‘‘జీఓ-111 రద్దు చేసిన ఫలితంగా ప్రభుత్వ నియంత్రణ కొరవడి విచ్ఛలవిడిగా, విచక్షణారహితంగా పట్టణీకరణకు ద్వారాలు తెరుచుకుంటూ భాగ్యనగరం చుట్టు ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలు, నీటి నిల్వల ఉనికి ప్రమాదంలో పడుతుందని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. ఈ జీఓ రద్దుతో చారిత్రాత్మక ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాళయాలు ‘మృత్యఘోష’ను అనుభవిస్తాయనే విషయాన్ని నిపుణులు వాపోతున్నారు.’’
(తెలంగాణ ప్రభుత్వం జీఓ-111 రద్దు ఆలోచన నేపథ్యంలో)
1996లో నాటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ-111 ప్రకారం హైదరాబాదు సమీపానగల ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల నిండు స్థాయి 10 కిమీ వ్యాసార్థ పరిధిలో ఎలాంటి భారీ నిర్మాణాలు చేపట్టవద్దని తీర్మానించారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి శాసన సభలో చేసిన ప్రకటన ప్రకారం జీఓ-111 ప్రస్తుత పరిస్థితుల్లో అనవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీఓ-111 రద్దు చేసిన ఫలితంగా ప్రభుత్వ నియంత్రణ కొరవడి విచ్ఛలవిడిగా, విచక్షణారహితంగా పట్టణీకరణకు ద్వారాలు తెరుచుకుంటూ భాగ్యనగరం చుట్టు ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలు, నీటి నిల్వల ఉనికి ప్రమాదంలో పడుతుందని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. ఈ జీఓ రద్దుతో చారిత్రాత్మక ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాళయాలు ‘మృత్యఘోష’ను అనుభవిస్తాయనే విషయాన్ని నిపుణులు వాపోతున్నారు. 1920లో మూసీ నది వరదలను అదుపు చేసే లక్ష్యంతో 7వ హైదరాబాదు నిజామ్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నగర తాగు నీటి వనరులుగా నిర్మించిన ఈ రెండు జలాశయాలకు మూసీ, ఈసా నదుల జలాలే మూలాధారంగా ఉన్నాయి. ఈ జలాశయాల 10 కిమీ వ్యాసార్థ పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు, నివాస కాలనీలు, పర్యావరణ విరుద్ద కట్టడాలు అరికట్టే సదుద్దేశంతో జీఓ-111 తీసుకువచ్చారు. నేడు ఈ జలాశయాల తాగు నీరు జంట నగరాలకు అవసరంలేదని, కృష్ణ, గోదావరి నదుల నుండి నీటిని తరలిస్తున్నామని సమర్థించుకుంటూ సియం వివరణ ఇచ్చారు.
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిధిలోని చేవెళ్ల, మోయినాబాదు, షాబాదు, శంషాబాదు, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి మండలాల 84 గ్రామాలకు చెందిన 1.32 లక్షల ఎకరాల ఆయకట్టు భూమి ఉన్నది. 2018 ఎన్నికల సందర్భంగా కూడా చేవెళ్ల సభలో ముఖ్యమంత్రి జీఓ-111ను 6 నెలలలో రద్దు చేస్తామని వాగ్దానం కూడా చేశారు. జలాశయాల పరిధిలోని గ్రామవాసులు, రియాల్టర్లు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా జీఓ రద్దు చేయడం ద్వారా తమ భూముల విలువ పెరుగుతుందని, అక్కడ ఐటీ పరిశ్రమల ద్వారా ఉద్యోగ ఉపాధులు పెరుగుతాయని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఈ గ్రామాల ప్రజలకు శాపంగా మారిన జీఓ-111ను సత్వరమే రద్దు చేయాలనే ప్రతిపాదనలు తరుచుగా వినిపిస్తున్నాయి. జీఓ రద్దు చేయడానికి ముందు ప్రభుత్వ యంత్రాంగం సూక్ష్మ స్థాయిలో అధ్యయనం చేస్తామని, గ్రీన్ జోన్లను ముందుగానే నిర్ణయిస్తామని తెలుపడం కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నది. తాగు నీటి అవసరం లేకపోయినప్పటికీ ఈ జలాశయాల మనుగడతో నగరంలో వరదల ప్రభావం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షకులుగా నిలుస్తున్నాయని పర్యావరణ వేత్తలు నినదిస్తున్నారు. ఈ జంట జలాశయాలు దిగువన ఉండడంతో సహజంగానే వర్షాలకు నిండుతున్నాయని, ఎలాంటి నిధుల అవసరంగాని, ఎత్తిపోతల వ్యథలుగాని లేవని గుర్తు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణను దృష్టి పెట్టుకొని ఈ జలాశయ పరివాహక ప్రాంత రైతుల హితంతో ప్రభుత్వం కర్షకుల ఆర్థిక వనరుల పథక రచనలు చేయాలని సూచిస్తున్నారు. భవిష్యత్తు తరాల ఆరోగ్యకర మనుగడను దృష్టిలో ఉంచుకొని జలాశయాలు, వాటర్ బాడీల విస్తీర్ణాన్ని పెంచడానికి బదులు వాతావరణ ప్రతికూల మార్పులకు ఊతం ఇచ్చేలా వాటిని కుదించడం అతి ప్రమాదకరమని హరిత ప్రేమికులు వాపోతున్నారు.
ఇటీవల విడుదలైన ప్రతిష్టాత్మక ఐపిసిసి (ఇంటర్‌గవర్నమెంటల్ పానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్) నివేదిక ప్రకారం సముద్రతీర ప్రాంత నగరాలతో పాటు హైదరాబాదు లాంటి నగరాలు కూడా ప్రతికూల వాతావరణ మార్పుల విషవలలో చిక్కి నగరవాసుల ఆరోగ్యాలు ప్రమాదంలో పడనున్నాయని హెచ్చరించారు. 2000 సంవత్సరంలో సుప్రీమ్ కోర్టు కూడా జీఓ-111ను సమర్థిస్తూ, వాటర్ బాడీల కాలుష్యాలను కట్టడి చేయాలనే మైలురాయిలా నిలిచే తీర్పును ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే జలాశయ పరిధిలో అనధికారికంగా 12,500 అక్రమ నిర్మాణాలు, 400 అక్రమ లేఅవుట్లు జరిగినట్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నివేదిక కూడా సమర్పించడం, యన్‌జిటి యథాస్థితిని కొనసాగించాలని ఆదేశించడం మనకు తెలుసు. ఇలాంటి జీఓ-111ను రద్దు చేస్తే రాబోయే రోజులలో మూసీ నది తీరాన నివసిస్తున్న లక్షలాది జనుల ప్రాణాలకు వరద ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. హైదరాబాదుకే జలమాలలుగా 2.5 – 3.0 టియంసీల నిలువ సామర్థ్యం కలిగిన ఉస్మాన్‌సాగర్, 2.2 టియంసీ సామర్థ్యం కలిగిన హిమాయత్‌సాగర్లను పరిరక్షించుకోవలసిన అత్యవసర స్థితిలో ఉన్నామని తెలంగాణ వాసులు, సాధారణ పౌరులు, యువత, పర్యావరణ హితవరులు గమనించి సమయానుకూలంగా గళమెత్తాలని సూచిస్తున్నారు.