- జీరో ల్యాండ్ ఫిల్ పట్టణమే లక్ష్యం
- పొడి చెత్త రీసైక్లింగ్, తడిచెత్తతో సేంద్రీయ జీవ ఎరువు..బయోగ్యాస్
- 14వ వార్డులో రూ.1.20కోట్లతో వివిధ పనులకు మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన
- వెల్‌నెస్ సెంటర్ సిబ్బంది పని తీరుపై మంత్రి అసంతృపి
సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 20 : సిద్ధిపేటను చూసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వొస్తున్నారు. పట్టణం అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందింది. సిద్ధిపేటను శుద్ధిపేటగా మార్చుకున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. బుధవారం సిద్ధిపేట పట్టణంలోని 14వ వార్డులో ప్రజా అవసరాల రీత్యా నిత్యం పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ నేపథ్యంలో పాదాచారుల భద్రత కోసం ఫుట్‌పాత్ నిర్మాణం, ముస్తాబాద్ సర్కిల్ నుంచి ఛత్రపతి శివాజీ సర్కిల్ వరకూ రూ.1.20 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న వరద కాలువ, డ్రైనేజీ, ఫుట్‌పాత్ నిర్మాణ పనులకు మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఇంటింటా నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్తలో పొడి చెత్త రీ సైక్లింగ్ చేస్తున్నట్లు నిత్యం 10 నుంచి 15 టన్నుల తడి చెత్త ద్వారా బయోగ్యాస్ తయారు చేస్తున్నట్లు, 15 నుంచి 20 టన్నుల తడి వ్యర్థాలతో సేంద్రీయ జీవ ఎరువు తయారు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటి వరకూ 2522 మెట్రిక్ టన్నుల తడి చెత్తతో 756 క్యూబిక్ మీటర్ల బయోగ్యాస్ సిఎన్‌జి గ్యాస్ తయారైందని, అలాగే 579 టన్నుల తడిచెత్తతో సేంద్రీయ జీవ ఎరువు తయారైందని మంత్రి చెప్పారు. తద్వారా బుస్సాపూర్ డంప్ యార్డులో గుట్టలుగా పేరుకుపోయిన చెత్తకుప్పలు తొలగిపోయాయని, జీరో ల్యాండ్ ఫిల్ పట్టణమే లక్ష్యంగా కృషి ఫలితాలు, ప్రజాభాగస్వామ్యంతో నెరవేరుతున్నాయని మంత్రి వెల్లడించారు.
పట్టణంలో అవసరమైన చోట రోడ్లు, ఫుట్‌పాత్, అవసరమైన చోట మురికాల్వలకు 15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని, 14వ వార్డులో సిసి రోడ్లు, మురికి కాల్వలకు 50 లక్షలు రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు, ఈ వార్డులో వరద కాలువ, ఫుట్‌పాత్ పొడవు 1.5 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సిద్ధిపేటలో అన్నీ రకాల వైద్యం ప్రజలకు అందుబాటులో ఉన్నదని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సొంత ఇంటి స్థలం ఉంటే రాబోయే రోజుల్లో రూ.3 లక్షలు మంజూరు చేస్తామని, కొత్త రేషన్ కార్డులు, 57 ఏళ్లు దాటినా వృద్ధులకు ఫించన్లు త్వరలోనే మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సూడా ఛైర్మన్ మారెడ్డి రవీందర్‌రెడ్డి, మునిసిపల్ కమిషనర్ రవీందర్‌రెడ్డి, వార్డు కౌన్సిలర్ ఆలకుంట కవిత, టిఆర్‌ఎస్ నాయకులు కడవేర్గు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, పాల సాయిరాం, యెల్లు రవీందర్‌రెడ్డి, ఆలకుంట మహేందర్, గుండు భూపేష్, గంప రామచందర్‌రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 15వ వార్డులో సిసి రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
వెల్‌నెస్ సిబ్బంది పనితీరుపై మంత్రి అసంతృప్తి
సిద్ధిపేట పేరు కాపాడుదాం. ఉద్యోగులు, జర్నలిస్టుల కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి వెల్‌నెస్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. రోగుల పట్ల ఆప్యాయంగా, ఆధారంగా ఉంటే మీపై నమ్మకంతో ఇక్కడికి వొస్తారు. మీరు పట్టించుకోకుంటే ఎవ్వరూ ఇక్కడికి రారు. అది మీ చేతుల్లోనే ఉన్నది. మీ పనితీరు మరింత మెరుగ్గా ఉండాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వెల్‌నెస్ సెంటర్ వైద్యులు, సిబ్బందికి హితోపదేశం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట వెల్‌నెస్ కేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ కాశీనాథ్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రి సందర్శించిన సమయంలో పేషేంట్లు లేక పోవడంతో అందులో పనిచేసే వైద్యులు, సిబ్బందిని పిలిచి ఒక్కొక్కరి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రం నిర్వహణకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో ఉన్న రోగుల వివరాలు, వారి ఫోన్ నెంబర్ ఆధారంగా మంత్రే స్వయంగా ఫోన్ చేసి వైద్య సేవలపై వాకబు చేశారు. వెల్ నెస్ సెంటర్‌లో బాగా చూస్తున్నారా? మందులు ఇస్తున్నారా?అంటూ ఆరా తీశారు. అనంతరం అక్కడ పనిచేసే వైద్యులు గురించి తెలుసుకుంటూ..ప్రతి నిత్యం ఎంత మంది రోగులు వొస్తున్నారు? ఎలాంటి సేవలు అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఒక దశలో వెల్ నెస్ కేంద్రంలో 24 మంది సిబ్బంది పనిచేస్తూ ఉండగా రోగుల సంఖ్య ఎందుకు తక్కువగా ఉంటుందని ప్రశ్నించారు. తక్కువ మంది చూసే కంటే కేంద్రాన్ని మెడికల్ కళాశాల పరిధిలోకి బదలాయింపు చేద్దామంటూ సిబ్బందిని ప్రశ్నిస్తూ..మీ పని తీరు మార్చుకోవాలని సుతిమెత్తగా సూచించారు. మందులు ఉన్నాయా? సిబ్బంది డ్రెస్ ఎందుకు వేసుకోలేదని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ సమయ పాలన పాటించాలని సూచించారు. వెల్ నెస్ కేంద్రంలో వైద్యం అందిస్తున్న తీరు బాగా లేదని, మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీకి ఎస్‌సి సెల్ నేత కృష్ణ గుడ్ బై…మంత్రి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిక
నంగునూరు మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎస్‌సి సెల్ అధ్యక్షుడు దేవులపల్లి కృష్ణ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి మంత్రి హరీష్‌రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. టిఆర్‌ఎస్‌లో చేరిన కృష్ణకు మంత్రి హరీష్‌రావు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేవులపల్లి కృష్ణతో పాటు దేవులపల్లి శేఖర్, రాకేష్, పాకాల రమేష్, చేర్యాల రమేష్ పాకాల శివ తదితరులు కూడా టిఆర్‌ఎస్ పార్టీలో మంత్రి హరీష్‌రావు సమక్షంలో చేరారు. వీరందరికీ కూడా మంత్రి గులాబీ కండువాను కప్పి టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.