కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం తెరలేపిందని మండిపడ్డారు. సమాఖ్య స్ఫూర్తి అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే అపహాస్యం పాలుచేస్తున్నదని ధ్వజమెత్తారు. ఉమ్మడి జాబితాలోని అంశాల్లో రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాల నెత్తిన రుద్దుతున్నదని విమర్శించారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ కేంద్రం తీరుపై మండిపడ్డారు. కేంద్ర రాష్ట్రాలు జోడు గుర్రాల మాదిరిగా ప్రగతిరథాన్ని నడిపించాలని రాజ్యాంగవేత్తలు కోరుకున్నారని కేసీఆర్ తెలిపారు. అందుకే సమాఖ్య స్వరూపాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. దిల్లీ గద్దె వి•ద కూర్చున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తున్నది. కూచున్న కొమ్మను నరుక్కున్న చందంగా రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయం మొత్తంలోంచి న్యాయబద్ధంగా 41శాతం వాటా రాష్ట్రాలకు చెల్లించాల్సిఉందని కేసీఆర్ పేర్కొన్నారు.
కేంద్రం ఈ వాటాను కుదించాలనే దురుద్దేశంతో పన్నుల రూపంలో కాకుండా సెస్సుల విధింపు రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటున్నదని అన్నారు. దీని ద్వారా రాష్ట్రాలకు 2022-23లో రావాల్సిన ఆదాయంలో 11.4 శాతం ఆదాయానికి గండి కొట్టిందన్నారు. అంటే రాష్ట్రాలకు 41 శాతం వాటా రావాల్సిన చోట 29.6 శాతం మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తున్నది. ఇది చాలదన్నట్లు రాష్ట్రాల ఆర్ధిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తున్నది. రాష్ట్రాలు ఎఫ్‌ఆర్బీఎం పరిమితిలో తీసుకునే రుణాల వి•ద సైతం కేంద్రం కోతలు విధిస్తున్నదని తెలిపారు. తెలంగాణ అప్పులన్నీ చట్టాలకు లోబడి, ఎఫ్‌ఆర్బీఎం పరిమితిలో తీసుకున్నవేనని అన్నారు. సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ..ఆదర్శాలను వల్లించే కేంద్ర సర్కారు ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. రైతు వ్యతిరేకమైన నల్ల చట్టాలను కేంద్రం ఈవిధంగానే రుద్దాలని చూసింది. ఆ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం తిరగబడటంతో తోక ముడిచింది. రాజధాని దిల్లీలో నిరసన చేపట్టిన రైతుల వి•ద విచక్షణా రహిత హింసను ప్రయోగించటమే కాకుండా, వారిని దేశ ద్రోహులుగా చిత్రించే ప్రయత్నానికి సైతం కేంద్ర సర్కారు ఒడిగట్టింది. చిట్ట చివరికి రైతుల పోరాటానికి తలవొగ్గి నల్లచట్టాలను వెనక్కి తీసుకున్నది. స్వయంగా దేశ ప్రధానే రైతులకు బహిరంగ క్షమాపణలు చెప్పవలసి వొచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు.
పసిపిల్లలు తాగే పాలు మొదలుకొని, శ్మశానవాటికల నిర్మాణం దాకా ప్రజల అవసరాలన్నిటి వి•ద కేంద్రం ఎడాపెడా పన్నులు విధిస్తూ పేద, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం మోపుతున్నదని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత, కేంద్రం ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ఉచితాలు అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయం అన్నారు. కేంద్ర సర్కారు అసమర్థ నిర్వాకం వల్ల దేశ ఆర్థికాభివృద్ధి కుంటుపడిందని కేసీఆర్ మండిపడ్డారు. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ నానాటికి తీసికట్టు నాగంభొట్లు అన్న తీరుగా ఎన్నడూ లేనంతగా పడిపోయింది. దేశంలో నిరుద్యోగం తీవ్రతరమౌతున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారని సీఎం కెసిఆర్ మండిపడ్డారు.