సి పి ఐ (మావోయిస్ట్) పార్టీ కోల్ బెల్ట్ ఏరియా లో తన ప్రాభవాన్ని పునరుద్ధరించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా…. సి కా స కార్యకలాపాలను విస్తరించడానికి గోదావరిఖని కి వచ్చిన మావోయిస్ట్ పార్టీ సభ్యుడిని అరెస్ట్ చేసి వారి ప్రయత్నాలు రామగుండం కమిషనరేట్ పోలిసులు ఆదిలోనే తిప్పి కొట్టడం జరిగిందని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్.,మీడియా కు తెలిపారు. మీడియా తో మాట్లాడుతూ….తేదీ 7 డిసెంబర్ 2023 రోజున సమయం రాత్రి 1-00 గంటలకు గోదావరిఖని పట్టణంలోని ఆర్ జీ – 1 ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయం జంక్షన్ వద్ద పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ ఉండగా ఒక వ్యక్తి చేతిలో సంచి తో సీఎస్పీ కాలనీ వైపు వెళ్తూ పోలిసులకు కనిపించినాడు. అతను అనుమానాస్పదంగా కనిపించడంతో పోలిసులు అతడిని సమీపించగా పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేసినాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని పట్టుకొని విచారించగా అతడు సి పి ఐ మావోయిస్ట్ పార్టీ సభ్యుడిగా…….సికాస కార్యకలాపాలను విస్తరించడానికి పార్టీ ఆదేశాలతో గోదావరీఖని కి వచ్చినట్టు తెలిపినాడు. నిందితుడు అవినాష్, బి. ఎస్. సి.(నర్సింగ్) పూర్తి చేసి తన గ్రామంలో ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉండే వాడు. ఆ క్రమంలో అక్కడ ఉన్న ప్రజా సంఘాల వారు కర పత్రాల ముద్రణ కోసం వచ్చి పోయే వారు. వారి పరిచయం ద్వారా సి.పి. ఐ . (మావోయిస్టు) పార్టీతో సంబంధాలు ఏర్పడి వారి భావజాలం పట్ల ఆకర్షితుడైనాడు. సుమారు రెండు సంవత్సరముల క్రితం సి.పి. ఐ . (మావోయిస్టు) పార్టీలో చేరి పని చేస్తున్నాడు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సింగరేణి కార్మిక సమాఖ్య విభాగం ఆదేశాల మేరకు తాను ఇక్కడ గోదావరిఖనిలో సికాస కార్యకలాపాలను విస్తరించే పనిలో భాగంగా గోదావరిఖని వచ్చినాడు. ఈ క్రమంలో నిన్న రాత్రి గోదావిఖనిలో వాల్ పోస్టర్లు అతికించి వెళ్లడానికి రాగా పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని గమనించి పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది అని సీపీ రెమా రాజేశ్వరి తెలిపారు.