19వ శతాబ్దంలో క్రియాశీలక సామాజిక ఆలోచనపరులు మహాత్మా జ్యోతిరావు పూలే. అక్షరాలను ఆయుధంగా చేసుకొని సమాజంలోని అణగారిన వర్గాలైన గ్రామస్తులు, రైతులు, కార్మికులు, మహిళల జీవితాల్లో జ్ఞాన వెలుగులు నింపిననారు.వారికి సహజ,మానవ హక్కులను కల్పించడం కోసం తన జీవితమంతా పోరాడాడు.జ్యోతిరావు పూలే పాశ్చాత్య దేశాల్లో ని ప్రజాస్వామ్య విలువలను సంస్కృతిని జీవన విధానాన్ని అధ్యయనం చేశారు.’థామస్ పైన్ రాసిన రైట్స్ ఆఫ్ మాన్’ అనే పుస్తకం ద్వారా ప్రభావితం అయ్యాడు.అమెరికా స్వాతంత్య్ర పోరాటం ఆయనను ప్రభావితం చేయడమే కాకుండా మానవతా విలువలైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపజేసింది.అణగారిన జీవితాలలో అక్షర జ్యోతులు వెలిగించిన మహనీయుడు సమాజంలో పేరుకుపోయిన మూఢ విశ్వాసాలను, అజ్ఞానానికి కారణమైన బ్రాహ్మ ణాధిక్యతను కూకటివేళ్ళతో పెకిలించాలంటే విద్యయే సరైన మార్గం అని నిర్ణయించు కున్నారు. విద్య ద్వారానే సమాజాన్ని మార్చాలని అణిచివేయబడుతున్న అణగారిన వర్గాల జీవితాల్లో అఖండ అక్షర జ్యోతులు వెలిగించి చైతన్యపరిచిన మహనీయుడు. విద్యావ్యాప్తి కోసం ఆజన్మాంతం ఆధిపత్య వర్గాలతో అక్షర యుద్ధం చేసిన గొప్ప సంఘసంస్కర్త, అసమానతలను ఛేదించిన క్రాంతిరేఖ, అణగారిన వర్గాల ఆశాజ్యోతి,ఆదిగురువు మహాత్మ జ్యోతిరావు పూలే .వివక్షతలకు ఎదురొడ్డి నిలిచిన ధీరుడు బ్రాహ్మణాధిక్యతను వ్యతిరేకిం చవలసిందిగా సామాన్యులని ప్రోత్సాహి ంచాడు. కులం పేరుతో తరతరాలుగా అణి చివేత కు గురవుతున్న బడుగు, బలహీన వర్గాలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి సాధికారత కోసం కృషి చేశాడు.
సమాజంలో సగ భాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని పూలే భావించారు.మొదట సమానత్వం,మానవ విలువలు తన ఇంటి నుండే ప్రారంభం కావాలని నిరక్షరాస్యులైన సహచరి సావిత్రి బాయి పూలే కు విద్యాబుద్ధులు నేర్పి సఫలీకృతుడయ్యాడు.సామాజిక రుగ్మతలను పరిష్కరించడానికి మహిళలకు,అణగారిన వర్గాల కు విద్యను అందించండం ద్వారా భారతదేశంలో కుల వ్యవస్థ సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా అండగా నిలబ డేటట్లు తీర్చిదిద్దాడు. ఆనాటి సమాజపు పితృస్వామ్య, బ్రాహ్మణ సంబంధాలకు ఆదర్శ దంపతులిద్దరూ సవాలు విసిరారు.మనువు అనే కవిత లో ‘‘సావిత్రి బాయి పూలే రాస్తూ బ్రాహ్మణులకు మనుస్మృతి చెబుతుంది, వ్యవసాయంలో మీ శక్తి ని వృధా చేసుకోకండి, శూద్రులు గా జన్మించిన వారు గతంలో పాపాలు చేసినందున పరిహారం వారే చెల్లించుకు ంటున్నారు’ (సావిత్రి బాయి పూలే ,కావ్యా పూలే 1934)వితంతువులు ఎదుర్కొం టున్న పరిస్థితులను దుర్భర పరిస్థితులను తెలుసుకొని వారి కోసం ఆశ్రమాన్ని స్ధాపించారు.వితంతువు ఐన మహిళలలకు క్షౌరం చేసే ఆనవాయితీకి స్వస్తి పలకాలన్నారు.శిశుహత్యలు, బాల్య వివాహాల నివారణ కోసం ప్రత్యేక చొరవ తీసుకోని అండగా నిలబడ్డారు.జ్యోతిరావు పూలే రచనలు అతని కాలంలోని వైవాహిక పద్దతులను సవాలు చేశాయి.స్త్రీ, పురుష లింగ వివక్షతను పూలే విమర్శించారు.స్త్రీ పురుషులలో స్త్రీలే ప్రక్రతి పరంగా ఆధిపత్యం కలవారు. స్త్రీ నిస్వార్థ హృదయంతో అందరిని సంరక్షిస్తుంది. స్రీలు పడుతున్న అగచాట్లను వారి పట్ల కొనసాగుతున్న వివక్ష తను ముక్త కంఠంతో ఖండించాడు. స్త్రీల సాధికారతే సమాజాభివృద్ధికి దోహద పడుతుందని అనేవారు.
హక్కుల దీన బంధు పూలే…
ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ హక్కులు కావాలని కోరాడు. కార్మికుల, రైతుల, మహిళల హక్కుల కోసం అలుపెరుగని పోరు చేశాడు. ప్రత్యేకంగా పత్రికల ద్వారా భావ ప్రచారం చేసి వారిలో ప్రశ్నించే తత్వాన్ని పెంచారు. బ్రాహ్మణీయ ఆధిపత్య వ్యతిరేక కార్యక్రమాలే కాకుండా బ్రిటీష్ వలస వాదులకు వ్యతిరేక ంగానూ, శూద్ర వర్గం పై ఆధిపత్య వర్గాల దోపిడీని బయట పెట్టారు. శూద్ర వర్గంపై భావ జాల దాడిని తీవ్రంగా ఖండించారు. వేదాలు, మతం పేరుతో వారిపై జరిపే ఆధిప త్యాన్ని నిరసించారు.వారిలో ఆత్మ గౌరవాన్ని నింపేం దుకు చైతన్య జ్వాలలను రగిలించాడు.మలినమైన మానవ మస్తిష్కాలను తన అక్షరాలతో శుభ్ర పరిచారు.
నాటి పూలే స్ఫూర్తి నేడు ఎందుకు కొరవడింది
అజ్ఞానం, బానిసత్వపు ఆనవాళ్ళు ఉన్న ఆనాటి సమాజంలో తన సామాజిక తాత్విక చింతన, మేధస్సు ద్వారా సమతా సమాజం వికాసం కోసం పరితపించారు. సమానత్వ ఆకాంక్ష, మానవ విలువల పెంపుదల లక్ష్యంగా ప్రకటించుకొని పీడిత ప్రజల అభ్యున్నతికి పాటుపడ్డారు. కుల, మత ద్వేషాలను దుయ్యబట్టారు.కాని నేడు ఆ స్ఫూర్తి కొరవడింది.ఆనాడు అనాగరికమైన అజ్ఞానం నుండి నాగరికమైన మానవవికాసం కోసం కృషి సల్పితే నేటి పాలకులు కొరోనా సమయంలో వ్యవహరించిన తీరు మరల అజ్ఞానం వైపు పయనిస్తున్నట్లు అనిపిస్తుంది. భారతదేశం వైజ్ఞానిక విప్లవం సాధించినది అని చెప్పుకునే పాలకులు చప్పట్లు కొట్టించడం, లైట్లను ఆర్పివేయడం లాంటి విధానాల అమలు ఏ నాగరికత అభివృద్ధికి నిదర్శనం.?మతం పునాదుల మీద రాజకీయాలు నడవాలన్నది నేటి పాలకుల లక్ష్యం. ఏ కుల,మత జాడ్యాలను పూలే నిరసించాడో దానికి భిన్నంగా ఈనాటి పాలకులు ఆ కుల పునాదుల పై జరిగే అభివృద్ధే నిజమైన అభివృద్ధి అని, అదే నిజమైన సంక్షేమం అని ప్రగల్భాలు పలుకుతున్నారు.
విద్యా వికాసం చెందాల్సిన చోట నేరమే రాజ్యమేలుతుంది. హక్కుల అడగాల్సిన చోట రక్షణ కోరవలసి వస్తుంది.మహిళలపై, ఆదివాసీలు, దళితుల, మైనారిటీ ల ఆత్మ గౌరవం అటకెక్కింది. మానవతావాదాన్ని మరిచి మానవ విలువలు లోపించిన మనుధర్మాన్ని అమలు చేస్తున్నారు. ఇదేనా పూలే స్ఫూర్తి.! మనుస్మృతి ఆవిష్కరణ పేరు మీద చేసే హడావుడి దేనికి సంకేతం.? అణగారిన వర్గాల రక్షణ కోసం రాజ్యాంగంలో కల్పించిన రక్షణలకు, రిజర్వేషన్లకు మంగళం పాడుతున్నారు.ప్రపంచానికి లౌకిక విలువలను నేర్పిన నేల మీద మతం ఊడలై బుసలు కొడుతుంది. విజ్ణానానికి నెలువైన విశ్వ విద్యాలయాలు యంత్రాల మెదళ్లను తయారు చేసే కేంద్రాలుగా మారాయి.ఏ విద్యా అవకాశాలు ఐతే నిమ్న వర్గాల జీవితాలలో వెలుగులు నింపుతాయని పూలే భావించారో అది నేడు కార్పోరేట్ కబంధ హస్తాలలో చిక్కుకుంది.ఆత్మ గౌరవం కోసం కులం లేని సమతా సమాజం నిర్మాణం కోసం పూలే ఆలోచనలు చేస్తే నేటి పాలకులు కులం పునాదుల మీద విభజించి పాలిస్తున్నారు. సామాజిక సమానత్వమే సరైన మార్గమన్న చోట సామాజిక వివక్షతలను పెంచి పోషిస్తున్నారు. ఇలాంటి చర్యలన్నీ పూలే స్ఫూర్తికి విరుద్ధం. మనం ప్రపంచ మేధావిగా కొలిచే డా:బి.ఆర్ అంబేద్కర్ పూలే ని తన ఉద్యమ గురువులల్లో ఒక గురువుగా భావించిన సందర్భం.. అసమానతలు లేని సమాజం కోసం ఆయన పడ్డ శ్రమ,తపన వెలకట్టలే నంతది. ఈ సమాజం చేత ‘‘మహాత్ముడు’’ అని పిలిపించుకున్న గొప్ప మానవతావాది పూలే. వారి ఆశయాల సాధన కోసం, వారు కళలు కన్న వివక్షతలు లేని ఆధునిక సమాజ నిర్మాణమే లక్ష్యంగా పోరాడడం.ఆ దిశగా మనమందరం కలిసి అడుగులేద్దామని తెలంగాణ విద్యావంతుల వేదిక ఆశీస్తుంది.ఆ మహనీయుని జన్మదినం సందర్భంగా తెలంగాణ విద్యావంతుల వేదిక స్మరించుకుంటూ పూలే స్పూర్తిని కొనసాగిస్తుంది.
– పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192