జాతీయ వైద్య కమిషన్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైద్య విద్యను సరళీకరిస్తూ ప్రైవేటైజేషన్ కార్పొరేటీకరణ గావించేందుకు పలు అసంబద్ధ అసమంజస నిర్ణయాలు తీసుకోవడం, కొన్నింటిని సవరించుకోవడం ,కొన్నింటిని అమలు చేయాలనుకోవడం సామాన్యులను వైద్య విద్యకు దూరం చేసే ప్రయత్నం. కోట్లున్నవారే తెల్లకోటు వేసుకునే చందంగా ధనికులకు మాత్రమే అనుకూలంగా ఉండేలా నిబంధనలు తయారు చేయడం అభ్యంతరకరం.
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం వంతులుగా వున్నా వారితోనే ఆరోగ్యవం తమైన సమాజం, తద్వారా దేశా భివృద్ధి పెంపొందిం పబడు తుంది. అనా రోగ్యంవం తమైన సమాజంతో దేశా భివృద్ధి మందగిస్తుంది. ఆరోగ్య వంతమైన సమాజం కోసం అత్యుత్తమ వైద్యవిద్య విధానం పటిష్టంగా, పక్కా ప్రణాళికతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినదిగా ఉండాలి. మనదేశంలో వైద్య విద్య విధానంను చక్క దిద్దేందుకు విధి విధానాలను నియంత్రించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను 1933లో స్థాపించారు. వైద్య విద్య ఏక రీతి మరియు ఉన్నత ప్రమాణాలను నెలకొల్పేందుకు ఒక చట్టబద్ధమైన సంస్థ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. నీతి ఆయోగ్ సిఫారసుల మేరకు సెప్టెంబర్ 2020లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దుచేసి జాతీయ మెడికల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. .జాతీయ మెడికల్ కమిషన్ ఏర్పాటు నుండి గత విధానాలను , సాఫీగా నడుస్తున్న పద్ధతిని తలక్రిందులు చేసే విధంగా అనేక అసంబద్ధ విధివిధానాలు ప్రకటించడం, అబాసపాలవుతూ వెనక్కి తీసుకోవడం తరచుగా జరుగుతుంది . వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు,కాలేజీ యాజమాన్యాల, ఆరోగ్య విశ్వవిద్యాలయాలు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం అయోమయానికి గురవు తున్నాయి . ఈ అసంబద్ధ విధానాలను భరించలేక వైద్య విద్యార్థులు కోర్టు మెట్లు ఎక్కుతున్నారు .దీంతో ప్రతి ప్రక్రియలో జాప్యం పెరిగింది .కొన్ని సార్లు విలువైన విద్యా సంవత్సరాలు కోల్పోవడం జరుగుతుంది. విద్యా విధానాలను అమలు చేయడంలో జాతీయ వైద్య కమిషన్ మరియు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకుంటున్న వివాదాస్ప దమైన నిర్ణయాల ఆరోపణల గురించి పరిశీలిద్దాం….
1. వైద్య విద్య ప్రవేశ పరీక్షను కేంద్రీకృతం చేయడం…
మనదేశం 29 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలతో సమాఖ్య
.వైద్య విద్య ప్రవేశాల కోసం గతంలో ఏ రాష్ట్రం వారు ,ఆ రాష్ట్ర పరిధిలోనే వారు అనుసరిస్తున్న విద్యా విధానం ప్రకారం సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించి , ఆ పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర పరిధిలోని రిజర్వేషన్ల ప్రకారం ప్రవేశం కల్పించేవారు .ప్రవేశ పరీక్ష స్థానిక భాషలో ,విద్యార్థులు చదివిన మాధ్యమం ప్రకారం ఉండేది .ఈ విధానం లో గ్రామీణ ప్రాంతాల వారు కూడా పోటీపడే అవకాశం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వాల రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం వైద్య విద్యను అభ్యసించే వారికి సీట్ల కేటాయింపు పారదర్శకంగా నిర్వహించబడేది. ప్రస్తుతం దేశమంతా ఒకే స్థాయి పరీక్ష నిర్వహించుటకు నీట్ యూజీ మరియు నీట్ పీజీ పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. నీట్ యూజీ పరీక్షలలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ,ప్రభుత్వ విద్యాలయాల్లో చదివిన వారు రాణించలేకపోతున్నారు. నీట్ కేవలం పట్టణ ప్రాంతాల వారికి అనుకూలంగా ఉందనే విమర్శలు కూడా తలెత్తుతున్నాయి .దీంతో తమిళనాడు రాష్ట్రం నీట్ పరీక్ష నుండి తమను మినహాయించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఆది నుంచి కూడా నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తూ వస్తుంది .
ఈ ఏడాది నీట్ దరఖాస్తులపరంగా తమిళనాడు మూడో స్థానంలో నిలిచిన ,ఉత్తీర్ణులైన వారిలో ముఖ్యంగా ప్రభుత్వ విద్యను అభ్యసిస్తున్న వారిలో 30% మాత్రమే ఉన్నారని, 99 శాతం మంది కోచింగ్ సెంటర్లలో ఫీజులు చెల్లించి శిక్షణ తీసుకున్న వారికే, సంవత్సరాల తరబడి కూర్చొని చదివిన వారే ఉత్తీర్ణులు అయ్యే అవకాశం ఉందని పరిశీలనలు చెబుతున్నాయి .ప్రభుత్వ కళాశాలలో చదివే పేద పిల్లలు కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు కుమ్మరించి శిక్షణ తీసుకోలేరు. ఆ కళాశాలలో ఉన్న అరకోర వసతులను ఉపయోగించుకొని ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కొరకే అష్ట కష్టాలు పడుతున్నారు .కనుక నీట్ గ్రామీణ విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసే విధంగా ప్రతిబంధకంగా మారిందని నిపుణులు అభిప్రాయపడు తున్నారు. నీట్ అర్హత సాధించలేక ఎందరో విద్యార్థులు దేశవ్యాప్తంగా బలవన్మరణాలకు పాల్పడడం అత్యంత విషాదకరం. ఒక తమిళనాడు రాష్ట్రంలోనే నీట్ అర్హత సాధించలేదని ఆందోళనతో తీవ్ర ఒత్తిడితో 16 మంది ప్రాణాలు తీసుకున్నారని, ఆ రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
అందువల్ల తమిళనాడు రాష్ట్రాన్ని నీట్ నుండి మినయించాలని తీవ్ర ఉద్యమం కొనసాగుతుంది .ఈ నీట్ పరీక్షను మినయించాలని 2017 లోనే తమిళ అసెంబ్లీ రెండు బిల్లులను ఆమోదించి పంపిన ఆ రెండు బిల్లులు తిరస్కారానికి గురయ్యాయి. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నీట్ ఎగ్జాం పై మద్రాస్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఏకే రాజన్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది . ఆ కమిటీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నీట్ ప్రవేశ పరీక్ష వైద్య విద్యలో ప్రవేశించేందుకు ఒక గుదిబండగా మారిందని తేల్చివేసింది .నీట్ పాఠ్యాంశాలకు రాష్ట్ర బోర్డు ప్రణాళికలకు చాలా వ్యత్యాసం ఉందని, ఇలా వేరువేరు విధానాల్లో చదవడం కష్టతరమని నీట్ ప్రవేశ పరీక్ష సామాజిక న్యాయానికి విరుద్ధంగా నిర్వహిస్తున్నారని ,కేంద్రీకృత విధానం భిన్నత్వంలో ఏకత్వం సూత్రాన్ని అనుకరిస్తున్న భారతదేశానికి పనికిరాదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి . నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తున్న తరుణంలో నీట్ 2024 పరీక్షకు ఒత్తిడి తగ్గించేందుకని సిలబస్ కుదింపు చేయడం కోసమెరుపు…
2.సీట్ల కేటాయింపులో పారదర్శకత లేకపోవడం …
నీట్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి కౌన్సిలింగ్ దేశవ్యాప్తంగా మరియు రాష్ట్రవ్యాప్తంగా ఉంటుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలోని ప్రభుత్వ కళాశాలలోని సీట్లలో 15% సీట్లను ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు .ఈ భర్తీ చేసే విధానం అయోమయంగా ,పారదర్శకంగా ఉండడం లేదు. రిజర్వేషన్ల నిబంధనలు సరిగ్గా పాటించడం లేదు. సీట్ల భర్తీ కోసం దేశవ్యాప్తంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం పెద్ద ప్రహసనం. ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది .ఏమైనా సందేహాలు ఉంటే వాటిని తీర్చుకునే మార్గం ఏమి లేదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు సీటు వచ్చిందంటే వచ్చింది..రా లేదంటే రాలేదు. కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగితున్నప్పుడు వెబ్సైట్లు సరిగా పనిచేయకపోయినా విలువైన సమయము ,డబ్బు ,సీటు అన్ని కోల్పోవాల్సి వస్తుంది . గత సంవత్సరం ఓబీసీలకు 27% సీట్లు కేటాయించడం జరుగుతుందని, కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని పలుమార్లు ప్రధానమంత్రి చెప్పినను పాటించినట్లు కనబడడం లేదు .దిల్లీ కేంద్రంగా ఈ కౌన్సిలింగ్ నిర్వహించడంతో ప్రతిభ కలిగిన వారు మంచి ర్యాంక్ వచ్చినవారు రిజర్వేషన్ ఫలాలను పొందాలనుకున్నవారు సాధ్యపడక ఆల్ ఇండియా కోటాలో మంచి కాలేజీలో సీటు పొందలేకపోతున్నారు.
3.కాలేజీల అనుమతి నిరాకరణ …….
గత తొమ్మిదేళ్లుగా పాలక ప్రభుత్వం కార్పొరేటీకరణకు ఊడిగం చేస్తుంది .లిబరలైజేషన్ ,ప్రైవేటైజేషన్ మరియు గ్లోబలైజేషన్ లో భాగంగా ఇటీవల వైద్య విద్య కళాశాలల అనుమతి సరళీకరణ సడలింపులతో కొనసాగుతుంది .గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కాలేజీల అనుమతి శాస్త్రీయంగా పకడ్బందీగా తనిఖీలు నిర్వహించి ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే ఆ కాలేజీకి అనుమతినిచ్చి అడ్మిషన్ల ప్రక్రియలో చోటు కల్పించేది. కానీ ప్రస్తుతం జాతీయ వైద్య కమిటీ కాలేజీలకు అనుమతి ఇచ్చే నియమ నిబంధనలలో పలు సడలింపులిచ్చింది. గత విధానం ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియకు ముందే తనిఖీ చేపట్టి తగిన ప్రమాణాలు నియమనిబంధనలు అనుసరించి అన్ని వసతులు కలిగిన కాలేజీలకే అడ్మిషన్లు చేసుకునే అవకాశం కల్పించేది.
కానీ గత విద్యా సంవత్సరం నుండి కాలేజీల నుండి అడ్మిషన్ల ప్రక్రియకు ముందుగా హామీ పత్రాల తీసుకొని అనుమతించడం జరుగుతుంది. అడ్మిషన్లు పూర్తయిన తర్వాత ఆ హామీ పత్రాల మేరకు కాలేజీలో వసతులు ఉన్నాయో లేవో, తగినంత మంది ప్రొఫెసర్లు ఉన్నారో లేదో అని పరిశీలించి సరిగ్గా లేనట్లయితే అనుమతి నిరాకరించడం జరుగుతుంది .వాటిలో చేరిన వారిని వేరే కళాశాలలో సర్దుబాటు చేయవలసిందిగా జాతీయ వైద్య కమిషన్ ఆదేశాలు ఇస్తుంది .ఇది చాలా ఇబ్బందికరమైన అంశం .కాలేజీ యాజమాన్యాలు కోర్టుకెక్కుతున్నాయి .మిగతా కళాశాలలో సర్దుబాటు చేయడానికి ఆరోగ్య విశ్వవిద్యాలయాలు తత్చారం చేస్తున్నాయి .కాలేజీ యజమాన్యాలు విద్యార్థులు చెల్లించిన ఫీజులను చెల్లించడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో కౌన్సిలింగ్లో ఆ కాలేజీలను ఎంచుకున్న విద్యార్థులు మానసిక ఆందోళనతో ,వ్యయ ప్రయాసలకు గురవడం విధితమే .గత సంవత్సరం సుమారు 500 మంది విద్యార్థులు రెండు మూడు నెలల పాటు రోడ్డు కెక్కి ఉద్యమించిన యెడల వారిని వివిధ కళాశాలలో సర్దుబాటు చేయడం జరిగింది. దీంతో వారి విలువైన సమయము, డబ్బు ,శ్రమ, చదువు వృధా అయినాయి. ఇలా కాకుండా సరైన నిబంధనలు ప్రమాణాలు పాటించని కాలేజీలను అడ్మిషన్ల ప్రక్రియకు అనుమతించకుండా మొదటనే పక్కకు పెడితే బాగుంటుంది.
4.పీజీ ప్రవేశ పరీక్ష కటాఫ్ తగ్గింపు ..
పీజీ వైద్య వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా వైద్య విద్య ప్రతిష్టను దిగజార్చేదిగా ఉండడం ఆశ్చర్యకరం .అన్ని విభాగాలలోను సీట్లు భర్తీ కావడం లేదని 100% సీట్ల భర్తీ లక్ష్యంగా నీట్ పీజీ 2023 కౌన్సిలింగ్ అర్హత సున్నా కటాఫ్ గా చేయడం జరిగింది .దీంతో 800 మార్కులకు నిర్వహించిన పరీక్షలో ఎటువంటి మార్పులు సంపాదించకపోయిన సీట్ల కోసం కౌన్సిలింగ్ లో పోటీ పడగలిగే అవకాశం అభ్యర్థికి దక్కింది .ఇది భారత వైద్య విద్య చరిత్రలో తొలిసారి .వాస్తవానికి ఎంబిబిఎస్ పూర్తి చేసి సంవత్సరము రెండు సంవత్సరాలు కష్టపడి చదివితేనే సీట్ పొందడం గగనకుసుమం .అలాంటి సందర్భంలో నాన్ క్లినికల్ సీట్లు మిగిలిపోతాయేమోనని ఏకంగా సున్నాకు కటాఫ్ చేయడం వైద్య విద్య విలువను, పరీక్ష ప్రతిష్టను ,గౌరవాన్ని తగ్గించి ,ప్రైవేటు కాలేజీలో ఇబ్బడి ముబ్బడిగా మిగిలిపోతున్న సీట్లకు డిమాండ్ కల్పించడానికి ,స్వేచ్ఛగా సీట్లను అమ్మకం ద్వారా నింపుకోవడానికి తీసుకున్న నిర్ణయంగా కనిపిస్తుంది. ప్రభుత్వమే డబ్బున్నవారికి ప్రత్యేకంగా కల్పించిన రాయితీగా పరిగణించవచ్చు. ఒక్క ప్రశ్నకు జవాబు రాయని ,రాయలేని వారు కూడా కౌన్సిలింగ్కు అర్హత సంపాదించేలా చేయడం ప్రైవేటు కాలేజీలకు లబ్ధి చేకూర్చడానికి అని విద్యార్థులు మండిపడుతున్నారు. సీట్లు అధికంగా మిగిలిపోతున్న సందర్భంలో అర్హతను కొద్దిగా తగ్గించడం గతంలో కూడా జరిగింది .కానీ ఏకంగా సున్నాకు తగ్గించడం ,పీజీ పరీక్షలో అత్యధిక స్కోర్ చేయాలని ,అర్హత సంపాదించి సీట్ కైవసం చేసుకోవాలని కష్టపడి చదివిన విద్యార్థులందరికీ అవమానకరం ,ఇది తప్పుడు సంకేతం కూడా ..నిజానికి సీట్లు భర్తీ కాకపోవడానికి అర్హత సాధించిన విద్యార్థులు లేక కాదు .ప్రైవేటు ,డీమ్డ్ యూనివర్సిటీలలో ఫీజులు ఆకాశాన్నంటడంతో కోట్లాది రూపాయలు చెల్లించి కొనుగోలు చేయలేక వాటి వైపు విద్యార్థులు తొంగి చూడడం లేదు. ఇప్పుడు సున్నా కటాపుతో కోట్లు పోసి సీట్లు కొనుక్కునే వారికి కొంగుబంగారమే….
5.జనాభా ఆధారంగా మెడికల్ కాలేజీలకు అనుమతి….
దేశంలో కొత్త కాలేజీల ఏర్పాటుకు జనాభాతో లింకు పెట్టడం విడ్డూరం .జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి 10 లక్షల జనాభాకు 100 సీట్లతో మాత్రమే నూతన మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తామని నిర్ణయం ,దేశవ్యాప్తంగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో తీవ్ర కలకలం చెలరేగింది. ఈ అసంబద్ధ నిబంధన పురోగమి రాష్ట్రాలను నివ్వెర పరిచింది. తెలంగాణలో 3.5 కోట్ల జనాభాకు 3500 సీట్లు మాత్రమే ఉండాలి .కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలో 56 ప్రభుత్వ ప్రైవేటు కాలేజీలలో మొత్తం 8515 ఎంబిబిఎస్ సీట్లు ఉన్నాయి .అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా 74 కాలేజీలు, కర్ణాటకలో 70 ,ఉత్తరప్రదేశ్లో 68 ,మహారాష్ట్రలో 67 కాలేజీలు ఉన్నాయి. కనుక ఇక ముందు ఈ రాష్ట్రాలలో కాలేజీ లు లు నెలకొల్పడానికి అనుమతి లభించదు. ఎన్‌ఎంసీ తాజా నిబంధన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలగజేస్తుంది .నూతన కళాశాల ఏర్పాటు చేసే స్తోమత ,చొరవ, అవకాశము గల తెలంగాణ, తమిళనాడు లాంటి రాష్ట్రాల అభివృద్ధికి మోకాళ్ల అడ్డుతుండటమే. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గనిర్దేశాల ప్రకారం ప్రతి 1000 మందికి కనీసం ఒక వైద్యుడు అందుబాటులో ఉండాలి .
దీంతో దేశంలో ఇంకనూ ఏడున్నర లక్షలకు మంది పైగా డాక్టర్ల కొరత ఉంది. సరైన వైద్య సదుపాయాలు లేక భారతదేశంలో ఏటా 24 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. అదనపు మెడిసిన్ సీట్ల అవసరం ఉన్నప్పుడు ,తీర్చేందుకు స్తోమత కలిగిన రాష్ట్రాలు ముందుకు వస్తున్నప్పుడు తాజా నిబంధనతో ప్రతిబంధకాలు సృష్టించడం ఎందుకు ? అని విమర్శలు తలెత్తుతున్న సందర్భంలో ,తాము ప్రవేశపెట్టిన నిబంధన వల్ల దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సమాన స్థాయిలో సీట్లు అందుబాటులోకి వస్తాయని, 40 వేల ఎంబిబిఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయని సమర్థించుకోవడం ఏ మేరకు సమంజసం ఏలికలకే తెలియాలి.
6.ఎంబిబిఎస్ ఉత్తీర్ణత మార్కుల శాతాన్ని తగ్గించడం…
ఎంబిబిఎస్ కోర్సు వార్షిక పరీక్షలలో ఉత్తీర్ణత గతంలో 50 శాతం మార్కులు సాధించిన వారిని మాత్రమే ఉత్తీర్ణులుగా పరిగణించేవారు. మెరుగైన వైద్యం అందించి మనుషుల ప్రాణాలను కాపాడే వారికి వారి చదువుకున్న సబ్జెక్టులలో కనీసం 50% పరిజ్ఞానం అవసరమని భావించి ఉత్తీర్ణత 50% శాస్త్రీయంగా నిర్ణయించడం జరిగింది.
ఇటీవల ఎంబిబిఎస్ ఉత్తీర్ణతను 40 శాతం కు తగ్గించారు. ప్రతిష్టాత్మకమైన వైద్య విద్య పరీక్షలకు సాధారణ పరీక్షలలో వలె ఉత్తీర్ణతా శాతం తగ్గించడం ఏమీ అవసరమో కమిషన్ కే తెలియాలి .దీనివల్ల వైద్య విద్య ప్రత్యేకత నాణ్యత తగ్గిపోతుందని ఆందోళనల వ్యక్తం చేయడంతో తిరిగి 50% కు పెంచడం జరిగింది. మెరుగైనటువంటి వైద్యులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఉన్న దేశంలో సరళీకరణ విధానం తిరోగమన చర్య…
ఇలా జాతీయ వైద్య కమిషన్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైద్య విద్యను సరళీకరిస్తూ ప్రైవేటైజేషన్ కార్పొరేటీకరణ గావించేందుకు పలు అసంబద్ధ అసమంజస నిర్ణయాలు తీసుకోవడం, కొన్నింటిని సవరించుకోవడం ,కొన్నింటిని అమలు చేయాలనుకోవడం సామాన్యులను వైద్య విద్యకు దూరం చేసే ప్రయత్నం. కోట్లున్నవారే తెల్లకోటు వేసుకునే చందంగా ధనికులకు మాత్రమే అనుకూలంగా ఉండేలా నిబంధనలు తయారు చేయడం అభ్యంతరకరం .సమాన విద్యను ,సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం చెబుతుండగా అందుకు విరుద్ధంగా మధ్యతరగతి ,బలహీన వర్గాల వారు వైద్య విద్యలో చేరేందుకు పాలక విధానాలు ప్రతిబంధకంగా ఉండటం ప్రభుత్వాలు ఎవరి సంక్షేమం కోసం పనిచేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు .ఏలికల మాటలు సామాన్యుల సంక్షేమం గురించి ,చేతలు మాత్రం సంపన్నుల అభివృద్ధి గురించి.
ఇలాంటి తరుణంలో వైద్య విద్య సామాన్యులకు అందని ద్రాక్షలా…. సంపన్నులకు అంగడి సరుకు లాగా మారిపోయింది.జాతి ఆరోగ్యాన్ని కాపాడే డాక్టర్లను తీర్చిదిద్దాల్సిన మెడికల్ కళాశాలల నాణ్యతా ప్రమాణాలలో ఎక్కడ రాజీ పడకుండా జాతీయ వైద్య కమిషన్ తన విధిని సక్రమంగా నిర్వర్తించాలి. నాణ్యతల ప్రాతిపదికన విషయంలో మన దేశం బంగ్లాదేశ్, శ్రీలంక ,భూటాన్ కన్నా వెనుకబడి ఉండటం ఆశ్చర్యకరం .అత్యున్నత ప్రమాణాలతో వైద్య విద్య ప్రతిష్టను ఇనుమడింపజేసేలా ,దేశ ఆరోగ్య వ్యవస్థకు తూట్లు పొడవకుండా నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ పురోగమన దిశలో పయనించేలా వైద్య విధానం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది …
తండ సదానందం
టి పి టి ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్
మహబూబాబాద్..