వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: వ్యవసాయ గణనను జాగ్రత్తగా, పొరపాట్లు లేకుండా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి వ్యవసాయ అధికారులు, విస్తీర్ణ అధికారులు, సహాయ గణాంకాల అధికారులు, సూపర్ వైజర్లు, ఎనిమేటర్స్ కు వ్యవసాయ గణనపై జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. వ్యవసాయ గణన మొదటి దఫాను ఖచ్చితమైన సమాచారంతో ఆగస్టు 15 లోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఐదు సంవత్సరములకు ఒకసారి చేపట్టే గణాంకాలలో భాగంగానే 2021-22 సంవత్సరమునకు సంబంధించిన 11వ వ్యవసాయ గణన చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ గణనను ఫేస్-1, ఫేస్ -2, ఫేస్-3 లలో చేపట్టడం జరుగుతుందని, వ్యవసాయ గణన నిరంతరం కొనసాగే ప్రక్రియ అని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి సర్వే నెంబర్, పట్టాదారు వారిగా గణాంకాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు . మండలాలకు సంబంధించిన క్లస్టర్లలోని గ్రామ సర్పంచులకు, పంచాయతీ సెక్రెటరీలకు వివరించాలని సూచించారు. వ్యవసాయ గణనపై ఏవేని అనుమానాలు ఉంటే శిక్షలో వాటిపై నివృత్తి చేసుకొని పని చేయాలని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ శాఖ, గణంకాల శాఖ అధికారులు సమన్వయతో పనిచేసి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని పేర్కొన్నారు.అనంతరం జాయింట్ డైరెక్టర్ సౌమ్య వ్యవసాయ గణనను ఏ విధంగా చేయాలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వ్యవసాయ అధికారులకు వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఉప గణాంకాల అధికారి విజయలక్ష్మి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి నిరంజన్ రావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్ , వ్యవసాయ, గణాంకాల శాఖకు సంబందించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.