- మనల్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వడం లేదు
- మతాల మధ్య చిచ్చు పెట్టి ప్రయోజనం పొందే యత్నం
- కేసీఆర్‌ను యాది చేసుకోవాలె… కృతజ్ఞత చూపాలె
- రామాయపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, మే 27(ప్రజాతంత్ర బ్యూరో) : కేంద్రంలోని బిజెపి పార్టీ సర్కార్‌పై రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణను చూసి కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వం ఓర్వడం లేదనీ, మతాల మధ్య చిచ్చుపెట్టి ప్రయోజనం పొందాలని చూస్తుందన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గంలోని మనోహరాబాద్ మండలం రామాయపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ఎఫ్‌డిసి ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ జి.ఎలక్షన్‌రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ చంద్రాగౌడ్, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డితో కలిసి మంత్రి హరీష్‌రావు ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం, నిరుపేద ప్రజల కోసం సిఎం కేసీఆర్ ఎంతో చేస్తున్నాడనీ, మన బాగోగుల కోసం పని చేస్తున్న కేసీఆర్‌ను యాది చేసుకోవాలనీ, కృతజ్ఞత చూపాలన్నారు.
రాష్ట్రానికి ప్రధానమంత్రి మోది, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా వొచ్చారనీ, రాష్ట్రంలోని పేదల కోసం, అభివృద్ధి కోసం ఒక్క మాటైనా చెప్పలేదన్నారు. ఎంతసేపు ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తున్నారనీ ఆరోపించారు. రాష్ట్రం కోసం కేంద్రంలోని బిజెపి సర్కార్ ఎలాంటి సహాయం చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేయకున్నా…రాష్ట్రం కోసం తమకు శక్తి ఉన్నంత వరకు మీకు సేవ చేస్తామనీ, తెలంగాణ అభివృద్ధి కోసం పాటు పడతామన్నారు. గజ్వేల్ నుంచి ఏడేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీకి చెందిన గీతారెడ్డి మంత్రిగా ఉండే వారనీ, కనీసం తాగడానికి మంచి నీళ్లు ఉండేనా? ఒకసారి ఆలోచన చేయాలన్నారు. కేసీఆర్ సిఎం అయ్యాక తాగు, సాగు నీళ్ల కొరత, కరెంటు కొరత లేదన్నారు. అన్ని విధాలుగా గజ్వేల్ ప్రాంతం అభివృద్ధి చెంది దేశానికి రోల్ మోడల్‌గా మారిందన్నారు. కాంగ్రెస్, బిజెపి పార్టీకి చెందిన నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతారనీ, 70 ఏళ్లు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఏమీ చేయలేకపోయారన్నారు. ఒకప్పుడు నీళ్లు మోసే అవ్వ ఇవ్వాలా నీళ్ల మోత బాధ తప్పిందని సంబురపడుతుందన్నారు. జాతీయ రహదారి పక్కనే ఇంత మంచి ఇల్లు ఉండటం అదృష్టమనీ, మీ అందరికీ శుభాకాంక్షలు అన్నారు.
పైసా ఖర్చు లేకుండా ఇల్లు కట్టిచామనీ, మీ వద్దకే మంత్రి వొచ్చాడు, జిల్లా కలెక్టర్ వొచ్చాడు. మిమ్మల్ని ఇంట్లో అడుగు పెట్టించామన్నారు. ఇంటి అడుగు జాగా ఉన్నవాళ్లకు ప్రభుత్వమే డబ్బు ఇచ్చే కార్యక్రమం త్వరలోనే ప్రారంభిస్తామనీ, పింఛన్లు 2016 ఇస్తున్నామనీ, ఒకటి రెండు నెలల్లో మిగిలిన అర్హులైన వాళ్లకు పింఛను ఇస్తామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఇళ్ల పథకం లేదనీ, కాన్పు కోసం పోతే కూడా పైసలు ఇస్తున్నామనీ, కేసీఆర్ కిట్ ఇస్తున్నామనీ, బిడ్డ పుడితే 13వేల రూపాయలిచ్చి అమ్మ ఒడి వాహనంలో ఇంటికి పంపుతున్నామన్నారు. ఒకప్పుడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అని పాడుకునే వారనీ, ఇప్పుడు నేను సర్కారు దావాఖానకే పోతా అంటున్నారనీ, సర్కారు నౌకరీ అంటే ఎంత క్రేజ్ ఉందో సర్కారు దవాఖానకు, సర్కారు బడికి అంత క్రేజ్ రాబోతుందనీ మంత్రి హరీష్‌రావు అన్నారు.