తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 7 : ప్రభుత్వ వైద్యుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం విధించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఒక జీవో విడుదల చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు..ఇకపై ప్రైవేట్ ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. ఈ మేరకు మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలను ప్రభుత్వం సవరించింది. రాష్ట్రంలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, పారామెడికల్ సిబ్బందిని నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకోసం కసరత్తు చేపట్టింది.
ఈ తరుణంలో నియామక మార్గదర్శకాల్లో ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేటు ప్రాక్టీస్ రద్దు అంశం కీలకంగా మారింది ఇప్పుడు. రాష్ట్రంలో మొత్తం 12,755 వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవగా వాటిలో 10 వేలకుపైగా పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచ్‌ఎస్ ఆర్‌బీ) భర్తీ చేయనుంది. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎం పోస్టులను మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు భర్తీ చేయనుండగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను మాత్రం టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది.