విరసం సభల్లో సీనియర్ జర్నలిస్టు సిద్దిఖికప్పన్
విజయవాడ/(కాళోజీ జంక్షన్, హన్మకొండ), జనవరి 27, ప్రజాతంత్ర : భారతీయ సమాజంలో భావ ప్రకటన స్వేచ్చా సంక్షోభంలో చుక్కుకొని ఉందని కేరళ సీనియర్ జర్నలిస్టు సిద్దఖీ కప్పన్ అన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని మొఘల్ రాజపురం సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో విప్లవ రచయితల సంఘం 29 వ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విరసం రాష్ట్ర మహాసభలకు అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ సమావేశానికి అధ్యక్షత వహించగా కేరళ జర్నలిస్టు సిద్దిఖీ కప్పన్ ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. సంక్షోభ కాలంలో విరసం చేపట్టిన సభలను ఆయన అభినందించారు. రాజ్యాంగ వాద ఆలోచనలు కూడా సంక్షోభంలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు సనాతనవాద ముంగిట్లో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ మౌలిక అంశాలలో ఎంతో వైవిధ్యం ఉందన్నారు. రాజ్యాంగాన్ని అధికారం లో ఉన్న పాలకులు చేస్తున్న దుర్వినియోగం చర్యలు ప్రజలు గుర్తించాలని కోరారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి జాగరూకత లో ఉండాలని కోరారు. సభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు ప్రముఖ కవి జీ.లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ ప్రదాని మోడీ రామభక్తిని దేశభక్తిగా ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని చెప్పారు. రాజ్యాంగ వాద స్పూర్తిని దళిత బహుజనులకు స్పష్టత ఉందన్నారు.
రాజ్యాంగ వల్ల పెట్టుబడి దార్ల కంటే దళిత బహుజన వర్గాలకు లాభం జరిగిందని అన్నారు. బీజఢపీ హిందూత్వ రాజ్యం వస్తే ఏమీ చేయాలో ఇప్పుడు అదే అమలు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. యూపీలో ముస్లిం మైనారటీలు తమ పేర్లు చెప్పుకోవడానికి జంకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “ఫాసిస్ట్ సందర్భంలో రాజ్యాంగ వాదం” అనే అంశం మీద విరసం సీనియర్ సభ్యురాలు పి.వరలక్ష్మి మాట్లాడుతూ బ్రాహ్మణీయ హిందుత్వ వాదం దేశంలోని అన్ని రంగాలను చేజిక్కించుకున్నారని చెప్పారు. దాంతో ప్రజాస్వామిక విలువలను, సహజ జీవన సంస్కృతిని ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
లౌకిక ప్రజాస్వామ్య శక్తులు గుండె దిటవుతో ఎదుర్కొంటున్నాయన్నారు. బ్రాహ్మణీయ హిందుత్వ ఆర్థిక రంగంలో కార్పొరేట్ హిందుత్వ ఫాసిజంగా విస్తరిస్తుందని అన్నారు. మహా సభల్లో భాగంగా తొలుత అరణపతాకాన్ని కవి సంగ్రామ్ ఆవిష్కరణ చేయగా అమరవీరుల స్తూపాన్ని వీరమ్మ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి రివేరా, పాణి, శివరాత్రి సుధాకర్, సిఎస్ఆర్ ప్రసాద్, సంధ్యక్క, కోటి తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున సాహిత్య, సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురు కవులు, రచయితలు, కళాకారులు పాల్గొన్నారు.