సంచార విజ్ఞాన సర్వస్వాలు ఒద్దిరాజు సోదరులు

తొలి తెనుగుపత్రిక శత సంవత్సర వేడుకలు ఆధునిక తెలంగాణ చరిత్ర రచిస్తున్నప్పుడు ఆవశ్యం ప్రస్తావించవలసినది ఒద్దిరాజు సోదరుల సంపాదకత్వాన 1922 ఆగస్ట్‌ నుంచి 1928 వరకు వెలువడిన ‘‘తెనుగు పత్రిక’’.

ఈ శతబ్ది ప్రారంభంలో తెలంగాణా ప్రాంతంలో విజ్ఞాన చంద్రికలను, సాహిత్య సౌరభాలను వెదజల్లిన మహనీయులు, మహా మనీషులు, అత్యున్నత స్థాయి మేధావులు, సారస్వత మూర్తులు, బహుముఖ ప్రజ్ఞావంతులు, అనేక సృజనాత్మక కళలలో ఉద్ధండులు, పరిశోధనా తత్పరులు, బహు భాషల పండితులు, శతాధిక ఉద్గ్రంథ రచయితలు, కవీశ్వరులు, సంగీత పారంగతులు, వాస్తు, వైద్య తదితర శాస్త్రాల నిష్ణాతులు, పత్రికా సంపాదకులు ఒద్దిరాజు సీతారామ చంద్రరావు, రాఘవ రంగారావు సోదరులు. జంట కవులుగా, జంట రచయితలుగా వారు అఖిలాంధ్రా వనిలో ప్రఖ్యాతి పొందారు. సాహిత్య, సాంస్కృతిక రంగాలలో అద్వైత స్వరూపంతో ఒద్దిరాజు సోదరులు ఒనరించిన సమిష్టి కృషి, చారిత్రాత్మక సేవ నిరుపమానమయినవి. వారిది విశిష్ట సౌందర్యం.

‘‘త్రేతాయుగము నాటి రామలక్ష్మణుల సౌదర్యమునకు ఆధునికోదాహరణమీయన్నదమ్ములు’’ అని ఆచార్య బి.రామరాజుగారు చేసిన ప్రశంస సముచితమయినది. తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఒద్దిరాజు సోదరులు నిర్వహించిన పాత్ర సర్వదా స్తవనీయమయినది, స్మరణీయమయినది. ఒద్దిరాజు సోదరులలో అన్నగారు సీతారామ చంద్రరావు, తమ్ముడు రాఘవ రంగా రావు   గారు . వారి తల్లిదండ్రులు రంగనాయకమ్మ, వెంకటరామారావు. వరంగల్లు జిల్లా మానుకోట తాలుకా మారుమూల ఇనుగుర్తి గ్రామంలో వారిది భూస్వాముల కుటుంబం. ఉన్నత సంప్రదాయాలకు, వదాన్యతకు ఒద్దిరాజు సోదరులు పేరొందారు. సీతారామ చంద్రరావుగారి జన్మదినం 1887 సంవత్సరం ఏప్రిల్‌ 2వ తేదీ, రాఘవరంగారావు గారి జన్మదినం 1894 సంవత్సరం ఏప్రిల్‌ 4వ తేదీ.

ఒద్దిరాజు సోదరుల బహుభాషా పాండిత్యం, వివిధ ప్రక్రియలో వారి విరాట్‌ సాహిత్య కృషి, హాలికులుగా వారు ఆధునిక వ్యవసాయ రీతులలో ప్రదర్శించిన ఆసక్తి, వాయొలిన్‌, వీణ వాద్యాలతో వారు కనబరచిన సంగీత ప్రావీణ్య, వేదాలలో వారు వెలికి తీసిన విజ్ఞానశాస్త్ర విశేషాలు, విజ్ఞాన శాస్త్ర రచనలో వారి లేఖినికి గల అసాధారణ ప్రతిభ అచ్చెరువు కల్గిస్తాయి. వారు సంజీవ, సంచార విజ్ఞాన సర్వస్వాలనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ, ఫారసీ, తమిళం తదితర భాషలలో వారి వైదుష్యం అసాధారణమయినది. తమిళ భాషా విద్వత్తుతో ఒద్దిరాజు సోదరులు విశిష్టాద్వైత సంప్రదాయ విజ్ఞానాన్ని సంతరింపజేసుకున్నారు. సంస్కృత పాండిత్యంతో వారు నాలుగు వేదాలు, ఉపనిషత్తులతో సహా వైదిక వాజ్మయ సాగరాన్ని మధించి అమృత ఖండికలను తెలుగు పాఠకలోకానికి అందించారు.

సత్కవులయిన ఒద్దిరాజు సోదరులు హోమియోపతి వైద్యులుగూడ. ‘‘స్వయం కృషితో పది భాషలు నేర్చి, చౌర్యం తప్ప చతుషష్టి కళల మెలకువలు తెలిసి, సంస్కృతాంధ్రాంగ్ల భాషల్లో దాదాపు నూరు కృతులు రచించి, శతాధిక సంఖ్యాక విద్యార్థులకు అన్నదానము, విద్యాదానము చేసిన ఆ వదాన్య సోదరుల చరిత్రం చాల దొడ్డది. వారి ఇండ్లు లక్ష్మీ సరస్వతులకు నిలయాలు. రామలక్ష్మణ సౌదర్యం వారికి ఆదర్శం. వేద వేదాంగాలు, ద్రావిడ వేదం, సాహిత్యం, వేదాంతం, వ్యాకరణం, జంత్రవాద్యం, వైద్యం, జ్యోతిషం, స్థాపత్యం, ఛాయాచిత్ర గ్రహణం, వడ్రంగం, కమ్మరం, సూచికర్మ, చర్మకార విద్య, తాపీ పని ఈ విధంగా అనేక విద్యలు ఏక సంథా గ్రాహకులుగా కర తలా మలకం చేసుకున్న ఆ సోదరుల విద్యా సముపార్జనా వృత్తాంతాలు నమ్మరాని వాస్తవాలు..’’ అంటూ ఆచార్య రామ రాజు ఒక అక్షర దర్పణంల ఒద్దిరాజు సోదరుల వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని రేఖా మాత్రంగా చూపించారు.

 

బహుముఖ ప్రజ్ఞావంతులయిన ఒద్దిరాజు సోదరులు స్పృశించని రంగం లేదు. నాడు వంద   సంవత్సరాల కిందట నిజాం రాజరిక వ్యవస్థలో తెలంగాణా ప్రాంతంలో తెలుగు దీపం వెలిగించడానికి, సామాజిక చైతన్యం, సాహిత్య అభినివేశం కల్గించడానికి ఒద్దిరాజు సోదరులు స్వగ్రామం ఇనుగుర్తిలో (1918)లో విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాల నెలకొల్పి విజ్ఞానప్రద గ్రంథాలు ప్రచురించారు. ఆధునిక తెలంగాణ చరిత్ర రచిస్తున్నప్పుడు ఆవశ్యం ప్రస్తావించవలసినది ఒద్దిరాజు సోదరుల సంపాదకత్వాన 1992 ఆగష్టు నుంచి 1928 వరకు వెలువడిన ‘‘తెనుగు పత్రిక’’. ఒద్దిరాజు సోదరుల తమ సాహిత్య తపస్సులో విరచించిన విభిన్న గ్రంథాల సంఖ్య నూటముప్పయి వరకు ఉంటుందని పరిశోధనలో ప్రస్పుటమయింది. వారి అమూల్య రచనలలో కొన్ని నాటి అరాచకత్వంలో హింసాకారుల దహనకాండలో దగ్ధంకావడం, మరికొన్ని ఇతరుల చేతికి జిక్కి ప్రచురణ పొందకపోవం మన దురదృష్టం.

 

ఒద్దిరాజు సోదరులు ముద్రిత రచనల సంఖ్యకంటే ముద్రిత రచనల సంఖ్య అధికంగా ఉంది. కనీసం ఈ శతాబ్ధి సందర్బంగా నైనా  వారి అముద్రిత రచనల ప్రచురణకు, తద్వార తెలుగు సారస్వత పరిపుష్టికి దీక్ష వహించాలి. ఒద్దిరాజు సీతారామచంద్రరావు గారి ముద్రిత రచనలు : రుద్రమదేవి (918), శౌర్యశక్తి, భ్రమర, బ్రాహ్మణ సాహసం, స్త్రీ సాహసం, ముక్తలవ, ప్రేమ ప్రవాహం, మోహినీ విలాసం (1912), శశివిషాణము, సౌదామినీ పరిణయం, చేతి (1926), ఛాయాకరణము (1921), బాల విజ్ఞాన మంజూష (1920), రాఘవరంగారావు గారి ముద్రిత రచనలు  : వీరావేశము, పరాహముద్ర, పంచకూళకషాయము, విషములు`తచ్చికిత్సలు, సప్తపది,ఉత్తరగురు పరంపర, ముదలాయిదం, వణ్ణమాడజ్ఞల్‌, సుశీల మైనావతి. సోదరులు కలిసి రచించినవి : ఉపదేశరత్నమాల (1919), తిరుప్పల్లాండు, భక్తి సారచరిత్ర. సీతారామచంద్రరావు గారు 1956 జనవరి 28 నాడు రాఘవరంగారావు గారు 1973 మే నెల 17 నాడు పరమపదించినారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page