సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేయాలని

కందుకూరు,ప్రజాతంత్ర,నవంబర్ 17 : దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి కోరారు. కేసీఆర్‌ది సంక్షేమమని,ప్రతిపక్షాలది సంక్షోభమని మంత్రి పేర్కొన్నారు.శుక్రవారం కందుకూరు మండలంలోని మాదాపూర్, కోలన్ గూడ,గుమ్మడివెల్లి,ఆకుల మైలారం, మీర్ ఖాన్ పేట్,అన్నోజిగూడ,గూడూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనవని,ప్రజలు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఎన్నో పథకాలను అమలు చేస్తున్న కారు పార్టీ ప్రజలవైపు ఉంటే ఎన్నికలు సమీపించగానే ప్రజల ముందుకు వచ్చి మొసలి కన్నీరు కార్చే కాంగ్రెస్,బిజెపి మరో వైపు ఉన్నాయని పేర్కొన్నారు.రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తుంటే, కేవలం మూడు నుంచి నాలుగు గంటలు వ్యవసాయ కరెంటు ఇస్తున్న కర్ణాటక మోడల్ ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం దివాళాకోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.మరో వైపు సందర్భం దొరికిన ప్రతీ సారి తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదీ వైఖరిని కూడా అర్థం చేసుకోవాలని కోరారు.తెలంగాణ రాష్ర్టానికి గుండు సున్నా ఇచ్చిన మోదీ దేవుడని బిజెపి నాయకులు అంటున్నారని మండిపడ్డారు.ఇప్పటివరకు తెలంగాణలో అభివృద్ధి,సంక్షేమం చేసింది కేసీఆరేనని,ఇకముందు చేయబోయేది కూడా కేసీఆరేనని పేర్కొంటూ తిరిగి బిఅర్ఎస్ పార్టీని గెలిపించి కేసీఅర్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు రైతుబంధు,రైతు భీమా కార్యక్రమాల్ని ప్రారంభించి రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వం కేసిఆర్ ప్రభుత్వమని పేర్కొన్నారు.రైతులకు కల్పిస్తున్న భీమా సౌకర్యం మాదిరిగానే ఇతరులకు ఐదు లక్షల కేసీఆర్ భీమా సౌకర్యాన్ని కల్పించబోతున్నారని మంత్రి పేర్కొన్నారు.తెల్లరేషన్ కార్డు కలిగిన కుటుంబాలందరికి సన్న బియ్యం అందించబోతున్నామని మంత్రి తెలిపారు. ప్రతి పేద మహిళలకు నెలకు 3వేల  రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించబోతున్నామని,అదేవిధంగా 4వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లను కూడా అందిస్తామని హామీ ఇచ్చారు.అసరా పెన్షన్ ను 5016 కు పెంచబోతున్నామని, అన్ని వర్గాల ప్రజలు బిఅర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు.అసైన్డ్ భూములు కలిగిన రైతులకు పట్టా భూములు కలిగిన రైతుల వలే పూర్తి హక్కులను కల్పించబోతున్నామని మంత్రి హామీ ఇచ్చారు.స్థానికంగా ఏర్పాటయ్యే వివిధ పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు దక్కేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.మహేశ్వరం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మాజీ శాసనసభ్యులు తీగల కృష్ణారెడ్డి పేర్కొన్నారు.ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు జయేందర్, జడ్పిటిసి సభ్యుడు జంగారెడ్డి,మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి,సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్,పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు లక్ష్మీ నరసింహరెడ్డి,సర్పంచ్ లు,ఎంపీటీసీలు,పార్టీ నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు,ఉప సర్పంచ్లు,వార్డు సభ్యులు,సొసైటీ,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page