పోలీసుల్లో కలవరం.. ఇంటిలిజెన్స్ అత్యవసర భేటీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 4 : రాష్ట్ర రాజధాని నడిరోడ్డుపై మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన ఒక్కసారిగా తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగులోకి రాగా.. తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఫొటోలు, వీడియోలను బీజేపీ రిలీజ్ చేసింది. శనివారం హైదరాబాద్‌లో మీడియా మీట్ నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు ఈ ఫొటోలను రిలీజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నతాధికారులు హుటాహుటిన సమావేశమయ్యారు. బాలిక అత్యాచారం కేసుపై విచారణ నిర్వహిస్తున్నారు. సమావేశానికి ఎస్బీ, లా అండ్ ఆర్డర్, ఇంటెలిజెన్స్, వెస్ట్ జోన్ పోలీసులు హాజరయ్యారు. అసలు నిందితుల వీడియోలు, ఫోటోలు ఎలా లీక్ అయ్యాయన్న దానిపై ముఖ్యంగా పోలీసులు ఆరా తీస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకి ఈ వీడియోలు ఎలా చేరాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్‌లో జరిగిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో న్యాయం చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మట్లాడుతూ.. గ్యాంగ్ రేప్ చేసిన వారిని ఎందుకు సీక్రెట్‌గా దాస్తున్నారని మండిపడ్డారు. నిర్భయ కేసులో మైనర్ల పేర్లు బయటకు వొస్తున్నాయి..మరి నిందితుల ఫోటోలు ఎందుకు చూపించడంలేదని ఆయన ప్రశ్నించారు. అసలు ఈ కేసులో నిందితులు మైనరా.. మేజరా..అన్నది అంశం కాదు అన్నారు. పోలీసులు నిందుతులను బహిరంగంగా అరెస్టు చేసినట్లు ఎక్కడా రాలేదు. పోలీసులకు భయపడేవారు ఎవరూ లేరు అన్నారు. ఎందుకు వారిని సీక్రెట్‌గా ఉంచుతున్నారని రఘునందన్ ప్రశ్నించారు. అవసరమైతే టీఆర్‌ఎస్ వాళ్లను రిమాండ్ చేస్తారు కానీ ఎంఐఎంను ఎందుకు చేయరు అని అన్నారు.
ఈ కేసులో నిందితులెవరో తెలుసుకోవాలనుకుంటున్నామని ఆయన డిమాండ్ చేశారు. రెడ్ కలర్ మెర్సిడెస్ బెజ్ కారులో ఈ ఘటన జరిగింది. కానీ పోలీసులు ఇన్నొవాలో ఉన్నవారిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడు, హోమ్ మంత్రి మనవడు ఉన్నారు..రెడ్ కల్లర్ బెంజ్ కారులో ఏం జరిగిందో మా దగ్గర వీడియోలు ఉన్నాయన్నారు. ఈ కేసులో దోషులను అరెస్టు చేసి శిక్ష విధించేదాక పోరాడుతామని రఘునందన్ హెచ్చరించారు. మైనర్ బాలికపై అత్యాచార వీడియోలు కూడా ఎమ్మెల్యే రఘునందన్ రావు విడుదల చేసారు.