నమ్మి పీఠం కట్టబెడితే
నరకం జూపుతున్నరు
గద్దెనెక్కింది మొదలు
గద్దల్లెక్క పొడుస్తున్నరు
దేశాన్ని కాసాయికరించ
కసాయిలా ప్రవర్తిస్తున్నరు
కులమత విద్వేషం చిమ్మి
నెత్తుటేరులు పారిస్తున్నరు
సకల సంపదల కొల్లగొట్టి
సంపన్నుల పాల్జేస్తున్నరు
బతుకులను కుప్పకూల్చి
మందిరాల్ని నిర్మిస్తున్నరు
గొంతెత్తే గళాల తెగ్గోస్తున్నరు
పిడికిలెత్తే శక్తుల నిషేధిస్తున్నరు
రణమెత్తే వీరుల నిర్బంధిస్తున్నరు
ఏకంగా జన ప్రాణాల తోడేస్తున్నరు
జనగణమా ! ఇపుడు
దీర్ఘమౌన పాటింపు కాదు
ధిక్కార నాధమై ధ్వనించాలి
తలొంచి మోకరిల్లుట మరచి
సమర సింహంలా గర్జించాలి
భయంతో వణుకుట విడిచి
బడబాగ్నిలా ప్రజ్వలించాలి
అచేతనావస్థను త్యజించి
చైతన్య కెరటమై హోరెత్తాలి
బానిసగిరిని భహిష్కరించి
బాహుబలిలా కదంతొక్కాలి
పోరు దండులా ముట్టడించి
నియంతల్ని తరిమికొట్టాలి
స్వేచ్చా పతాక నింగిన ఎగరేసి
శ్రమైక జీవనగీతం పల్లవించాలి
– కోడిగూటి తిరుపతి, 9573929493