సామాన్య ప్రజలు సంతోషపడేలా పని చేయాలి

రెవెన్యూ వ్యవస్థలో మార్పు రావాలి
ప్రభుత్వ భూములను పరిరక్షించాలి 
ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారి
రెవెన్యూ సంఘాల సమావేశంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ప్రజాపాలనలో ప్రజలు కేంద్ర బిందువుగా తమ  ప్రభుత్వ నిర్ణయాలు, ఆలోచనలు  ఉంటాయని వాటిని దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజలు సంతోషపడేలా రెవెన్యూ శాఖలోని అధికారులు, సిబ్బంది సమిష్టిగా చిత్తశుద్ధితో పని చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  అన్నారు. రెవెన్యూ శాఖలోని ఐదు సంఘాలతో శనివారం నాడు సచివాలయంలో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ “మీ పని తీరు మరింత మెరుగు పడాలి.
గతంలో పని చేసిన విధానం వేరు, ఇప్పుడు వేరు. ఏమైనా ఉంటే పాత వాసనలు పక్కకు పెట్టండి. నిజాయితీ, నిబద్ధతతో పారదర్శకంగా పనిచేయండి. రెవెన్యూ యంత్రాంగం పాజిటివ్ దృక్పథంతో పని చేస్తూ ప్రజల్లో ఒక నమ్మకాన్ని కల్పించాలి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి.  మాది ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వం. ఎవరిమీద వ్యక్తిగత కోపాలు లేవు. మా తపన అంతా ఈ పేద ప్రజానీకానికి మేలు చేయాలన్నదే. రాబోయే రోజుల్లో రెవెన్యూ వ్యవస్థలో స్పష్టమైన మార్పు కనిపించాలి. ప్రభుత్వానికి రావలసిన ప్రతి రూపాయి రావాల్సిందే, ప్రతి అంగుళం రావాల్సిందే, గజం భూమి కూడా కబ్జాకు గురి కావొద్దు.
ప్రభుత్వ భూములను కాపాడే విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా న్యాయపరంగా గట్టిగా వ్యవహరించాలి. ఈ విషయంలో సరైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి వీలుగా సచివాలయంలోని రెవెన్యూ ముఖ్య కార్యదర్శి కార్యాలయంలో ప్రత్యేకంగా లీగల్ సెల్ ను ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వం తగిన ప్రత్యామ్నాయాలు సూచించకుండా వీఆర్‌ఓ, వీ‌ఏ‌ఓ వ్యవస్థను రద్దు చేయడం వల్ల, గ్రామీణ ప్రాంతాలలో రెవెన్యూ వ్యవస్థ లేకుండా పోయిందని, ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి ఉండేలా రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page