విపక్షమంటే విమర్శించడం కాదు…

రాష్ట్రాన్ని పదేళ్లపాటు అడ్డదిడ్డంగా పాలించి, అక్రమాలకు పాల్పడి, అవినీతిని మూటకట్టుకుని,  దివాళా తీయించిన కెసిఆర్‌ కుటుంబం ఇప్పుడు కాంగ్రెస్‌ను ఎలా పడగొట్టాలా అన్న ఆలోచనలో పడిరది.  ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోతున్నా..కట్టడి చేసుకోలేని వారు.. మళ్లీ తమదే రాజ్యం అని విర్రవీగుతున్నారు.  అవినీతిలో మునిగి తేలిని వారికి అధికారలేమి ఉక్కపోతగా మారింది.అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అదేపనిగా విమర్శలు ఎక్కుపెడుతోంది. నవ్విపోదురు గాక నాకేంటి అన్న చందంగా పదేపదే ప్రజలను తప్పుదోవ పట్టించేలా విమర్శలు చేస్తోంది. తమ అవినీతి బయట పడకుండా, తమ అక్రమాలు ప్రజలు గుర్తించకుండా ఎదురుదాడి మార్గాన్ని బిఆర్‌ఎస్‌ నేతలు ఎంచుకున్నారు. రోజూ విమర్శలు తప్ప మరో పనిలేకుండా సాగుతున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అవినీతిని వెలుగులోకి తీసుకొస్తూనే ఉంది. రైతుబంధు కింద గుట్టలకు, వెంచర్లకు, హైవేలకు నగదును అందజేసిన ఘనత మన కెసిఆర్‌ ప్రభుత్వానిది. రైతుభరోసా కింద ఇప్పుడు అర్హులకే సాయాం అందించాలని సర్కార్‌ నిర్ణయిం చింది.

 

ఇలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా అర్హుల్కెన రైతులకే సాయం అందేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ పని చేసినా ఏద్కెనా పొరపాటు ఉందా లేదా అన్నది కూడా చూడకుండా భూతద్దం పెట్టి వెతికే పనిలో పడ్డారు. ఏడు నెలలకే బ్రహ్మాండం బద్దలు అయినట్లు.. తామంతా బంగారం తాపడం చేస్తే..కరగనాకినట్లుగా గగ్గోలు పెడుతున్నారు. ప్రజలు వీరికి సిగ్గులేదా అని ఈసడిరచుకుంటున్నారు. ఉన్న ఎమ్మెల్యేలు జారుకుంటు న్నారు. మొన్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కర్రుకాల్చి వాతలు పెట్టారు. అయినా వారిలో మార్పు రావడం లేదు. ఇంకా ఎలాంటి వాతలు పెడితే మార్పు వస్తుందో ప్రజలు గుర్తించి, ఆపని చేయాల్సి ఉంది. దాదాపు ఏడున్నర లక్షల కోట్లు అప్పులు చేశారు. విద్యుత్‌ కొనుగోళ్లలో భారీ అవినీతికి పాల్పడ్డారు. అవినీతిపై విచారణ జరక్కుండా కోర్టులకు ఎక్కారు. విచారణ జరపరాదని కోరుకున్నారు. కానీ సుప్రీం సుతిమెత్తగా మొట్టికాయలు వేసిందనే చెప్పాలి. విచారణ కమిషన్‌ జడ్జిని మార్చండి అని చెప్పిందే తప్ప..విచారణ ఆపమని చెప్పలేదు. దీనికి కూడా సుప్రీం తమకే అనుకూలంగా చెప్పిందని కెటిఆర్‌ తదితరులు జబ్బలు చర్చుకున్నారు. విద్యుత్‌ ఒప్పందాలపై అవినీతి జరక్కుంటే ..కెసిఆర్‌ మహాశయుడు ఎందుకు విచారణ ఆపమంటు న్నారో చెప్పడం లేదు.

 

అవినీతి లేకుంటే బాజాప్తా కమిషన్‌ ముందు తన వాదన వినిపించ వొచ్చు. ప్రజలు కేవలం కెసిఆర్‌ కుటుంబ అహంకారంతో విసిగిపోయి కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఈ విషయం తెలియకుండా ప్రజలు పొరపాటు కాంగ్రెస్‌కు ఓటేశారని ప్రజలను కూడా తప్పుపడు తున్నా రు. నిజానికి కాంగ్రెస్‌ వారు అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం ఏడున్నర  లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయింది. అయినా కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని భరోసా ఇస్తోంది. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు చెక్‌ పెడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. మహలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్‌ బిల్లును ఉచితంగా అమలు చేస్తున్నారు. గ్యాస్‌ సిలిండర్‌కు రూ.500లను కూడా అమలు చేస్తూ పేద ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గిస్తోంది. కానీ బిఆర్‌ఎస్‌ నేతలు ఆరింట ఒక్కటే అమలవుతోందని గుడ్డిగా విమర్శలు చేసి  నవ్వులపాలు అవుతున్నారు.  ఇక అన్నింటిని మించిన రైతు రుణమాఫీకి కూడా శ్రీకారం చుట్టింది. ఇచ్చిన హావిరీని నిలబెట్టుకుంటూ ’రైతు రుణమాఫీ’ అమలుకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 15 గడువు కంటే ముందే  ఏకకాలంలో రుణమాఫీ చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి కసరత్తు మొదలు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 90లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి.

ఇందులో రుణాలు ఉన్న రైతుల ఖాతా సంఖ్య 70లక్షలే. ఇంకా దాదాపు 6.36 లక్షల మంది రైతులకు రుణాలు ఉన్నా రేషన్‌ కార్డులు లేవు. వారందరినీ కూడా దృష్టిలో ఉంచుకుని రుణమాఫీ చేయాలని నిర్ణయించారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలోని రైతులందరికి లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని కేసీఆర్‌ చెప్పారు. అధికారంలోకి వచ్చాక విడతల వారీగా రూ.25వేల రూపాయలు చొప్పున లక్ష వరకు చేశారు. ఆ లబ్ది కూడా అరకొర రైతులకే లబ్ది చేకూరింది. కేంద్ర ప్రభుత్వం అందజేసే ఫసల్‌ బీమాను కూడా అహంకారపూరిత ధోరణితో కేసీఆర్‌ రాష్ట్రంలో అమలు చేయలేదు. దీంతో పంట నష్టం వాటిల్లినప్పుడు ఎంతోమంది రైతులు ఆర్థికంగా చితికిపోయారు. రాష్ట్ర ప్రభుత్వమైనా ఆదుకుందా అంటే అదీ లేదు. ఏనాడూ బీఆర్‌ఎస్‌ నాయకులు రైతుల పొలాలను పరిశీలించిన పాపాన పోలేదు. రైతులు ఏం పంట వేయాలో తామే చెబుతామని, రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తామంటూ నష్టాల ఊబిలోకి దించారు. రబీలో పంట వేసుకోవాలా వద్దా, వేస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా లేదా అన్న సంశయంతో చాలా మంది రైతులు వ్యవసాయానికి దూరం అయ్యారు. తెచ్చిన అప్పులు కట్టలేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాటిని కూడా గత ప్రభుత్వం దాచిపెట్టింది. రైతు బీమా కింద నగదును అందజేశారంటే ఎంతమంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారో అర్థం అవుతుంది.

ఇంతేగాక రైతులకు సంకెళ్లు వేసిన ఘనత కూడా మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ప్రాజెక్టుల రీడిజ్కెన్‌, నూతన ప్రాజెక్టుల నిర్మాణాల పేరిట రైతుల నుంచి భూములు లాక్కుని వారిని నడిసంద్రంలో వదిలేసిన పాపం కూడా బీఆర్‌ఎస్‌కే దక్కుతుంది. నష్ట పరిహారం అడిగితే లాఠీలతో భయపెట్టిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. భారీ లెక్కలతో పబ్బం గడిపారే తప్ప ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాలకు, రైతుల అభివృద్ధికి పాటుపడలేదు. తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్‌ అప్పులకుప్పగా మార్చారు. అదేమంటే ఆస్తులు సమకూర్చామని చెబుతున్నారు. ఆస్తులు మాత్రం కెసిఆర్‌ కుటుంబ సభ్యులు  సమకూర్చుకున్నట్లుగా ఉంది. అప్పులను తగ్గించుకుంటూ..వడ్డీల భారాన్ని  తగ్గించేలా ప్రణాళికలు వేసుకుంటూ..ఇచ్చిన హావిరీలను అమలు చేసేలా కాంగ్రెస్‌ నడుం బిగించింది. రైతురుణమాఫీ అమలు కోసం నిద్రలేని రాత్రులు గడిపామని డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యల్లో చిత్తశుద్ది ఉంది. ఎందుకంటే ఈ హావిరీ అమలు కోసం వారు నానా తంటాలు పడ్డారు. అధికారంలోకి వచ్చిన నాటినుంచీ రాష్ట్ర పురోగాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని రైతులను ఆర్థికంగా వృద్ధిలోకి తెచ్చేందుకు పక్కా ప్రణాళికలను రూపొందిస్తోంది.
-కె.ఆర్‌.ఎస్‌ 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page