తెలంగాణ, ఏపి రాష్ట్రాల అధికారుల హాజరు కావాలని ఆదేశాలు
న్యూ దిల్లీ, డిసెంబర్ 05 : నాగార్జునసాగర్‌పై ఈ నెల 8న కేంద్రం సమావేశం జరుగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరుకావాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలు జారీ చేసింది. దిల్లీలో జరుగనున్న సమావేశానికి నేరుగా హాజరుకావాలని కేంద్ర జలవనరుల శాఖ ఆదేశించింది. అయితే తొలుత 6న సమావేశం ఉంటుందని లేఖలో చెప్పినప్పటికీ తుఫాను కారణంగా ఈ భేటీని 8కి వాయిదా వేసినట్టు కేంద్ర జలవనరుల శాఖ సమాచారం ఇచ్చింది. ఇదిలా వుంటే ఆంధప్రదేశ్ రాష్ట్ర తాగునీటి అవసరాలకు నాగార్జునసాగర్ నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణా బోర్డును ఆ రాష్ట్రం కోరింది. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ రెండు రోజుల క్రితం ఆదేశించిన విధంగా బోర్డు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశానికి ఏర్పాట్లు చేసింది. కమిటీ కన్వీనర్ బోర్డు సభ్యకార్యదర్శి రాయ్‌పురే నేతృత్వంలో సభ్యులైన తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీ, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీలతో సమావేశం జరగాల్సి ఉండగా వాయిదా పడిరది. దీనికి ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మాత్రమే హాజరయ్యారు.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు దీరాల్సి ఉండడం, ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందున ఈఎన్సీ హాజరుకానట్లు తెలిసింది. ఏపీ ఈఎన్సీ మాత్రం కమిటీ కన్వీనర్‌కు రాష్ట్ర అవసరాలపై నివేదిక ఇచ్చి వెళ్లినట్లు తెలిసింది. సాగర్ నుంచి తాగునీటిని 5 టీఎంసీలు విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. శ్రీశైలం, సాగర్‌లలో నీటి నిల్వలు, భవిష్యత్ అవసరాలపైనా చర్చించినట్లు తెలిసింది. సాగర్ డ్యామ్ నిర్వహణలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ నెల 2న కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి జోక్యం చేసుకున్న విషయం తెలిసిందే. సాగర్‌తో పాటు శ్రీశైలం జలాశయం నిర్వహణ, భద్రత పర్యవేక్షణపైనా రెండు రాష్టాల్రతో చర్చించేందుకు కేంద్రం ఈ నెల 6న దిల్లీలో సమావేశం ఏర్పాటు చేసింది. దీనికి తెలంగాణ నీటిపారుదల శాఖ బృందం హాజరయ్యేది, లేనిది తెలంగాణలో ప్రభుత్వం కొలువుదీరడంపై ఆధారపడి ఉంటుందని నీటిపారుదల వర్గాలు పేర్కొన్నాయి. గత నెలాఖరున సాగర్ డ్యామ్ నుంచి ఏపీ నీటిని విడుదల చేసుకోవడం, పోలీసులను మోహరించి కొంత భాగం డ్యాంను ఆధీనంలోకి తీసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే.