చిన్నకోడూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: నిత్యం రోడ్డు మీద పారుతున్న వృధా నీటితో కాలనీ వాసులు ఇక్కట్లు పడుతున్నారు.మండల పరిధి పెద్దకోడూర్ ఉన్నత పాఠశాల సమీప కాలనీలో వృధా నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో మురుగు కాల్వలు పూర్తి స్థాయిలో లేక పోవడంతో ఇళ్ళు, బోరు నీళ్లు..వృధా నీరంతా రోడ్డుపై ప్రవహిస్తోంది.నీళ్లు తీసుకెళ్లేందుకు కాలనీలో ఉన్న బోరు వద్దకు పలువురు వస్తుంటారు. రోడ్డుపై పారుతున్న వృధా నీటితో పాకురు పట్టి కాలినడకన వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ద్విచక్ర వాహనాలు రోడ్డులో వెళ్లాలంటే స్లిపై పడిపోయే ప్రమాదం ఉందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకున్న పాపాన పోలేదని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో మురుగు కాల్వలు నిర్మించి వృధా నీరు రోడ్డుపై ప్రవహించకుండా చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు.