- నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలి
- యువజన సదస్సులో వర్చువల్గా ప్రసంగించిన మంత్రి కెటిఆర్
యువతలో సమాజం పట్ల అవగాహన, నైతిక విలువలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తమదైన లక్ష్యాలను నిర్ధేశించుకుని యువత ముందుకు సాగాలని, వారిని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రంగారెడ్డి జిల్లా నందిగామలోని కన్హా శాంతివనంలో జరుగుతున్న అంతర్జాతీయ యువజన సదస్సులో మంత్రి కేటీఆర్ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానవాభి వృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తులు, సంస్థలతో కలిసి పనిచేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలన్నారు. దీనికోసం ప్రభుత్వం కార్యక్రమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
ఇందులో ప్రభుత్వ పాత్ర పరిమితంగానే ఉండొచ్చు, కానీ ప్రోత్సహించడానికి తాము కృషి చేస్తామన్నారు. యువత విద్యార్థి దశలోనే సమాజం పట్ల అవగాహన పెంచేందుకు పాఠ్యాంశాల్లో మార్పులు తీసుకొస్తామని వెల్లడించారు. వాళ్లలో అభిరుచి, దయాగుణం, విలువలు నేర్పించేందుకు ప్రయత్నిస్తామని కేటీఆర్ అన్నారు. యునెస్కో ఎంజీఐఈపీ, ఏఐసీటీఈ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరుగనున్న ఈ సదస్సులో ప్రముఖ ధ్యాన గురువు కమలేశ్ పటేల్, వివిధ రాష్టాల్రు, ఇతర దేశాల నుంచి వచ్చిన యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.