వెన్నులో వణుకు పుట్టిస్తున్న ‘హైడ్రా’ ..!

హైడ్రా.. హైడ్రా.. హైడ్రా.. హైదరాబాద్‌లో ఏ మూలన విన్నా ఇదే పేరు హాట్ టాపిక్‌గా వినిపిస్తోంది.ముఖ్యంగా.. చెరువులు,కుంటలు, నాళాలు కబ్జా చేసి అక్రమ కట్టడాలు నిర్మించిన అక్రమార్కుల వెన్నులో వణుకు పడుతోంది. ఏ వైపు నుంచి ఏ అధికారి వస్తాడో.. ఏ సమయంలో ఏ బుల్డోజర్ వచ్చి కూల్చివేస్తుందోనని భయంతో హడలిపోతున్నారు. అంతలా సెన్షేషన్ క్రియేట్ చేసింది హైద్రాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) హైదరాబాద్‌లో ఆక్రమణలకు గురైన చెరువులను సంరక్షించడమే లక్ష్యంగా,ఆక్రమణలు తొలగించడమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన హైడ్రా.. విధి నిర్వహణలో అంచనాలకు మించి దూకుడు ప్రదర్శిస్తోంది. ఎకరాలకు ఎకరాలు కొని ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న ధనవంతులు గుండెల్లో గునపం దిగింది.

 

దీంతో అక్రమార్కులు బిక్కు బిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి నెలకొంది.సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఎఫ్టీఎల్,బఫర్ జోన్లలో ఆక్రమణలు జరిగితే ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేయవచ్చు. ఇప్పటి వరకు కూల్చిన బడా బాబుల భవన నిర్మాణాలు అక్రమంగా నిర్మాణం చేసినారని పూర్తిగా నిర్దారించుకున్న తర్వాతనే కలల సౌధం నేలమట్టం చేసారు, ఇంకేముంది అందుకే అక్రమార్కుల వెన్నులో వణుకు పుడుతుంది. కేటీఆర్ అయితే ఒక్కడుగు ముందుకేసి అసలు నాకు ఫాం హౌజ్ లేదంటూ.. సుద్దపూసలా బుకాయించడం దేనికి సంకేతం? అయితే జన్వాడ ఫామ్ హౌజ్ పై డ్రోన్ కెమెరా వాడినారని నాటి ప్రతిపక్ష పార్టీ నాయకుడు రేవంత్ ను కట, కటాల పాలు చేసింది నిజం కాదా? అధికార పార్టీ నాయకులకు ఉన్నాయని దాటవేస్తున్నారు.అక్రమం అని తేలితే నేనే  కూల్చుతానంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు పోటీపడి కథలు వినిపిస్తున్నారో,ఎవరు పెడబొబ్బలు పెడుతున్నారో తెలంగాణ సమాజం గమనిస్తున్నది.

ప్రసిద్ధి గాంచిన హుస్సేన్ సాగర్ చెరువుతో మొదలు పెట్టి గ్రేటర్ హైదరాబాద్ మున్సిఫల్ కార్పొరేషన్ పరిధిలో ఆక్రమణకు గురికాని చెరువు ఒక్కటికూడా లేదంటే అతిశయోక్తి కాదు.గంగాళాలుగా ఉన్న చెరువులను వ్యర్థాలతో నింపడం మామూలైపోయింది. రాజకీయ నాయకుల ఒత్తిడితో రెవెన్యూ,పోలీస్ డిపార్టుమెంట్ పట్టించుకున్న పాపానపోలేదు. ఇప్పుడు త్రవ్విన కొద్దీ అక్రమాలు బయట పడుతున్నాయి. ఇక విపక్షాల తత్తరపాటు చూస్తుంటే వెనుకటికెవరో గుమ్మడికాయల దొంగ ఎవరు? అంటే తన భుజాలు తడుముకున్నట్టు, తాను దొంగిలించి భుజాలపై మోసుకెళ్లిన తాలుకు చిహ్నాలు భుజాలపై ఉన్నాయేమో అని చేసుకున్నాడట అన్నట్లు అక్రమార్కులు నిజంగానే తప్పులు చేయకపోతే అడ్డగోలుగా మాట్లాడాల్సిన అవసరం లేదు.

 

ఎఫ్టీఎల్ పరిధిలో నాడు మంత్రులు ఫాంహౌస్ లు కట్టుకున్నారని,హిమాయత్ సాగర్ పూర్తిగా నిండక ముందే మంత్రుల ఫాంహౌస్ లు మునగకుండా ఉండేందుకు గేట్లు తెరిచి హైదరాబాద్ వాసులకు తాగు నీరు అందించే జలాశయాలను నిండకుండా అన్యాయం చేసిందనే అభిప్రాయాన్ని నాడు కాంగ్రెస్ ఆందోళన చేసింది.1908 మూసీ వరదల తరువాత నిజాం రాజు వరద నీటిని నిల్వ చేసి,హైదరాబాద్ నగరానికి తాగు నీరు అందించే ఏర్పాటు చేశారు. ఆ ఏర్పాటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు. సుమారు వందేళ్ల నుంచీ ఈ జలాశయాలు హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరుస్తూ వచ్చాయి.ఈ జల వనరుల పరిరక్షణ కోసం 1996 మార్చి 8న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయడు ప్రభుత్వం జీవో 111 తీసుకొచ్చింది. ఇప్ప్పుడు రేవంత్ ప్రభుత్వం జీవో 99 తెచ్చి సామాన్యులు సైతం మోసపోకుండా హైడ్రా కాపాడుతుందనే నమ్మకం కల్పిస్తుంది.

కొద్దిపాటి వర్షాలకు అతులకుతులం అవుతున్న విశ్వనగరం అక్రమ నిర్మాణాలకు అడ్డాగా మారకూడదనే ఉద్ద్యేశంతో హైద్రాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఆసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా ) ద్వారా భరోసా కల్పించేందుకు నూతన ఒరవడికి తెరలేపింది. ప్రస్తుతం చెరువుల్లో ఫామ్‌హౌసులు,పెద్ద పెద్ద బిల్డింగ్‌లు పుట్టుకొచ్చి వాయు,జలకాలుష్యాలకు కారణమయింది.నాడు పట్టణీకరణ పేరుతో జీవో 111  రద్దు చేసి చెన్నై,బెంగుళూరు వంటి సిటీలకు దీటుగా హైదరాబాద్‌ను నిలబెట్టే ప్రయత్నం లో భాగంగా ఇంత స్థలం ఒక్కసారిగా వస్తే, పెట్టుబడిదారులను ఆకర్షించవచ్చన్న వాదన వినిపించారు కానీ,నిండు శాసనసభలో అక్రమంగా నాలాలు, చెరువులు కబ్జా చేసిన భూ బకాసురులను నాటి ప్రభుత్వం కాపాడి జంట నగరాలు జల ప్రళయానికి కారణమైందనే భావంతో జాతీయ విపత్తుల నుంచి పొంచి ఉన్న ప్రమాదం పసిగట్టి భవిష్యత్ తరాలకు బాసటగా నిలువాలని సాహసోపిత నిర్ణయం తీసుకున్నారు.

కూల్చొదంటే ఫజితపాలు అవుతామనే భయంతో  ప్రతీకారేచ్చగా వర్ణిస్తున్నారు. చెరువుల చెర పట్టిన నాయకులు సైతం లోపల పింజం పింజం ఉన్నా పైకి  స్వాగతిస్తున్నారు. హైడ్రా  మాదిరిగా రెండవ రాజధాని గా పేరొందిన వరంగల్ లాంటి నగరాల్లో కూడా ఏర్పాటు చేయాలనీ ఇ ప్పటికే ప్రజల నుంచి డిమాండ్స్ వస్తున్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుడు ఎక్కడ దగాపడకుండా  తీసుకున్న నిర్ణయం,అందుకోసం ప్రభుత్వం ఒక పోర్టల్ ప్రారంభించి అమ్మడానికి ఉన్న స్థలం బఫర్ జోన్ లో ఉన్నదా? ఎఫ్ టీఎల్ లో ఉన్నదా అని తెలుసుకునేందుకు హైడ్రా ముందుకు రావడం ముదావహం. హైడ్రా కు చట్టబద్దత కల్పించి పదులల్లో రంగనాధ్ లను తయారు చేసుకోవాల్సిన భాద్యత రేవంత్ ప్రభుత్వానికి ఉన్నదని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

-డాక్టర్ సంగని మల్లేశ్వర్,
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
సెల్-9866255355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page