- 16న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభం
- దక్షిణ తెలంగాణ సాగునీటి రంగం చరిత్రలో మరో సువర్ణాధ్యాయం
- రైతాంగానికి గొప్ప పండుగ…
- 16న భారీ బహిరంగ సభ…17న పల్లెపల్లెనా ఊరేగింపులు
- విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6 : ఈ నెల 16న మధ్యాహ్నం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నార్లాపూర్ ఇన్ టేక్ నుంచి బటన్ నొక్కి బాహుబలి పంపు ద్వారా కృష్ణా జలాలను సిఎం కేసీఆర్ ఎత్తిపోయనున్నారు. ప్రపంచంలోనే మరెక్కడా లేని అత్యంత భారీ పంపులతో నిర్మితమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి దక్షిణ తెలంగాణ ప్రజల తాగునీరు సాగునీరు అవసరాలను ఈ ఎత్తిపోతలు తీర్చనున్నాయని సీఎం తెలిపారు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి స్వరాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతతో అనేక అడ్డంకులను దాటుకుని మోక్షం లభించడం చారిత్రక సందర్భమని స్పష్టం చేశారు. దశాబ్ధాల కల సాకారమౌతున్న చారిత్రక సందర్భంలో దక్షిణ తెలంగాణ రైతాంగానికి ప్రజలకు ఇది గొప్ప పండుగ రోజని సిఎం స్పష్టం చేశారు. అందుకోసం ప్రారంభమైన తెల్లారి(సెప్టెంబర్ 17న) ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లోని పల్లె పల్లెనా ఊరేగింపులతో ఈ విజయాన్ని పెద్ద ఎత్తున సంబురాలతో జరుపుకోవాలని అన్నారు.
ప్రారంభానికి పల్లె పల్లెనుంచి సర్పంచులు సహా తరలివచ్చే ప్రజలు కలషాలు తెచ్చుకుని వాటితో తీసుకెల్లిన కృష్ణా జలాలతో ఆయా గ్రామాల్లో దైవాల పాదాలను అభిషేకించి మొక్కులు చెల్లించుకోవాలని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం డా బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇప్పటికే పూర్తయిన ప్రాజెక్టుల పనులను సమీక్షించారు. ప్రాజెక్టు పరిథిలో కాల్వల తవ్వకం అందుకు సంబంధించి భూ సేకరణ సహా అనుబంధ పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను సిఎం కేసీఆర్ ఆదేశించారు.
ఇప్పటికే డ్రైరన్ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుని సిద్ధంగా వున్న ఎత్తిపోతల ప్రాజెక్టు వెట్ రన్‌ను సిద్ధంగా వున్నట్టు సమావేశంలో పాల్గొన్న ఇంజనీరింగ్ అధికారులు సిఎంకు వివరించారు. ఇంజనీర్ల సూచనల మేరకు ఈ నెల 16న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వెట్ రన్ ప్రారంభం కానున్నది. 16న కృష్ణా నదికి అనుసంధానించి, (శ్రీశైలం ఫోర్ ప్లో వద్ద) నార్లాపూర్ వద్ద నిర్మించిన ఇన్ టేక్ వద్దకు చేరుకొని అక్కడ స్విచ్ ఆన్ చేసి సిఎం పంపులను ప్రారంభిస్తారు. వెట్ రన్ ద్వారా బాహుబలి పంపుల గుండా ఎగిసిపడే కృష్ణా జలాలు సమీపంలోని నార్లాపూర్ రిజర్వాయర్‌కు చేరుకోనున్నాయి. మోటర్లు ఆన్ చేసిన వెంటనే సిఎం కేసీఆర్ నార్లాపూర్ రిజర్వాయర్ వద్దకు చేరుకుని రిజర్వాయర్‌కు ఎత్తిపోతల ద్వారా చేరుకుంటున్న కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
తెలంగాణ సాగునీటి రంగం చరిత్రలో మరో సువర్ణధ్యాయం లిఖించనున్నది. దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న తెలంగాణను సస్యశ్యామలం చేసే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించుకుంటున్న చారిత్రక సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు సిఎం తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రతి పల్లెనుంచీ సర్పంచులు గ్రామస్థులు ఈ బహిరంగ సభకు హాజరుకావాలన్నారు. ప్రారంభోత్సవం సహా బహిరంగ సభ నిర్వహణ, మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల పల్లెలనుంచి ప్రజలను ప్రారంభోత్సవానికి తరలించేందుకు చేపట్టాల్సిన రవాణా ఏర్పాట్లు, భోజన ఏర్పాట్లు ప్రభుత్వమే నిర్వహించాలనే సమావేశం ఏకాభిప్రాయం మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా సిఎం కేసీఆర్ ఆదేశించారు.
బుధవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు తదితర ప్రజాప్రతినిధులు, సీఎంఓ అధికారులు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సీఈలు తదితర ఇంజనీర్లు పాల్గొన్నారు. సమావేశంలో ఇంకా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సీఎం ముఖ్య సలహాదారు సోమేష్ కుమార్, ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, సీఎంఓ అధికారులు స్మిత సభార్వాల్, భూపాల్ రెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే , ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావు, ఇరిగేషన్ సలహాదారు పెంటారెడ్డి, సీఈలు రమణారెడ్డి, హమీద్ ఖాన్, ఇతర ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.