వారిని ఆదుకునేందుకు అనేక చర్యలు
రాష్ట్రం వొచ్చాకనే నేతన్నలకు అండగా ప్రభుత్వం
పద్మశాలీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్
కేసీఆర్‌ది చేతల ప్రభుత్వం, చేనేతల ప్రభుత్వమని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని చేనేతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు. శుక్రవారం జిల్లాలోని తుర్కయంజల్ మున్సిపాలిటీ మన్నెగూడలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌కు చేనేత కార్మికుల కన్నీటి గాథలు తెలుసునన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికులు బతుకులు ఆగమయ్యాయని, స్వరాష్ట్రంలో చేనేత అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ ఎనిమిదేళ్లలో చేనేత కార్మికుల కోసం ఇప్పటివరకు 5 వేల 752 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. చేనేత కార్మికుల కోసం చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. నూలు, రసాయనాల మీద 40 శాతం సబ్సిడీ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. నేతన్నలకు సంబంధించి ఏమైనా పాత బకాయిలు ఉంటే వెంటనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. నేతన్నల డిజైన్లను ఎవరైనా కాపీ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇప్పటి వరకు 37 వేల వరకు మర మగ్గాలు, 16 వేల వరకు చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేశామని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు భీమా పథకాలు తీసుకొచ్చి రైతులను ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా రైతు బీమా లాగానే చేనేత కార్మికులకు కూడా ప్రభుత్వం బీమా ఇస్తుందని, దురదృష్టవశాత్తు ఎవరైనా చేనేత కార్మికుడు చనిపోతే వారం రోజుల్లో రూ.5 లక్షలు బీమా చెల్లిస్తున్నామని తెలిపారు. అర్హులైన చేనేత కార్మికులకు నెలకి రూ.2 వేల పెన్షన్ ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. పద్మశాలిల కోసం కోకాపేటలో పద్మశాలి ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో నేతన్నల ఆత్మహత్యలు చూసి కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కుల వృత్తులను కాపాడుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడు చేనేత కళాకారులను అనేక పథకాలతో కేసీఆర్ ఆదుకుంటున్నారని అన్నారు. వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద రంగం చేనేత, జౌళి రంగం అని కేటీఆర్ తెలిపారు. ఈ రంగంపై కేసీఆర్‌కు మొదట్నుంచి అవగాహన ఉంది. దుబ్బాకలో హైస్కూల్లో చదువుకున్న సమయంలో పద్మశాలీ ఇంట్లో ఉండేవారు. అప్పట్నుంచే చేనేత కళాకారుల కన్నీళ్ల గురించి కేసీఆర్‌కు తెలుసు.
భూదాన్ పోచంపల్లిలో ఒకటే వారంలో ఎనిమిది మంది చేనేత కళాకారులు ఆత్మహత్య చేసుకున్నారు. కేసీఆర్ చలించిపోయి, జోలేపట్టి డబ్బులు సేకరించి, లక్ష రూపాయాల చొప్పున ఇచ్చారు. సిరిసిల్లలో కూడా నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు. సిరిసిల్ల గోడల మీద రాతలు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. నేతన్న చావొద్దు.. నీ కుటుంబం ఉసురు పోసుకోవద్దని నాటి కలెక్టర్ రాయించి, ఆత్మస్థైర్యం నింపారు. సిరిసిల్లలో తొమ్మిది మంది నేతలు బలవన్మరణం పాల్పడితే.. వారిని ఆదుకోవాలని నాటి ముఖ్యమంత్రికి కేసీఆర్ లేఖ రాశారు. కానీ స్పందించలేదు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా టీఆర్ఎస్ నుంచి రూ. 50లక్షలు ఇచ్చి సూక్ష్మ రుణాలు ఇవ్వండి. ఆత్మహత్యలు ఆపండి అని కేసీఆర్ నాటి అధికారులను ఆదేశించారు.
ఆనాడు మీ కష్టాలను అర్థం చేసుకుని, 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేనేత, జౌళి బ్జడెట్ ను రూ. 70 కోట్ల నుంచి రూ. 1200 కోట్లకు పెంచారు. చేనేత, జౌళి శాఖకు ఇప్పటి వరకు రూ. 5,752 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అధికారులను పిలిచి సీఎం సమీక్షించారని కేటీఆర్ గుర్తు చేశారు. నెలకు ఎంత ఆదాయం వస్తున్నదని అడిగారు. మీ డిజైన్లను కాపీ కొడితే కఠినంగా కేసులు పెట్టి, లోపల వేయించే బాధ్యత తీసుకుంటాను. అవసరమైతే చట్టాల్లో మార్పులు చేసే దిశగా ముందుకు వెళ్తామన్నారు. చేనేత మిత్ర ద్వారా నలభై శాతం నూలు, రసాయనాల మీద సబ్సిడీ ఇస్తున్నాం. పాత బకాయిలు ఉంటే వాటిని కూడా సంపూర్ణంగా విడుదల చేయిస్తామన్నారు. నేతన్నకు చేయూత అనే కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ పథకం ద్వారా కరోనా సమయంలో 26 వేల మంది కార్మికులకు లాభమైందని కేటీఆర్ తెలిపారు.