శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూలవిరాట్ విగ్రహంపై మిస్టరీ

•మూలవిరాట్ పురాతన విగ్రహం మాయం?
•పొంతనలేని సమాధానాలిస్తున్న అధికారులు, పూజారులు, సిబ్బంది
•3 అడుగుల స్వయంభూ దేవాలయాన్ని 12 ఫీట్ల లోతుకు తవ్వారు
•కాకతీయ రాజు రుద్రదేవుడు కాలం నాటి శిలాశాసనం లభ్యం
•దేవాలయంలో బంగారు, వజ్రవైఢూర్యాలు నిధులున్నాయి
•శ్రీ లక్ష్మినరసింహా స్వామి భక్త సమితి నిజ నిర్ధారణ కమిటీ వెల్లడి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 26 : శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మూలవిరాట్ పురాతన విగ్రహం ఏమైందనేది మిస్టరీగా మారింది. దేవాలయం అధికారులు, ప్రధాన పూజారులు, ఇతర సిబ్బంది మూలవిరాట్ పురాతన విగ్రహంపై పొంతనలేని సమాధానాలు ఇస్తుండడం సందేహాలకు తావిస్తుంది. తద్వారా శ్రీ లక్ష్మీ నర్సింహస్వామి మూలవిరాట్ పురాతన విగ్రహాన్ని ఉద్దేశ్యపూర్వకంగానే మాయం చేశారని స్పష్టమౌతుందని దేవాలయాన్ని సందర్శించిన శ్రీ లక్ష్మి నరసింహస్వామి భక్త సమితి నిజనిర్ధారణ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్త సమితి అధ్యక్షులు ఎన్.ప్రభాకర్ రెడ్డి , కృష్ణంరాజు మాట్లాడారు. ఇటీవల తమ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిజ నిర్ధారణ కమిటీ యాదగిరిగుట్టను సందర్శించిందని, అక్కడ విషయాలను పరిశీలించి, నివేదికను సమర్పించిందని తెలిపారు. దీని ప్రకారం సుమారు మూడు అడుగులుగా ఉన్న స్వయంభూ దేవాలయాన్ని 12 ఫీట్ల లోతుకు తవ్వింది నిజమేనని తమ విచారణలో వెల్లడైనట్లు చెప్పారు. కాకతీయ రాజు రుద్రదేవుడి కాలం నాటి 1050 ఏళ్ల కింది శిలాశాసనం ఇటీవలే లభ్యమైందని, ఆయన రాజ్యం పరిసర ప్రాంతాలలోని దేవాలయాలకు బంగారం, వజ్రవైఢూర్యాలు, ఇతర రకాల దానాలు చేయాలని శాసనంలో రాసి ఉన్నదని, దాని ప్రకారం ఆయనతో పాటు అక్కడి భక్తులు దేవాలయానికి అనేక విలువైన ఆభరణాలను దానం చేశారని స్పష్టమౌతున్నదని కమిటీ సభ్యులు తెలిపారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో వైష్ణవ శేత్రమైన అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో కోట్ల రూపాయల విలువైన బంగారు, వజ్రవైఢూర్యాలు, ఇతర రకాలు కానుకలతో కూడిన నిధి ఉన్నదని, ఆ లెక్కన వైష్ణవ శేత్రమైన యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహాస్వామి దేవాలయం ప్రాంగణంలో కూడా విలువైన సంపద ఉండి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేవాలయ పునర్నిర్మాణంలో భాగంగా జరిపిన తవ్వకాలలో ఈ మేరకు సంపద బైటపడినట్లుగా భక్తులు, స్థానికులు చెబుతున్నారని పేర్కొన్నారు. అంతా తానై యాదాద్రిని అభివృద్ధి చేసినట్లు చెబుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ అసలు తవ్వకాలలో బైటపడిన వస్తువులు, తదితరాలను బాహ్య ప్రపంచానికి ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. దేవాలయంలో విలువైన సంపద బైటపడినందునే నిర్మాణ ప్రక్రియను అంతా గోప్యంగా జరిపించారని, బాలాలయాన్ని దూరంగా ఏర్పాటు చేసారని, పునర్నిర్మాణ పనులను భక్తులు గాని, ప్రజలను కాని చూడకుండా చేశారని వారు అన్నారు. మీడియా సమావేశంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్త సమితి కోశాధికారి మహేశ్వరరావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page