సృష్టిలో అగ్ని కణాల నుండి జనించి పంచభూతాలలో ఒకటిగా నిలిచింది ఉష్ణోగ్రత.అతి సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా నుండి మహామహజీవులైన తిమింగలాల వరకు,మొక్క నుండి వృక్షం వరకు జంతు వృక్ష జాలమంతా కూడ పూర్తిగా బాహ్య పరిస్థితులపైననే ఆధారపడి ఉన్నాయి.పర్యావరణ సమతుల్యత,క్రమబద్దత విషయంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించేదీ ఉష్ణోగ్రత. ప్రతి ప్రాణికి తనదైన దేహధర్మత ఉంటుంది.ఎంత శరీరానికి అంత ఉష్ణోగ్రత తప్పనిసరి. ఏప్రిల్ మాసాంతానికే పల్లే-పట్నం,నగరం- మహానగరమైనా ఎండ తీవ్రతలో తేడాలేదు.ఉదయం పది గంటలకే మిట్టమధ్యాహ్న సెగలను చవిచూస్తున్నాం.ఇప్పటికే ప్రపంచంలోని అనేక ప్రదేశాలలో పగటి ఉష్ణోగ్రతలు 40-49డిగ్రీల సెంటిగ్రేడ్ కు చేరుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.సూర్యుని బ్రహ్మాండమైన అగ్నికీలలు విశ్వవీథుల్లో పయనిస్తూ వచ్చి ఈ భూమిని తాకడం,దీనికి తోడు భూగర్భంలో నిక్షిప్తమైన మహోష్ణ పదార్థాల తాకిడి, భూగ్రహం చుట్టూ రక్షణగా ఉన్న హరితగృహ వాయువుల గాఢతలు ఉష్ణ వేదికలుగా పనిచేస్తున్నాయి.భూమికి-సూర్యు నికి మధ్య గల సంబంధాల అన్వేషణలో భాగంగా సూర్యుడు,భూమి అయస్కాంత క్షేత్రాలు,రోదసి కిరణాలు వంటి వాటి ప్రభావాన్ని కూడ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు.
సూర్యునిలో సైతం మహాగ్ని జ్వాలలను వెదజల్లే సునామీల విస్ఫోటనాలు జరుగుతున్నాయని,ఈ సోలార్ సునామీలను కాంతివలయ ద్రవ్యరాశి తొలగింపు(CORONAL MASS EGECTIONS-CME) గా వారు భావిస్తున్నారు.సోలార్ సునామీ చాలా వరకు భూమి మీద సంభవించే సునామీనే పోలి ఉంటుందని,దీని మహోష్ణ ప్రవాహ ప్రయాణం అసాధారణమైన వేగంతో అంటే గంటకు పది లక్షల కి.మీ.దాకా ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. 1850 నుండి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సేకరించిన ఉష్ణోగ్రత వివరాలు పరిశీలిస్తే…20వ శతాబ్దిలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరగడం గమనార్హం.సమస్త మానవాళి అభివృద్ది పేరుతో హరిత గృహవాయువులను వదలడమే దీనికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ప్రపంచంలో ఇప్పటికి కూడ అభివృద్దికి నోచని దేశాలు ఇంకెన్నో ఉన్నాయి.ఈ కాస్త అభివృద్దికే వాతావరణ పరిస్థితులు ఇలా ఉంటే ప్రపంచదేశాలన్ని అభివృద్ధి పేరుతోకార్బన్ ఉద్గారాలను వదిలితే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే…ఒళ్లు గగుర్పొడుస్తుంది.1991-2000 సంవత్సర మధ్య కాలంలో పరిశీలిస్తే…1998 లో అధిక శాతం 0.546 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగినట్లుగా నమోదు కాగా,2001-2010 మధ్య కాలంలో0.21డిగ్రీల సెంటీగ్రేడ్ అధిక ఉష్ణోగ్రతగా నమోదయింది.
గత వెయ్యేండ్లలో 1990 అత్యంత ఉష్ణోపేత సంవత్సరంగా,20వ శతాబ్దాం అత్యధిక తాపం గలవిగా నమోదు కావడం విశేషం.మనిషి సగటు శరీర ఉష్ణోగ్రత అయితే మారేది కాదు.కానీ మన పరిసరాల ఉష్ణోగ్రతల్లోనే తీవ్రస్థాయిలో మార్పులు వస్తున్నాయి.మరీ ముఖ్యంగా వేసవి తాపం అంతకంతకూ పెరుగుతోంది.నూటికి పదిశాతం ప్రపంచదేశాలైనా పూర్తిగా అభివృద్ధి చెందాయో లేదో కానీ ఉష్ణోగ్రతలు మాత్రం భూమినంతా ఉడికించేస్తున్నాయి. విశ్వంలో మూడు వంతుల నీరున్నప్పటికి ఉష్ణోగ్రతలు ఉగ్రరూపం ధరించి విలయతాండవం చేస్తుందంటేకారణం….గ్లోబల్ వార్మింగ్. మానవ తప్పిదం వల్లనే కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్,శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి అవుతున్న వ్యర్థాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెకనుకు 1.700 టన్నుల కర్బణ ఉద్గారాలు వెలువడుతూ దశాబ్దానికి 0.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని 2035 నాటికి గ్రీన్ హౌజ్ వాయువులు తగ్గించకపోతే జీవరాశి మనుగడ కష్టతరమని ప్రపంచ పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.సమశీతోష్ణస్ థితికి అలవాటు పడిన మనం.. ఒక రకమైన సుస్థిర వాతావరణానికి చెందిన ప్రాణికోటి కూడ అంతకంతకూ విషమిస్తున్న ఉష్ణోగ్రతలను తట్టుకోలేని పరిస్థితి.
ఈ వేసవి వేడిమి మనుషులకే కాక జంతువులకు,పశు పక్ష్యాదులకు,చెట్లు చేమలకు కూడాప్రాణాంతకమే.ఈ మధ్య కాలంలో అయితే ఇది వర్షాకాలమా?ఎండాకాలమా?అని విచిత్రమైన పరిస్థితి నెలకొంది.ఎండాకాలంలో వర్షాలు కురవడం ఏంటో..? గతంలో వర్షాకాలంలో కూడ ఇన్ని వర్షాలు పడిన దాఖలాలు లేవు.వాతావరణం రోజుకొకతీరుగా ఉంటుంది.ఉదయంపూట-చలిగా,మధ్యాహ్ నం-ఎండగా, రాత్రిపూట వర్షం పడుతూ ఒకే రోజులో మూడు కాలాలను చూసే పరిస్థితులు నెలకొన్నాయి.ఈ అసమతుల్యఉష్ణోగ్రతలు మానవశరీరంపై చూపే ప్రభావంతో అలసిపోవడం. డీహైడ్రేషన్ కు లోనుకావడం,ఈ ఉష్ణోగ్రతలు ఇంకా విషమించితే వడదెబ్బకు దారితీసే ప్రమాదం కూడ ఉంది.భూమిపై ఉష్ణోగ్రతలు పెరగడం అంటే సహజంగానే సాగర ఉపరితలంపై కూడ ఆ ప్రభావం కనిపిస్తుంది.వేడిమి ఎక్కువ కావడం వలన సముద్ర జలం అతి తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆవిరైపోతుంది. ఎక్కువ తేమను పీల్చుకున్న గాలి భూమిని చేరినపుడు అధిక వర్షాలను కురిపించడంతో పాటుగా తుఫానులకు కూడ అధిక శక్తిని సమకూరుస్తుంది.ఉష్ణ మండలాల్లో అయితే ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.ప్రపంచ వ్యాప్తంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు1970 సంంత్సరం నుంచి సగటున ఒక డిగ్రీ దాకా పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. సముద్ర ఉపరితలంపై కూడ గత పదేళ్ల లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగిన సందర్బాలు కూడ ఉన్నాయి.ఈ ఉష్ణోగ్రతలు ఇదివరకంటే ఎక్కువ తీవ్రతతో,ఎక్కువ రోజులుండే అవకాశం ఉంది.తత్ఫలితంగా ఉత్పన్నమయ్యేదుష్ఫలితాలకు- ఒక భూకంపం, ఒక సునామీ, ఒక హరికేన్,గ్లోబల్ వార్మింగ్.. ఇవి మాత్రమేకొలమానాలు కావు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువవుతున్న ఉష్ణోగ్రతల వలన వేసవి కాలం పెరగడం,రుతు పవనాలు గతి తప్పడం , ఎడతెరపి లేకుండ అకాల వర్షాలు ముంచెత్తడం వంటి విపత్తులు ఉత్పన్నమవుతాయి.
ఈ శతాబ్దాంతానికి భూగోళంపై సగటు ఉష్ణోగ్రత 1.5 నుంచి 5.8 డిగ్రీల దాకా పెరగవచ్చని ఒక అంచనా. ఇదే నిజమైతే మరింత కరువు,మరిన్ని వరదలు,మరింత వినాశనం తప్పదు.మన భారతదేశంలో వ్యవసాయ, ఆరోగ్య ,అటవీ, మౌలికసదుపాయ రంగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పర్యావరణవేత్తలుహెచ్చరిస్తున్నా రు.ఎలాగైైతే మన శరీరాన్ని కాపాడుకోవడం, మన ఇంటిని శుభ్రపరుచుకోవడం చేస్తామో! మన గ్రహాన్ని కూడ కాపాడుకోవడం అంతే ముఖ్యం.ప్రతి వ్యక్తి స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటూ రోజువారీ జీవితంలో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. -వాహనాల వాడకాన్ని తగ్గించడం-టి.విలు,కంప్యూటర్లు, వాషింగ్ మిషన్లు, రిఫ్రీజిరేేటర్లవంటి విద్యుత్ ఉపకరణాల వాడకాన్ని నియంత్రించడం, -లైట్లు, ఫ్యాన్ల అవసరం లేకపోయినా ఆన్ చేసి ఉంచడం..-విద్యుత్ వినియోగం తక్కువగా ఉండే ఉపకరణాలు మాత్రమే కొనుగోలు చేయడం.-ప్రత్యామ్నయ ఇంధన వనరులను(సోలార్ ఎనర్జీ) వినియోగించడం. – ఒక మొక్క వృక్షంగా మారడానికి 30నుండి 40 సంవత్సరాలు పడుతుంది.కాబట్టి చెట్లను నరకకూడదు. -ప్రతి ఇంటి ముందు మంచి గాలిని ఇచ్చే చెట్లను పెంచాలి.-ముఖ్యంగా కాంక్రీట్ వాకిళ్లను తొలగించుకోవాలి. -ప్రతి ఇంటికి ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలి.-పర్యావరణానికి హాని చేసే ఏడు ఆకుల చెట్లు, కోనోకార్పస్ చెట్లను వెంటనే తొలగించి పర్యావరణానికి మేలు చేసే మొక్కలు నాటే ఉద్యమానికి పర్యావరణవేత్తలు శ్రీకారం చుట్టాలి. -అగ్ర దేశాలు,నిమ్న దేశాలు అనే తేడా లేకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా,మన భూమికి వచ్చిన జ్వరాన్ని తగ్గించే మార్గం చూడకపోతే యుగాంతంలో వస్తుందని పురాణాలు చెబుతున్న ప్రళయం నేడో రేపో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
•నరేందర్ రాచమల్ల •
9989267462