సలేశ్వరం ఓ మహాక్షేత్రం – అభివృద్ధికి పాటుపడండి !

‌రాష్ట్రం సిద్దించాక ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం (సమ్మక్క సారక్క) జాతరను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము.అలాగే ప్రభుత్వం యాదాద్రిని మహాక్షేత్రంగా తీర్చిదిద్ది ఈ మధ్యనే ప్రారంభించింది. దక్షిణ తెలంగాణలో ఎన్నో వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయాలు నేటికీ భక్తులతో పూజలందుకుంటున్నాయి.అందులో సలేశ్వరం,లొద్ది,ఉమా మహేశ్వరం,మల్లెలతీర్థం,పిల్లల మర్రి,మన్యంకొండ,అలంపూర్‌ ‌జోగులాంబ తదితర ప్రాంతాలలో ఆలయాలను అభివృద్ధి పరిచి, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం పూనుకుంటే మరో తరానికి అందించిన వారమవుతాము..

ఉమ్మడి పాలమూరు జిల్లా (మహబూబ్‌ ‌నగర్‌),‌ప్రస్తుత నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఈ మహా క్షేత్రం కొలువై ఉన్నది.ఉగాది పర్వదినం గడిచాక వచ్చే మొదటి ఛైత్రపౌర్ణమి రోజుకు ముందు రెండురోజులు,తర్వాత రెండు రోజులు మొత్తం ఐదు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవం ఎంతో కనువిందు చేస్తుంది ..దట్టమైన అడవి కారణంగా అటవీశాఖ అధికారులు మరియు అడవులలో నివాసముండే చెంచుల సహాకారంతో ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. జనసంచారం లేని అడవి అయినందున ఇక్కడ చెంచులే పూజారులుగా వ్యవహరిస్తారు.మొదట్లో ఈ దట్టమైన అడవిలో పులులు సంచరించేవి.కావున దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రంగా పేర్కొని,కేంద్ర ప్రభుత్వంచే 1973 లోనే టైగర్‌ ‌ప్రాజెక్టుగా పిలువబడుతుంది.ఈ మహా క్షేత్రాన్ని సందర్శించాలనుకుంటే భక్తులకు పలుమార్గాలు ఉన్నాయి. .

హైదరాబాద్‌ ‌నుండి శ్రీశైలానికి గల ప్రధాన రహదారి వెంట 150 కిలోమీటర్ల దూరం వెళ్ళిన తర్వాత ఫరహాబాద్‌ ‌గేటు నుంచి అడవిలోకి 32 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం వున్నది.అడుగడుగునా అటవీశాఖ అధికారుల సహాయ సహకారాలతో ఇక్కడికి చేరుకోవాలి.ఇక్కడ మరో విశేషమున్నది,ఫరహాబాద్‌ ‌నుండి పదికిలోమీటర్లు వెళ్ళాక దారికి ఎడమవైపున నిజాం కాలంనాటి భవనాలు శితిలావస్థలో కన్పిస్తాయి.వందసంవత్సరాల క్రితం నిజాం రాజు ప్రకృతి అందాలకు ముగ్దుడై వేసవి విడిది నిమిత్తం ఇక్కడ భవనాలను నిర్మించుకున్నారని, అందుకే ఈ ప్రాంతానికి ఫరహాబాద్‌ అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతుంది.కానీ వాహనాలు దేవుని ఆలయం దాకా వెళ్ళని పరిస్థితి,దాదాపు ఏడెనిమిది కిలోమీటర్లు నడక తప్పదు,దారులెలా ఉన్నా (ఈమధ్య కొన్ని మరమత్తులు చేయించి సులువు చేశారు) ఎలాంటి పరిస్థితి నెలకొన్న కూడా ఆ ప్రకృతి ఒడిలో ఎలాంటి ఒత్తిడి అన్పించకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో నీవద్దకు వస్తున్నామని శబ్దాలతో అక్కడికి చేరుకుంటారు.

Saleshwaram Mahakshetra

ప్రకృతి రమణీయతతో ఎత్తైన కొండలనుండి పాలనురుగులా జాలువారే జలపాతం,కొండల అడుగుభాగంలో లింగమయ్య గుడి,ఆ గుడి ముందర వీరభద్రుడు,గంగమ్మ విగ్రహాలు కన్పిస్తాయి.ఇరుకైన దారులు,రాళ్ళు రప్పలు,భయాన్నీ కల్గించే దారులున్నాకూడా ఇష్టంతో కష్టాలను లెక్కచేయకుండా సలేశ్వరం లింగమయ్యను దర్శించుకుంటూన్నారంటే అక్కడి మహాత్యం,ఆహ్లాదకరమైన వాతావరణం ఎలా ఉంటుందో తెలియకనే తెలుస్తుంది.ప్రమాదకరమైన దారులున్నాకూడా ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదంటే కారణం దేవుని మహాత్యమే నిదర్శనమని పలువురు చర్చించుకోవడం జరుగుతుంది. సలేశ్వరానికి ఇరుగుపొరుగు ప్రాంతాల నుండి భక్తులు అనేకమంది పాదయాత్రతో రావడం జరుగుతుంది. ఇక్కడికి పాదచారులు చేరుకోవడానికి మూడు దారులున్నాయి.అందులో మున్ననూర్‌ ‌నుండి అటవీ దారినుండి ఈ మహా క్షేత్రాన్ని చేరుకుంటారు,మరో పక్క బలమూరు మండలంలోని దావాగు నుండి ఇంకొంతమంది ఈ క్షేత్రాన్నీ చేరుకుంటారు, మరికొంతమంది లింగాల నుండి అడవిమార్గం ద్వారా ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తుంటారు.ఇంకో ప్రత్యేకతేంటంటే శ్రీశైలం మల్లిఖార్జునస్వామీ,సలేశ్వర లింగమయ్య స్వామీ,లుండి మల్లన్న,ఉమా మహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికి తెలిసినవి.ఇంకో ఐదవ లింగం నల్లమల్ల అడవిలో ఎక్కడుందో ఇప్పటికి రహాస్యంగానే మిగిలిపోయింది.

సలేశ్వర మహాక్షేత్రం గురించి కొన్ని చారిత్రక ఆధారాలు సైతం ఉన్నాయి.13 వ శతాబ్దంలోని మల్లిఖార్జున పండితారాధ్య చరిత్ర,శ్రీ పర్వత క్షేత్రంలో సలేశ్వర క్షేత్ర విశేషాలు,పాల్కురి సోమనాథుడు వివరించారు.17వ శతాబ్దం చివరలో ఛత్రపతి శివాజీ కూడా ఆశ్రయం పొందినట్లు చరిత్ర చెబుతుంది.ఇంత చారిత్రక నేపథ్యం కలిగిన సలేశ్వరంలో ఏప్రిల్‌ 14 ‌నుండి ఏప్రిల్‌ 17 ‌వరకు ఈ ఏడాదికిగాను,పలువురి భక్తులతో లింగమయ్య పూజలు స్వీకరించబోతున్నాడు. ప్రభుత్వ అధికారులు సైతం చెంచుజాతి సహాయ సహకారాలు తీసుకుంటూ, పకడ్బందీగా అన్నీరకాల సౌకర్యాలను ఏర్పాటుచేస్తూ,భక్తులకు చేదోడువాదోడుగా ఉంటున్నారు.. తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం ఆవిర్భవించాక,భద్రాచలం (భద్రాద్రి),మినహాయిస్తే చెప్పుకోదగ్గ పెద్ద ఆలయాలు లేవనిచెప్పాలి.

రాష్ట్రం సిద్దించాక ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం (సమ్మక్క సారక్క) జాతరను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము.అలాగే ప్రభుత్వం యాదాద్రిని మహాక్షేత్రంగా తీర్చిదిద్ది ఈ మధ్యనే ప్రారంభించింది. దక్షిణ తెలంగాణలో ఎన్నో వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయాలు నేటికీ భక్తులతో పూజలందుకుంటున్నాయి.అందులో సలేశ్వరం,లొద్ది,ఉమా మహేశ్వరం,మల్లెలతీర్థం,పిల్లల మర్రి,మన్యంకొండ,అలంపూర్‌ ‌జోగులాంబ తదితర ప్రాంతాలలో ఆలయాలను అభివృద్ధి పరిచి, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం పూనుకుంటే మరో తరానికి అందించిన వారమవుతాము.కాబట్టి సత్వరమే ప్రభుత్వం ఆలయాభివృద్దికి పూనుకోని అక్కడి పరిసర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా మలిచి భక్తులకు అన్నిరకాల సౌకర్యాలను,వసతులను కల్పిస్తే, కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించడం, పర్యాటకాభివృద్దికి దోహదబడినవారవుతారు కావున ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం.
– డా.పోలం సైదులు ముదిరాజ్‌,
M.A.,B.Ed.,Ph.D.
9441930361.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page