దేశంలో వ్యవసాయ రంగం ఏటేటా అతివృష్టి లేకపోతే అనావృష్టి కోరల్లో విలవిలలాడుతుంది.అందువల్ల ఈ రంగంలోని కొన్ని అంశాలలో సంస్కరణలు చేపట్టవలసి ఉంది.దేశంలో ఆహార భద్రతకు ధోకా లేని నేపథ్యంలో వ్యవసాయాభివృద్ధి మందకొడిగా ఉందని చెప్పవచ్చు. ఇది ప్రస్తుత వ్యవసాయ రంగ ముఖచిత్రం.ఆహార భద్రత ఇప్పుడొక సమస్య కాక పోయినప్పటికీ వ్యవసాయరంగంలో ప్రపంచ దేశాల మధ్య పోటీలు పెరిగిన దృష్ట్యా భారత ప్రభుత్వం ఈ రంగాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఏర్పడింది.నేటికి ఆర్ధిక రంగంలో వ్యవసాయం బలమైన శక్తి అని తక్కిన అన్ని రంగాలు దీని చుట్టూ పరిభ్రమిస్తాయని అనే విషయాన్ని విస్మరించారు.
మరి ఈ వ్యవసాయం అభివృద్ధి సాధించాలంటే దానికి వెన్నముక గ్రామం.. రైతు… గాంధీజీ చెప్పినట్లు గ్రామ స్వరాజ్యం గ్రామం నుండి మొదలవుతుంది..అన్నట్లుగా, దేశ ప్రగతికి పట్టుకొమ్మలు గ్రామాలని చెప్పవచ్చు.
రోజు రోజుకు వ్యవసాయం చేసే వారి సంఖ్య తగ్గిపోతుంది.మరి వ్యవసాయం తగ్గడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అలాగే వాటికి అడ్డంకులు, సంస్కరణలు కూడా ఖచ్చితంగా అవసరమని చెప్పకనే చెప్పవచ్చు.దురదృష్టవశాత్తు ఆర్ధిక రంగాన్ని పరిపుష్టం చేయడానికి వ్యవసాయం శక్తివంతమైన సాధనం అనే విషయాన్ని భారత విధాన నిర్ణేతలెవరూ గ్రహించడం లేదు.ఆర్ధిక సంస్కరణలు ఊపందుకున్న తర్వాత ఆర్ధిక పెరుగుదలకు వాణిజ్య, పారిశ్రామిక రంగాలపైననే దృష్టిని కేంద్రీకరించారు. వ్యవసాయ రంగాన్ని కూడా పరిశ్రమగా గుర్తించే విషయంలో నేటి వరకు చిత్తశుద్ధిగా ప్రయత్నం జరగలేదనే చెప్పాలి.
వ్యవసాయాభివృద్ధి మందకొడిగా ఉండడం, లాభాలు తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశాలలో ముఖ్యమైనవి. వ్యవసాయ రంగంలో దిన దినం లాభాలు చాలావరకు తగ్గిపోతున్నాయి. ఈ పరిస్థితిని నివారించడం నేటికి జరగలేదనే చెప్పాలి. ఇంతవరకు వ్యవసాయ రంగంతో ప్రమేయం ఉన్న ప్రతి రంగం దేనికదే విడివిడిగా వ్యవహరించిందే తప్ప అవి పరస్పర సమన్వయంతో పనిచేయక పోవడం కుంటుపడడానికి కూడా ముఖ్య కారణం. వ్యవసాయాభివృద్ధికి ఈ గందరగోళ పరిస్థితి నివారించాలన్నది అందరూ అంగీకరించిందే. అయితే లాభాల కోసం వ్యవసాయాభివృద్ధికి వ్యవసాయోత్పత్తుల పెరుగుదలకు, ఇతర కీలక రంగాల సంస్కరణల ఫలితాలను ఒక్క తాటి మీదకి తీసుకురావాలన్న విషయం మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఏది ఏమైనా వ్యవసాయం చేస్తున్న రైతు నలుదిక్కులు చూస్తూ ఉంటున్నడే తప్ప ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నాడు. దీనికి తోడు వాతావరణం కూడా సహకరించడంలేదు.వర్షాకాలంలో వర్షాలు లేవు, చలికాలంలో చలి ఉండదు. ఇలా ఏ కాలంలో అవి లేక పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలతో రైతులు తమ పంట దిగుబడిని తమ పంటలు పొందలేకపోతున్నారు.ఎలాగో కష్టపడి పంట పండిస్తే మార్కెట్లోకి వచ్చాక పండించిన పంటకు సరియైన గిట్టుబడి ధరలేక ఆధరలను పొందలేక దలారుల చేతిలో మోసపోతున్నారు. చాలా వరకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం కోసం కొన్ని సబ్సిడీలను అందజేస్తున్నాయి. అందులో వ్యవసాయం, విద్యుచ్ఛక్తి, ఎరువులు,ఋణమాఫీ వంటి పతకాలతో రైతులకు కొంత చేరువైనప్పటికి అవి పూర్తిగా ఫలప్రదం కావడం లేదనే చెప్పాలి.
అలాగే కేందప్రభుత్వం వ్యవసాయానికి కూడా సెక్యూరిటీగా ఇన్సూరెన్సులను చేయించుకోవాలని,రైతు ఆత్మహత్యలు ఆగిపోతాయని, అప్పుల నుండి రైతులు బయటపడే అవకాశం ఉందని భావించి ఈ
కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.అలాగే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వ్యవసాయాన్ని అభివృద్ధి పరచడం కోసం అనేక బృహత్తర కార్యక్రమాలు
మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం, నిరంతర విద్యుచ్ఛక్తి వంటివి ఇచ్చిన కాని ఇంకా వ్యవసాయం అనుకొన్న స్థాయిలో జరగడం లేదనే విషయం వాస్తవం. ఇంకా చెప్పాలంటే వ్యవసాయ కేంద్రంలో పనిచేసే శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడి కొత్త వంగడాలను సృష్టించి వాటిని రైతులకు అందజేయడంలోను, రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లలో వాతావరణాలకు అనుకూలంగా రైతుల పంటలు పండించే భూమిలో ఏ విధమైన పంటలు పండుతాయో పరిశీలించిన తర్వాత నే పంటలు వేసుకుంటే రైతుకు లాభదాయకం లేనట్లయితే పెట్టుబడికి తెచ్చిన డబ్బులు కూడా రాక ఇబ్బందులు పడవలసి వస్తుంది.
ఏది ఏమైనా ఊకే వేసినపంటలే వేయకుండా పంటల మార్పు చేసుకోవాలి అలాగే అంతర పంటలను ఆరుతడి పంటలను వాతావరణాలకు అనుకూలంగా వేసుకోవాలి. వ్యవసాయం అంటే ఒక పంటలు పండించడమే కాకుండా పంటల హరిత విప్లవం, నూనె గింజల ఉత్పత్తికై పసుపు విప్లవం, పాల ఉత్పత్తి కై శ్వేత విప్లవం, చేపల ఉత్పత్తికై నీలి విప్లవం, ఫల పుష్పాల ఉత్పత్తికై పసిడి విప్లవం ఇవన్నీ కూడా వ్యవసాయోత్పత్తుల వృద్ధి కి చేసే ప్రయత్నాలు.పండిన పంటకు, చేసిన శ్రమకు తగినంత ఫలితం ఉంటేనే అనగా గిట్టుబడి ధర ఉంటేనే రైతు పదికాలాల పాటు చల్లగా ఉంటాడు. ఆ దిశగా రైతులు ప్రయత్నం చేయాలి. యువతను సైతం వ్యవసాయ రంగం వైపు ఆకర్షించాలి. కొత్త పద్ధతులు, కొత్త వంగడాలతో సరికొత్త విధానాలతో నూతన హరిత విప్లవాన్ని సాధించుటలో రైతులు, ప్రభుత్వం ఇరువురు పూర్తి సహాయ సహకారాలతో ఉన్నపుడే బీడుభూములు సైతం హరిత వనంగా మారతాయి.ఆ దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తూ…
– చిరంజీవి మోటె