అసత్య ప్రచారాలు, వదంతులను నమ్మొద్దు
ఆర్బి గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటన
35 శాతం 2వేల నోట్లు బ్యాంకుల్లో జమ
ముంబై, ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జూన్ 8 : దేశంలో నోట్ల రద్దు, ఉపసంహరణపై పెద్ద ఎత్తున ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ.. 500 నోటు రద్దు విషయంలో ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన చేశారు. . ప్రజల్లోనూ ఎన్నో సందేహాలతోపాటు వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న 2 వేల నోట్ల రూపాయలు ఉప సంహరణ తర్వాత.. వెయ్యి రూపాయల నోట్లు మళ్లీ వస్తాయనే ప్రచారంతోపాటు.. 500 రూపాయల నోట్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీనిపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్.. గురువారం ఓ ప్రకటన చేశారు. వడ్డీ రేట్ల విషయంపై జరిగిన సమావేశంలో.. 500, వెయ్యి నోట్ల ప్రచారంలో కీలక ప్రకటన చేశారు. మళ్లీ వెయ్యి రూపాయల నోట్లను తీసుకు వచ్చే ఉద్దేశం, ఆలోచన అస్సలు లేదని స్పష్టంగా చెప్పారు. అదే విధంగా 500 రూపాయల నోట్లను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే ఆలోచన సైతం లేదని వివరించారు.. ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతుందో.. ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదని.. ప్రజలు ఎవరూ ఇలాంటి వార్తలను నమ్మొద్దని సూచించారు. పదే పదే చెబుతున్నాం.. వెయ్యి నోటు రాదు.. 500 రూపాయలు నోటు పోదు అని తేల్చిచెప్పారాయన. ఈ విషయాలపై ప్రజల్లో ఉన్న గందరగో ళాలను తొలగించాల్సిన బాధ్యత డియాపై ఉందని శక్తికాంత్ దాస్ అన్నారు. ప్రస్తుతానికి మార్కెట్ లో అతిపెద్ద నోటు 500 రూపాయలు మాత్రమే అని.. అదే కంటిన్యూ అవుతుందని.. దాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన అస్సలు చేయటం లేదని వెల్లడించారు. ఇకపోతే రెండువేల నోటు రద్దుతోరూ. 2 వేల నోట్లు బ్యాంకులకు క్యూ కట్టాయి. 2 వేల నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకున్న తర్వాత దేశంలోని బ్యాంకుల్లో ప్రజలు రూ. 2వేల నోట్లను జమ చేసేందుకు పోటెత్తారు. ఇప్పటివరకు దేశంలో సర్క్యులేషన్ లో ఉన్న రూ. 2 వేల నోట్లలో 35 శాతం తిరిగా బ్యాంకులకు వచ్చేశాయని ఆర్బీఐ ప్రకటించింది. రిజర్వ్ బ్యాంకు మే 19వ తేదీన రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు బ్యాంకుల్లో మార్చుకోవచ్చని తెలిపింది. దాంతో ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయడం, మార్చుకోవడం ప్రారంభించారు. దీంతో ఇప్పటి వరకు 35శాతం రూ. 2 వేల నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని తెలుస్తోంది. మార్చి 31 నాటికి దేశంలో 2 వేల రూపాయల నోట్లు సుమారు 181 కోట్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు 3.62 లక్షల కోట్లు. వాటిలో ఇప్పటివరకు 35 శాతం నోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయ్యాయి. 2016లో ఆర్బీఐ రూ. 2000 నోటును చలామణిలోకి తీసుకువచ్చింది. 2016 నవంబర్ 8న అప్పటివరకు చెలామణిలో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్లను రద్దు చేసింది. నగదుకు కొరత రాకుండా ఉండేందుకు రూ. 2 వేల నోట్లను ప్రవేశపెట్టింది. మిగతా డినామినేషన్లలో నగదు అవసరమైనంత మేరకు వ్యవస్థలో అందుబాటులోకి వచ్చిన తరువాత క్రమంగా రూ. 2 వేల నోట్లను తగ్గించింది. ఇక 2019 నుంచి ఆర్బీఐ రూ. 2 వేల నోట్లను ముద్రించడం కూడా ఆపేసింది.
రుణగ్రహీతలకు ఊరట
వడ్డీరేట్లు యధాతథంగా ఉంచిన ఆర్బిఐ
రుణగ్రహీతలకు ఊరట
వడ్డీరేట్లు యధాతథంగా ఉంచిన ఆర్బిఐ
వడ్డీ రేట్ల పెంపు విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. రెపో రేటును 6.50 శాతం వద్ద అలాగే కొనసాగుతుందని తెలిపారు. ఎస్డీఎఫ్ రేటు 6.25 శాతం, ఎంఎస్ఎఫ్ రేటు 6.75 శాతం, బ్యాంక్ రేటు 6.75 శాతం వద్ద స్థిరంగా ఉంటాయని వెల్లడించారు.త ఏప్రిల్లో జరిగిన తొలి ద్రవ్యపరపతి విధాన సక్షలో కూడా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అంతకుముందు మాత్రం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలనే కారణంతో 2022 మే నుంచి వరుసగా ఆరు సార్లు రెపో రేటును పెంచేసింది. ఆరు విడతల్లో 250 బేసిస్ పాయింట్లు పెంచి రుణ గ్రహీతలపై భారం పెంచింది. కానీ ఈసారి మాత్రం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో వారికి ఉపశమనం కలిగినట్లయ్యింది.