సంస్కరణలతో సోషలిజాన్ని పతనం చేసిన గోర్బచెవ్‌

  ‘‘ ‘‌సోవియట్‌ ‌యూనియన్‌ ‌లో సోషలిజం పతనం కావడంతో  మానవజాతి మహా ప్రస్థానం పెట్టుబడిదారీ విధానంతోనే పురోగమిస్తుంది’ అని పెట్టుబడిదారులు నాడు కోడై కుశారు. కాని అనతి కాలంలోనే లాటిన్‌ అమెరికాలో పలు సోషలిస్ట్ ‌ప్రభుత్వాలు ఏర్పడి నిరాటకంగా కొనసాగుతున్నాయి. ఏదిఏమైనా పెట్టుబడిదారీ పీఠాలు కదిలిపోవడం ఖాయం. ‘భవిషత్తు అంతా సోషలిజానిదే’ అని ఘంటాపథంగా  చెప్పవచ్చు. ’’

జార్‌ ‌చక్రవర్తుల నియంతృత్వ పాలన నుండి  రష్యాని విముక్తి చేసి ప్రపంచ చరిత్రలో  తొలిసారి మార్క్సిస్ట్ ‌సిద్ధాంతాన్ని అన్వయించి  సోషలిస్ట్ ‌ప్రభుత్వాన్ని స్థాపించి తద్వారా యూనియన్‌ ఆఫ్‌ ‌సోవియట్‌ ‌సోషలిస్ట్  ‌రిపబ్లిక్‌ ‌ని తీర్చిదిద్ది లెనిన్‌ ‌సరికొత్త చరిత్రని సృష్టించారు. సోషలిస్ట్  ‌వ్యవస్థని ఆచరణలో  శాస్త్రీయంగా ఆవిష్కరించిన లెనిన్‌ ‌తాను స్వల్ప కాలం పాటు మాత్రమే పాలించి రష్యా ని ఆధునీకరించి సూపర్‌ ‌పవర్‌ ‌గా తీర్చిదిద్దడంలో  విశేష కృషి చేశారు.  క్రమంగా సామ్రాజ్యవాద అమెరికాని ఢీకొట్టే దిశగా రష్యా ఎదగడం మొదలైనది. రష్యా మొదటి ప్రపంచ యుద్ధంలో  ఆసక్తి చూపడం కన్నా ఆధునిక రష్యాని తీర్చిదిద్దే  దిశగా  లెనిన్‌ అనుసరించిన విధానాలు దేశ ప్రగతికి ఎంతగానో దోహదం చేశాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. లెనిన్‌ ‌కాలం తర్వాత ఉక్కు మనిషి జోసెఫ్‌ ‌స్టాలిన్‌  ‌కాలం లోనూ రష్యా ఉత్కృష్ణ  ప్రగతిని సాధించింది. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఇంగ్లాండ్‌, ‌ఫ్రాన్స్, ‌జర్మనీ దేశాలు చతికిలపడి పలచనవడం దరిమిలా  అమెరికన్‌ ఆధిపత్యాన్ని సవాల్‌ ‌చేసే దిశగా రష్యా ఎదిగి అమెరికా ఏకధృవ ప్రపంచానికి అడ్డుకట్ట వేయడం ద్వారా ప్రపంచ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. నిజానికి ‘లెనిన్‌ ‌మరియు స్టాలిన్‌ ‌ల పాలనా కాలాన్ని సోషలిస్ట్ ‌పాలనలో ఉత్కృష్ణయుగం’’గా  పేర్కొనవచ్చు. ఆ తర్వాత వచ్చిన పాలకుల పాలనలో నామమాత్రంగా సోషలిస్ట్ ‌విధానాలు అమలు కావడం గమనార్హం.
జోసెఫ్‌ ‌స్టాలిన్‌ ‌పాలనతో ప్రభావితుడై కమ్యూనిస్ట్ ‌పార్టీలో చేరి అంచెలంచెలుగా పార్టీ పొలిట్‌ ‌బ్యూరో సభ్యునిగాను , కేంద్ర కార్యదర్శి గాను అంతిమంగా దేశ అధినేత గాను ఒదిగి ఎదిగిన మిఖాయిల్‌ ‌గోర్బచెవ్‌  ‌ప్రారంభంలో సరికొత్త ఒరవడిని సృష్టించారు. ఆయన జాతీయంగాను మరియు అంతర్జాతీయంగాను అనేక సమస్యలు పరిష్కరించారు. అమెరికా మరియు రష్యాల మధ్య సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ప్రచ్ఛన్న యుద్ధాన్ని ముగించే దిశగా ప్రయత్నించి అప్పటి అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్  ‌రీగన్‌ ‌తో  జరిపిన చర్చలు ఫలప్రదం కావడం ఫలితంగా ప్రచ్ఛన్న యుద్ధం ముగిసింది.  అయిననూ నేడు పలు  దేశాలు తమ ఆధిపత్యం చెలాయించడం కోసం యుద్ధాలు  సాగిస్తూనే ఉన్నాయి. తాజగా రష్యా – ఉక్రెయిన్‌ ‌దేశాల యుద్ధం మరియు చైనా – తైవాన్‌ ‌దేశాల యుద్ధ సన్నాహాలు ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.
మిఖాయిల్‌ ‌గోర్బచెవ్‌ ‌నోబెల్‌ ‌శాంతి బహుమతితో పాటు అనేక పురస్కారాలు పొందారు. ఆయన మొదట్లో నిబద్ధత కలిగిన కరడుగట్టిన మార్క్సిస్ట్-‌లెనినిస్ట్ ‌గా పేరు గడించి శాస్త్రీయంగాను మార్క్సిజం – లెనినిజానికి కట్టుబడి ఉన్నాడు. అయితే క్రమంగా ఆయన సంస్కరణలు అవశ్యమని భావించి ప్రతిసారి స్టాలిన్‌ ‌విధానాలను మెరుగుపరుస్తున్నని పేర్కొంటూనే స్టాలినిస్ట్ ‌వ్యతిరేక వైఖరితో ముందుకు సాగాడు. ఆయన క్రమానుగతంగా స్టాలిన్‌ ‌విధానాలను నిరశించసాగాడు. నికిటా కృచ్చెవ్‌ అనుసరించిన డీస్టాలినైజేషన్‌ ‌సంసంస్కరణలను సమర్థించాడు. సంస్కరణలే  సోషలిస్ట్ ‌వ్యవస్థని మరింత ఉన్నంతంగా తీర్చిదిద్దబడతాయని భావించి ఆయన ఆ దిశగా ముందుకు సాగారు.
మిఖాయిల్‌ ‌గోర్బచెవ్‌  ‌చివరి దశలో దార్శనికతని విస్మరించి పెరిస్ట్రోయికా మరియు గ్లాస్‌ ‌నాస్త్  ‌వంటి  సంస్కరణలు ప్రవేశపెట్టారు. సంస్కరణల ద్వారా ఆర్థిక రంగంలో మరింతగా  వృద్ధి జరుగుతుందని ఆయన  అసహేతుక నిర్ణయాలతో తప్పటడుగులు వేశారు. ప్రజలకు లభించిన అపరిమిత స్వేచ్ఛ తన ప్రభుత్వ మనుగడకు సవాలుగా నిలిచింది.   జనాగ్రహం కట్టలు తెంచుకోవడంతో అంతిమంగా యూనియన్‌ ఆఫ్‌ ‌సోవియట్‌ ‌సోషలిస్ట్ ‌రిపబ్లిక్‌ ‌పతనానికి దారితీసింది.   మిఖాయిల్‌ ‌గోర్బచెవ్‌ అనుసరించిన  దార్శనికత కొరవడిన అసహేతుక విధానాలతో డెబ్భై ఏళ్ల పాటు నిరాటకంగా కొనసాగిన తొలి సోషలిస్టు స్వప్నం ముక్క చెక్కలుగా ఛిద్రం కావడం పెను విషాదకరం. నేడు మిఖాయిల్‌  ‌గోర్బచెవ్‌ ‌మరణానంతరం సోషలిస్ట్ ‌వ్యతిరేక వ్యక్తులు మరియు శక్తులు గొప్ప యోధునిగా  కీర్తిస్తున్నాయి.  జన వ్యతిరేకతని పోగు చేసుకొని తీవ్ర ఆగ్రహావేశాలు కలిగి ఉన్న ఆయన సోషలిస్ట్ ‌వ్యతిరేక శక్తులకు ‘యోధుడు’గా  ఎలా కనిపిస్తున్నాడో అర్థము కావడం లేదు. ప్రపంచానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపిన లెనిన్‌ ‌పోరాటం, స్టాలిన్‌ ఉక్కు సంకల్పాన్ని అంతిమంగా సోషలిస్ట్ ‌వ్యవస్థ నిట్టనిలువునా కూలిపోవడానికి  దోహదపడిన ఆయనను సోషలిస్ట్ ‌వ్యతిరేక శక్తులు ఆ విధంగా ఆయనను కీర్తించడం సహజమే. అయితే ఆయన ప్రపంచ చరిత్రలో  గొప్ప యోధుడు ఎంతమాత్రం కానేకాదు అనే సాధారణీకరణ శ్రామిక జన బహుళ్యంలో గూడు కట్టుకొని ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే అధినేతగా ఆఖరు దశలో ‘నూతన ప్రపంచ ఉషోదయాన్ని సంస్కరణలతో అడ్డుకొని  సోషలిజం పతనానికి కారణభూతుడిగా నిలిచి తన చరిత్రని తానే సమాధి చేసుకున్న నేత’గా  ఆయనను పరిగణించవచ్చు. అయితే ‘సోవియట్‌ ‌యూనియన్‌ ‌లో సోషలిజం పతనం కావడంతో  మానవజాతి మహా ప్రస్థానం పెట్టుబడిదారీ విధానంతోనే పురోగమిస్తుంది’ అని పెట్టుబడిదారులు నాడు కోడై కుశారు. కాని అనతి కాలంలోనే లాటిన్‌ అమెరికాలో పలు సోషలిస్ట్ ‌ప్రభుత్వాలు ఏర్పడి నిరాటకంగా కొనసాగుతున్నాయి. ఏదిఏమైనా పెట్టుబడిదారీ పీఠాలు కదిలిపోవడం ఖాయం. ‘భవిషత్తు అంతా సోషలిజానిదే’ అని ఘంటాపథంగా  చెప్పవచ్చు.
image.png
జె.జె.సి.పి.బాబూరావు, 94933 19690.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page