- డెంగీ, మలేరియా, టైఫాయిడ్ విజృంభించకుండా చర్యలు
- ప్రతి శుక్ర, ఆదివారాల్లో మున్సిపాలిటీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్
- రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం
- సంబంధిత అధికారులకు మంత్రి హరీష్ రావు ఆదేశం
- కొరోనా కేసులు పెరుగుతున్నాయి.. బూస్టర్ డోస్ వేయించుకోవాలని ప్రజలకు సూచన
- సీజనల్ వ్యాధులపై మంత్రులు, అధికారులతో సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 25 : వర్షాలు తగ్గినా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభించే ఛాన్స్ ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. సోమవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సిఎంస సోమేశ్ కుమార్‌లతో కలసి సవి•క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రతి ఐదేళ్లకోసారి డెంగ్యూ వ్యాధి విజృంభించే అవకాశం ఉందన్నారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణంలో వొచ్చే మార్పుల వల్ల డెంగ్యూతో పాటు మలేరియా, టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా భదాద్రి, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయన్న మంత్రి… వాటి కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఐదేండ్ల క్రితం వర్షాలు తగ్గిన తర్వాత డెంగ్యూ వ్యాధి విజృంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం ములుగు, భదాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మలేరియా వ్యాధి ప్రబలుతుందని తెలిపారు. మలేరియా, డెంగ్యూ కేసులు పెరగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని, అన్ని జిల్లాల్లో కిట్స్ అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు. ప్రతి ఆదివారం హెల్త్ టీమ్ చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు. నిల్వ ఉన్న నీటి ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుందన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఈ సీజనల్ వ్యాధులు చాలా వరకు తగ్గాయన్నారు.
మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షిత మంచినీటి సరఫరాతో చాలా వరకు అంటూ వ్యాధులు, సీజనల్ వ్యాధులు కూడా చాలా తగ్గాయని స్పష్టం చేశారు. ప్రజలందరూ తమ తమ ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వనికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో, హాస్టల్స్‌లో మధ్యాహ్న భోజనం క్వాలిటీ ఉండేలా చూసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని హరీష్ రావు తెలిపారు. ఫుడ్ సేప్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. బూస్టర్ డోస్ వేసుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. కొరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నామన్నారు. ప్రజాప్రతిధులు, అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించినట్లు చెప్పారు. మంకీపాక్స్ వ్యాధి పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన ఇబ్రహీంకు మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం ఇబ్రహీమ్ ఫీవర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని, అతని నమూనాలను సేకరించి, పుణెలోని ఎన్‌ఐవీ ల్యాబ్‌కు పంపామని తెలిపారు. ఫీవర్ హాస్పిటల్‌లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.
డెంగ్యూ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న ఆయన..ప్రతి జిల్లాలో ప్లేట్‌లెట్‌ల కోసం హాస్పిటల్‌ను కేటాయించామని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో మలేరియా, డెంగ్యూ కిట్లు అందుబాటులో ఉంచామని, స్కూళ్లు, కాలేజీలు, ఇతర ప్రైవేట్ సంస్థల్లో ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. అదే విధంగా ఇక నుంచి క్రమం తప్పకుండా ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. అలాగే ప్రతి ఆదివారం మున్సిపల్, పంచాయతీ అధికారులు ఇంటింటికి వెళ్లి ఇన్స్‌పెక్షన్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా రోజురోజుకూ కొరోనా కేసులు పెరుగుతున్నయన్ని మంత్రి… రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కొరోనా విషయంలో అలసత్వం వద్దని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. మాస్కులు, సానిటైజర్లు కచ్చితంగా వాడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేయించుకోవాలని చెప్పారు. విదేశాల నుంచి వొచ్చిన వారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎవరికైనా మంకీ పాక్స్ లక్షణాలు ఉంటే దగ్గర్లోని ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని కోరారు. మంకీ పాక్స్‌కు సంబంధించి శాంపిల్ పరిశీలన కోసం గాంధీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్‌కు వెళ్లాలని మంత్రి కోరారు.