటి అనుమతుల్లేకుండా స్కూటర్ల షోరూం నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. ఆ భవనంలో అసలు అగ్నిమాపక నిబంధనలేవీ పాటించలేదని గుర్తించినట్లు వెల్లడించారు. ప్రమాదం నుంచి బయటపడిన మన్మోహన్ ఖన్నా ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.