హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14 : తెలుగు ప్రజలకు భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం ప్రకటన విడుదల చేసారు. సంక్రాంతి విశ్వమంగళ దినం.. అని పేర్కొంటూ దురదృష్టకరమేమిటంటే ప్రత్యేక రాష్ట్రం వొచ్చి 8 ఏళ్లయినా ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు. దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ రైతులు నిండా కష్టాల్లో, నష్టాల్లో కూరుకుపోయారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానం ఉంది..అయినప్పటికీ తన విద్యుక్త ధర్మాన్ని వీడకుండా నీళ్లున్నా లేకున్నా, కరెంట్ వొచ్చినా రాకున్నా, పంటకు ధర వొచ్చినా రాకున్నా ఆరుగాలం కష్టపడి కలో, గంజో తాగి పంట పండించి దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న..
వొచ్చే ఏడాది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు వొస్తుందని, రాష్ట్రానికి పట్టిన చీడ, పీడలు విరగడై సరికొత్త కాంతులతో రైతన్నలు సుఖసంతోషాల మధ్య సంక్రాంతి జరుపుకుంటారని ఆశిస్తున్నా.. అప్పుల తిప్పలు లేని, ఆత్మహత్యల్లేని, కల్లాల దగ్గర కన్నీళ్లులేని సుభిక్ష పాలన రావాలని కోరుకుంటున్నా. అప్పటిదాకా కష్టనష్టాలను ఎదుర్కునే మనోధైర్యం ప్రజలకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా..పండుగ రోజు సైతం అబద్ధాలు చెప్పకుండా ప్రజలకు వాస్తవాలు చెప్పేలా బుద్ధిని రాష్ట్ర పాలకులకు ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నా..అని ప్రకటనలో పేర్కొన్నారు.