ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబరు 15 : కల్వకుర్తి అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థిత్వం విషయంలో పార్టీ అధిష్టానం పునరాలోచించాలని బీ ఆర్ఎస్ జిల్లా నాయకుడు కమటం శేఖర్ కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున అభ్యర్థి మార్చకపోతే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం విలేకరుల తో శేఖర్ మాట్లాడుతూ… జైపాల్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని పార్టీ శ్రేణులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని అధిష్టానం గుర్తించాలన్నారు. ఉద్యమకారులను, పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలను జైపాల్ యాదవ్ విస్మరించి తన భజన పరులకు పెద్దపీట వేస్తున్నారని ఆయన వ్యక్తం చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న జైపాల్ యాదవ్ పై ఉన్న వ్యతిరేకత కారణంగా పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని శేఖర్ అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కి టికెట్ కేటాయిస్తే విజయం సునాయసమని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే విఫలమయ్యారనీ అనేక అభివృద్ధి పనులు శంకుస్థాపనల కే పరిమితమయ్యాయని శేఖర్ విచారం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఇప్పటికి రెండు పర్యాయాలు జైపాల్ యాదవ్ కు టికెట్ కేటాయించార నీ ఈసారి వేరొకరికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. సర్వేల ఫలితాలన్నీ ఎమ్మెల్సీ కసిరెడ్డికి అనుకూలంగా ఉన్న విషయాన్ని శేఖర్ గుర్తు చేశారు.