రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో విజేతలెవరన్నది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. కేవలం తెలంగాణలోనే కాకుండా దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు, నాయకుల చూపు కూడా తెలంగాణపై ఉంది. తొమ్మిదేళ్ళ కింద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వివిధ రంగాల్లో ముందు వరుసలో నిలుస్తున్నట్లుగా ప్రభుత్వం అందుకుంటున్న ప్రశంసల వల్ల తెలుస్తున్నది. ఒక విధంగా ఇప్పుడు దేశమంతా తెలంగాణ మాడల్‌ను అనుసరించాలన్న ప్రచారంకూడా జరుగతోంది. అతి తక్కువ సమయంలో ఎక్కువ ప్రగతిని సాధించిన రాష్ట్రంగా అధికార బిఆర్‌ఎస్ చాటుకుంటుండగా, అతితక్కువ సమయంలో మోయలేనంత అప్పుల భారాన్ని ప్రజలపై పడవేసిన ప్రభుత్వంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాలను అధికారపార్టీ ఏ మాత్రం పూర్తి చేయలేదన్న అపవాద బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉంది. దీనికితోడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వంతో వివిధ అంశాలపైన విభేదిస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని శంకరగిరి మాణ్యాలు పట్టించాలన్న పట్టుదలగా బిజెపి ఉంది. కాగా తెలంగాణ ఏర్పడడానికి ముందు దశాబ్ధకాలంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రజలు తమకే పట్టం కడుతారనుకుంది. కాని, ఆ పార్టీ నమ్మకం తలకిందులైంది.
దాంతో రెండు తడవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో రెండవ స్థానానికే పరిమితమైంది. దానికి తగినట్లుగా అధికారంలోకి వొచ్చిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం దాన్ని మరింత లేవకుండా చేసింది. 2014, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి గెలుపొందిన పలువురు ఎమ్మెల్యేలు కారెక్కడం, రోజురోజుకు దిగజారిపోతున్న ఆ పార్టీ నుండి సీనియర్ నాయకులు ఒక్కొక్కరు తమ రాజకీయ భవిష్యత్‌ను వెదుక్కుంటూ మరో పార్టీకి వెళ్ళడంతో, రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్న కాంగ్రెస్ కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది.. అదే సమయంలో కేంద్రంలోని ప్రభుత్వంతో కొద్దికాలం బిఆర్‌ఎస్ సఖ్యతను ఆసరా చేసుకుని కాంగ్రెస్ స్థానాన్ని క్రమేణ బిజెపి ఆక్రమిస్తూ వొచ్చింది. బిఆర్‌ఎస్‌కు ప్రధాన ప్రత్యర్థిగా బిజెపి ఎదుగుతూ వొచ్చింది. అయితే తాజాగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో బిజెపి దూకుడు తగ్గినట్లుగా కనిపిస్తున్నది. దక్షిణాది ప్రాంతంలో బిజెపి పార్టీ విస్తరణకు తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జండా ఎగురవేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నప్పటికీ ఆ పార్టీ శక్తి సరిపోవడంలేదన్న ఆలోచనలో అధిష్టానవర్గం ఉన్నట్లు తెలుస్తున్నది. అందుకే రాష్ట్ర నాయకత్వంలో చేర్పులు మార్పులు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బిఆర్‌ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రిపైన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రమైన, ఘాటైన విమర్శలు చేస్తున్నప్పటికీ, రానున్న ఎన్నికల్లో విజయానికి అదిసరిపోదన్న భావన ఆపార్టీలో ఉంది. అందుకు సంస్థాగత మార్పులతోపాటు బండి సంజయ్ స్థానంలో మరొకరికి అవకాశం ఇస్తారన్న ప్రచారం జరుగతోంది.
ఆయన గౌరవానికి భంగం వాటిల్లకుండా కేంద్రంలో మంత్రి పదవిని ఇవ్వవొచ్చనుకుంటున్నారు. వాస్తవంగా కర్ణాటక ఎన్నికలకు ముందునుండే తెలంగాణ లక్ష్యంగా బిజెపి పావులు కదుపుతూ వొస్తోంది. అయితే కర్ణాటకలో నిన్నటివరకు అధికారంలో ఉండడంతో ఆక్కడ విజయం ఖాయమని భావించింది. దాని ప్రభావం తెలంగాణపై పడుతుందని, అప్పుడు తెలంగాణలో కూడా విజయం సులభతరం అవుతుందని భావించింది. కాని, అనూహ్యంగా కాంగ్రెస్ ఆ రాష్ట్రాన్ని దక్కించుకోవడంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఉత్సాహంగా దూసుకుపోవడానికి కారణంగా మారింది. అయితే కర్ణాటకలో జరిగిన తప్పిదాలు తెలంగాణలో జరుగకుండా జాగ్రత్త పడడంతోపాటుగా, కేంద్ర నాయకుల పర్యటనలు తెలంగాణ ఉండేట్లుగా బిజెపి ఇప్పుడు పకడ్బందీగా ప్రణాళికలను ఏర్పాటు చేస్తోంది. ప్రధానంగా ఈ నెల ముగ్గురు కేంద్ర నాయకుల పర్యటన తేదీలను కూడా ఆ పార్టీ ఖరారు చేసింది. ఈ నెల 15 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, 25న ఆ పార్టీ అఖిలభారత అధ్యక్షుడు జెపి నడ్డాతోపాటు ఈ నెల ఆఖరి లోగా ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఉంటుందని ఆ పార్టీ ప్రకటించింది. ఎట్టిపరిస్థితిలో ప్రభుత్వాన్ని నెలకొల్పే స్థానాలను కైవసం చేసుకుంటామన్న ధీమాను ఆ పార్టీ వ్యక్తం చేస్తుండగా తమకు 75 స్థానాలు గ్యారంటీ అంటోంది కాంగ్రెస్.
కర్ణాటకలో కాంగ్రెస్ కృషిని గుర్తుకు తెచ్చుకుని పార్టీ నాయకులంతా పదవులతో ప్రమేయం లేకుండా కలిసికట్టుగా పనిచేయాలంటూ ఆ పార్టీ కేంద్ర నాయకత్వం తమ శ్రేణులకు హితబోధ చేస్తున్నది. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందంచే ఇప్పటికే నిర్వహించిన పలుసర్వేల్లో ఊహించని ఫలితాలు వొస్తున్నాయంటున్నాయి ఆపార్టీ వర్గాలు. గత తొమ్మిదేళ్ళుగా హామీలు నెరవేర్చని బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, దాన్ని వోట్ల్ల రూపంలో మల్చుకునేందుకు పార్టీనేతలంతా కలిసికట్టుగా కృషిచేయాలని ఆ పార్టీ అధినాయకత్వం పిలుపునిస్తోంది. ముఖ్యంగా సీనియర్లు, జూనియర్లన్న భేదాభిప్రాయాలను విడనాడటంతో పాటుగా వివిధ పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నాయయకులను చేరదీయాలన్నది ఆ పార్టీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఎవో కారణాలతో పార్టీని వీడిపోయినవారిని కూడా తిరిగి పార్టీలోకి ఆహ్వానించడం, కలిసివొచ్చే ఇతర రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకుపోవాలన్నది ఆ పార్టీ ఆలోచనగా ఉంది. దీనికితోడు ప్రజలను ఆకర్షించే విధంగా హామీలివ్వడమేకాదు, అధికారంలోకి వొచ్చాక కర్ణాటకలో మాదిరిగా వెంటనే హామీలను అమలుపరుస్తామన్న గ్యారెంటీ ఇవ్వడం ద్వారా ప్రజలను ఆకట్టుకోవాలన్నది ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ రెండు పార్టీల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తోంది బిఆర్‌ఎస్. ఆ పార్టీలు వేసే ఎత్తుగడలకు రెండడగులు ముందుండే ప్రణాళికలను రచిస్తోంది బిఆర్‌ఎస్. బిజెపి దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ తనకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసేనని బిఆర్‌ఎస్ నాయకులు గంటా పథంగా చెబుతున్నారు.
రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే శక్తి బిజెపికి లేదని, ఆ పార్టీలో చేరేందుకు ఎవరూ ముందుకు రావడంలేదన్న విషయాన్ని ఎత్తి చూపుతున్నారు. తాజాగా బిఆర్‌ఎస్‌నుండి బహిష్కృతులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు బిజెపిలో చేరడానికి అయిష్టతను వ్యక్తం చేసిన విషయాన్ని బిజెపి చేరికల కమిటి చైర్మన్ ఈటల రాజేందరే స్వయంగా పేర్కొన్న విషయాన్ని వారు వివరిస్తున్నారు. గత రెండు ఎన్నికలను పరిశీలించినప్పుడు ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండవ స్థానంలో నిలిచింది. గెలిచిన నాయకులు తమ రాజకీయ స్వార్థంకోసం పార్టీ ఫిరాయించడం వేరే విషయం. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఆదరణ ఉందన్నది దీనితో స్పష్టమవుతుంది. అందుకే తమకు ప్రధాన పోటీ కాంగ్రెస్‌తోనే అంటోంది బిఆర్‌ఎస్. అందుకు కాంగ్రెస్‌ను ఎదుర్కోవడమే ప్రధాన లక్ష్యంగా బిఆర్‌ఎస్ ప్రణాళికలను రచిస్తోంది. బిఆర్‌ఎస్ అధినేతగా కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మరో ముఖ్యనేత హరీష్‌రావు ఇటీవల కాలంలో నిర్వహిస్తున్న ప్రతీ సభలో కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తూ మాట్లాడటం గమనార్హం. కాంగ్రెస్ వొస్తే ప్రస్తుతం ప్రజలు పొందుతున్న సంక్షేమ ఫలాలన్నీ వెనక్కు పోతాయంటూ ప్రచారాన్ని వారు ప్రజల మధ్యకు తీసుకుపోతున్నారు. ఎట్టి పరిస్థితిలో వంద స్థానాలు గెలిచి తీరుతామని ప్రకటిస్తున్న బిఆర్‌ఎస్ నిజంగానే ఈసారి హ్యాట్రిక్ కొడుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.