వేల కోట్లు నిధులు నీటిపాలు చేశారు..

మేడిగడ్డ సరికాదని చెప్పినా వినలేదు…
డిజైన్‌కు అనుగుణంగా సాగని నిర్మాణం
తెలంగాణ జనసమితి నేత కోదండరామ్‌ వెల్లడి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 26: మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు కట్టడం మంచిది కాదని చెప్పినా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ రీ ఇంజినీరింగ్‌కు ముందు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సుజల స్రవంతి పేరుతో ప్రారంభించారు. మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు సరికాదని చెప్పినా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సిద్ధమైంది. ఆర్థికపరమైన అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని క్యాట్‌ చెప్పింది. మేడిగడ్డ డిజైన్‌ ఒకటైతే.. నిర్మాణం మరో రకంగా చేయడంతో కుంగిపోయింది. ప్రాజెక్టు నిర్మాణ మెటిరీయల్‌ సక్రమంగా లేదు, నిర్వహణ కూడా సరిగా లేదని డ్యాం సేప్టీ అధికారులు చెప్పారు.

తుమ్మిడిహట్టి నుంచి కాలువల ద్వారా నీరు తీసుకురాగలిగితే గతంలో ఖర్చు చేసిన నిధులకు సార్థకత దక్కుతుంది. తుమ్మిడిహట్టిని పరిశీలించాలని ప్రభుత్వం, కమిషన్‌ను కోరాం. ఇంజినీర్ల సూచనలను గత ప్రభుత్వం బేఖాతరు చేసింది. మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి. విచారణ కమిషన్‌ వేయాలని కోరిందే భారాస. కమిషన్‌ వేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అసెంబ్లీలో ఆ పార్టీ  కోరింది. ప్రజల సొమ్మును ఏ ప్రభుత్వమైనా బాధ్యతగా ఖర్చు చేయాలి. విచారణ కమిటీని రద్దు చేయించి..

వాస్తవాలు బయటకు రాకుండా చేయాలని చూస్తున్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‌ తమపైన ఉన్న కేసులను ఎత్తివేయాలని కోరడం బాధ్యతారాహిత్యం. భారాస పాలనలో మాపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరుతున్నా. బొగ్గు గనులను వేలం వేయడమంటే అది ప్రైవేటీకరణకు దారి తీస్తుంది. బొగ్గు గనులను సింగరేణికే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అని కోదండరాం తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page