భద్రతా కారణాల వల్ల రద్దయినట్లు సమాచారం
ప్రతి రోజు పాద యాత్ర అనంతరం సమీపంలోని ఏదో ఒక సెంటర్లో రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోమవారం పెద్ద షాపూర్ గేటు వద్ద రాహుల్ గాంధీ సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గం నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా భద్రతా కారణాల దృష్ట్యా రద్దయింది. దీంతో రాహుల్ సందేశం వినాలని వొచ్చిన ప్రజలకు నిరాశ మిగిలింది. జిల్లా కాంగ్రెస్ నాయకుల అవగాహన లోపం వల్ల రాహుల్ గాంధీ సభాస్థలికి వెళ్లలేక పోయారు. సభను ఇరుకైన ప్రాంతంలో ఏర్పాటు చేయడం, సభాస్థలి వద్ద కనీసం రాహుల్ గాంధీ సెక్యూరిటీ సిబ్బంది కూడా నిలిచేందుకు అవకాశం లేకుండా ఉండడం, పాదయాత్రలో పాల్గొన్న జనాలందరూ సభా ప్రాంగణంలో ఉండడానికి వీలు లేకపోవడంతో సభ రద్దయింది. రాహుల్ గాంధీ సభాస్థలి వద్దకు వెళ్లడం సరైనది కాదని భావించిన ఇంటెలిజెన్స్ ఇక్కడి పరిస్థితిని రాహుల్కు వివరించడంతో అతను సభకు రాలేకపోయారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు లేకలేక వొచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో విఫలమయ్యారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక జిల్లా నాయకుడు వొచ్చినప్పుడు చేసిన ఏర్పాట్లు కూడా రాహుల్ గాంధీ సభకు చేయలేదని విమర్శలు ఉన్నాయి. నియోజకవర్గంలో జరగాల్సిన ఏకైక సభను నిర్వహించుకోకపోవడంతో ఇక్కడి నాయకుల నిర్లక్ష్యం అలసత్వం బయటపడిందని, ఇది వొచ్చే ఎన్నికల పైన ప్రభావం ఉంటుందని వాదన అప్పుడే మొదలైంది. రాహుల్ సభ రద్దు కావడంతో సభకు వొచ్చిన ప్రజలంతా నిరాశతో వెనుతిరిగి వెళ్లారు. అయితే అంతకు ముందు పాదయాత్ర సందర్భంగా ఒక వ్యక్తి భత్రా వలయాన్ని ఛేదించుకుని హఠాత్తుగా వొచ్చి రాహుల్ గాంధీ కాళ్ల మీద పడే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటనతో నిశ్చేష్టులయిన భద్రతా సిబ్బంది అప్రమత్తమయి వెంటనే ఆ వ్యక్తిని భయటకు లాగారు. అయితే ఇది భద్రతా వైఫల్యమేననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ సభ రద్దు కావడానికి ఇది కూడా కారణం కావొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
షాపూర్ వద్ద రద్దయిన రాహుల్ కార్నర్ సభ
పాలమాకుల వద్ద రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు