- 164 మంది శాసనసభ్యుల మద్ధతు
- వోటింగ్ నిర్వహించిన స్పీకర్ నర్వేకర్
- వోటింగ్‌కు ఎస్పీ చెందిన ఎమ్మెల్యేలు దూరం
ముంబయి, జూలై 4 : మహారాష్ట్ర రాష్ట్ర శాసనసభలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో కొత్త ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే విజయం సాధించారు. సీఎం షిండేకు 164 మంది శాసనసభ్యుల మద్ధతుగా వోటు వేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం జరిగిన విశ్వాసపరీక్షలో సీఎం షిండే నెగ్గినట్లు శాసన సభాపతి రాహుల్ నర్వేకర్ అసెంబ్లీలో ప్రకటించారు. షిండే-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 ఓట్లు పోలయ్యాయి. మహారాష్ట్రలో కొత్త ప్రతిపక్ష నాయకుడిగా ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ ఎంపికయ్యే అవకాశం ఉంది. షిండే ప్రభుత్వానికి భారీ మద్దతు ఇచ్చినందుకు ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.
షిండే నమ్మకమైన శివసైనికుడు. అతను బాలాసాహెబ్ సిద్దాంతానికి విధేయుడు అని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ చెప్పారు. ఎస్పీకి చెందిన అబూ అజ్మీ, రయీస్ షేక్, ఏఐఎంఐఎం ఎమ్మెల్యే షా తారిఖ్ అన్వర్‌లు వోటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఏక్‌నాథ్ షిండేకు బీజేపీ, సేన ‘రెబెల్స్’, స్వతంత్రులు, ప్రహార్ పార్టీకి చెందిన దాదాపు 164 మంది ఎమ్మెల్యేల మద్దతు పలికారు. మొత్తంగా మహారాష్ట్ర అసెంబ్లీలో ఎదుర్కొన్న బల పరీక్షలో ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వం విజయం సాధించింది. కొత్త స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆధ్వర్యంలో ఓటింగ్ జరిగింది. షిండే ప్రభుత్వానికి 164 ఓట్లు అనుకూలంగా రాగా..99 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి. 106 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, 39 మంది షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, మరో 19 మంది స్వతంత్రులు షిండే సర్కారుకు మద్దతు తెలిపారు. దీంతో బలపరీక్షలో సీఎం షిండే విజయం సాధించినట్లు స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. ఉదయం అసెంబ్లీ మొదలు అవ్వగానే శివసేన, బీజేపీ నేతల ప్రతిపాదనలతో స్పీకర్ విశ్వాస పరీక్షను నిర్వహించారు. మొదట మూజువాణీ ఓటు ద్వారా బలపరీక్షను పూర్తి చేయగా..డివిజన్ ఆఫ్ ఓటు పద్దతితో బలపరీక్ష చేపట్టాలని విపక్షం డిమాండ్ చేసింది. దీంతో సభాపతి డివిజన్ ఆఫ్ ఓటింగ్ పక్రియ చేపట్టారు. ఈ పరీక్షలో షిండేకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యే లేచి నిలబడ్డారు. అసెంబ్లీ సిబ్బంది లెక్కించగా..షిండేకు 164 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు.
దీంతో బీజేపీ మద్దతుతో షిండే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మహావికాస్ అఘాడీకి నేతృత్వం వహించిన శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అందులో 39 మంది షిండే వెంట నడిచారు. ఆదివారం నుంచి ఇప్పటి వరకు మరో ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు షిండేకు మద్దతిచ్చారు. దీంతో ఠాక్రే వర్గానికి 14 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. మహావికాస్ అఘాడీ నుంచి వైదొలగి బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని షిండే వర్గం ఉద్దవ్ ఠాక్రేను కోరింది. కానీ దీనికి ఠాక్రే ఒప్పుకోలేదు. దీంతో ఠాక్రే ప్రభుత్వం సభలో బలం నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించాలని గవర్నర్ ను మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కోరారు. దీంతో సభలో మెజారిటీ చూపించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. బలం లేకపోవడంతో సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. 288 మంది సభ్యులున్న సభలో బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తిరుగుబాటు సేన వర్గానికి 41 మంది బలం ఉంది. మరోవైపు షిండే వర్గం ఎమ్మెల్యేను శివసేన విప్ గా గుర్తిస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంపై ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఠాక్రే వర్గం తరఫున సీనియర్ న్యాయవాది మను సింఘ్వీ వాదనలు వినిపించారు. కొత్తగా నియామకం అయిన స్పీకర్‌కు విప్‌లను గుర్తించే అధికారం లేదన్నారు. అన్ని అంశాలపై ఈనెల 11న విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.