షాద్‌నగర్‌లోని గ్లాస్‌ పరిశ్రమలో భారీ పేలుడు

  • ఆరుగురు కార్మికుల దుర్మరణం
  • పలువురికి తీవ్ర గాయాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశ
  • కంప్రెషర్‌ పేలుడుతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణ

షాద్‌నగర్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28 : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని సౌత్‌ గాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపనీలో శుక్రవారం భారీ పేలుడు ఘటన సంభవించింది. పరిశ్రమలోని కంప్రెషర్‌ పేలడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. పేలుడు ధాటికి మృతుల శరీర భాగాలు చిన్నాభిన్నమై చెల్లాచెదరుగా పడిపోయాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. నలుగురు కార్మికుల ఆచూకి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా పేలుడు సందర్భంగా మంటలు చెలరేగడంతో సమీపంలోని దాదాపుగా పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. మృతులు ఒడిషా, యూపీ, బీహార్‌ రాష్ట్రాలకు చెందినవారిగా గుర్తించారు.

పరిశ్రమలో 30 మంది పనిజేస్తుండగా ప్రమాదం జరిగిన సమయంలో 20 మంది ఉన్నట్లు తెలుస్తున్నది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తూనే సహాయక చర్యలు చేపట్టారు. కాగా ఒకేసారి కంప్రెషర్‌ పేలడంతో ప్రమాద ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రాథమకంగా నిర్ధారణకు వొచ్చారు. క్షతగాత్రులను హుటాహుటిన మొదటగా సమీపంలోని హాస్పిటళ్లకు అనంతరం మెరుగైన వైద్యం కోసం గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లకు తరలించారు. కాగా గతంలోనూ ఇక్కడ ఈ తరహా ఘటన చేసుకున్న జరిగినప్పుడు కార్మికుల భద్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని చేసిన సూచనలను యాజమాన్యం ఎంతవరకు పాటిస్తున్నారనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page