సింహాద్రి అప్పన్నకు సంప్రదాయ చందనోత్సవం… భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణం

‘‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌ ‌నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమా మ్యహమ్‌’’…
‘‘‌సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్‌’’…

దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన సింహాచల క్షేత్రంలో స్వామి వారికి ఆషాఢ పౌర్ణమి నాడు చందనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ నాడు సింహాచల వరాహలక్ష్మీ నరసింహుని నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది. అప్పటి నుంచి వైశాఖం, జ్యేష్టం, ఆషాఢ మాసాల్లో పూర్ణిమ తిథుల్లో నాలుగు విడతలుగా స్వామికి చందనం సమర్పణ చేస్తారు. అలా ఆ అక్రమంలో ఆషాఢ పౌర్ణమి నాడు స్వామివారికి నాలుగవ విడత  చందనోత్సవం నిర్వహిం చడం సాంప్రదాయం.
సింహాద్రి అప్పన్న భక్తులచే పిలవబడే లక్ష్మీనరసింహ స్వామి కొలువైన దివ్యక్షేత్రం సింహాచలం. దక్షిణ భారత దేశంలో కొలువైన వైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖమై నదిగా పేర్కొనబడుతోన్న ఈ ఆలయానికి తిరుమల తర్వాత అంతటి ప్రాముఖ్యత, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. పరమ విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు సింహాచలం లోని నహసింహ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని ప్రతీతి. తన తండ్రి, రాక్షసుడైన హిరణ్యకశిపుడు విష్ణువును చూపించమంటూ స్థంభాన్ని పగులగొట్టిన సమయంలో అందులోంచి మహావిష్ణువు అవతారంలో ప్రత్యక్షమై హిరణ్య కశిపుడిని సంహరించాడన్న పురాణ కథ విదితమే. పరమాత్మ సర్వ వ్యాపకుడు. ఈ సందేశాన్ని మనకు అందించినవాడు సింహాచల స్వామి. తనకోసం ప్రత్యక్షమైన నరసింహుడి అవతారాన్ని ప్రహ్లాదుడు మొదటగా సింహా చలంలో ప్రతిష్టించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే సింహాచలం లోని ఆలయాన్ని మాత్రం పురూరవుడనే రాజు నిర్మించినట్టు పురాణాలు వివరిస్తున్నాయి. పురూరవుడు సింహాచలం ప్రాంతాన్ని సందర్శిం చిన సందర్భంలో ఇక్కడ నేలలో కప్పబడిన నరసింహస్వామి విగ్రహం బయట పడినట్లు చెపుతారు.
image.png
పురూరవుడు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని అలాగే ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు స్వామి వారిని ఎల్లప్పుడూ చందనం పూతతోనే ఉంచే ఏర్పాటు చేశారు. అలా ఆనాడు మొదలైన ఆచారమే నేటికీ కొనసాగుతోంది. స్వామి వారిని ఏడాదిలో 12 రోజులు తప్ప మిగిలిన రోజులంతా చందనం పూతతోనే దర్శించాల్సి ఉంటుంది. చందనపు పూత కేవలం ఒక్కసారి మాత్రమే జరిగే క్రతువు కాదు. సంవత్సరానికి నాలుగు సార్లు మూడు మణుగుల చొప్పున స్వామివారికి చందనాన్ని సమర్పిస్తారు. అక్షయ తృతీయతో పాటుగా వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో మూడు మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి అందిస్తారు.
ఆషాఢ పూర్ణిమను సింహాచలంలో గిరిపున్నమి అని వ్యవహరిస్తారు.
ఆషాఢ శుద్ధ చతుర్దశి నాటి రాత్రి కొండ దిగువన ఉన్న తొలి పావంచా దగ్గర నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు. కాలి నడకన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేసి, కొండపైన స్వామిని దర్శస్తారు. గిరి ప్రదక్షిణం చేసిన భక్తులు మరు నాడు ఆలయంలో అప్పన్న ను దర్శించుకుంటారు. పున్నమికి ముందురోజు సాయంకాలం నుంచి 32 కిలో మీటర్ల దూరం కాలినడకన సింహాచల గిరి ప్రదక్షిణ చేసి వచ్చిన వేలాది భక్తులు పున్నమినాడు స్వామి దర్శనం చేసుకుంటారు. కొండ చుట్టూ తిరగలేని భక్తులు, ఆలయంలోనే ప్రదక్షిణం ఆచరించి స్వామి వారిని దర్శించి తిరిగి వెళతారు.
 – రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page